శుక్రవారం ఇందిరాపార్కు వద్ద బీఆర్‌ఎస్‌వీ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో కేటీఆర్
మోదీ ఎవరితో పెట్టుకోకూడదో వారితోనే పెట్టుకున్నారు
బీఆర్‌ఎస్‌వీ నిరసనలో కేటీఆర్
కేవలం నీట్ పేపర్ లీక్‌పైనే కాదు.. 12 ఏళ్ల బీజేపీ పాలనపై యువత ఆగ్రహం
లీక్‌లకు మోదీ సమాధానాలు చెప్పాలి.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి
విద్యార్థులకు సంపూర్ణ మద్దతు.. అవసరమైనప్పుడు కేసీఆర్ వస్తారు
సాక్షి, హైదరాబాద్: ‘ప్రధాని మోదీ ఎవరితో పెట్టుకోకూడదో వారితోనే పెట్టుకున్నారు. యువతరం సీబీఐ, ఈడీ దాడులకు భయపడే రకం కాదు.. వారి స్వరం మారుతోంది. శ్రీలంకలో ఈ యువతరమే ప్రభుత్వాన్ని పాతరవేసింది. తమ హక్కుల కోసం పోరాడుతున్న యువతరాన్ని తీవ్ర వాదులు, దేశద్రోహులు పాకిస్తానీలంటూ అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ఆగ్రహంతో ఉన్న యువత స్వరాన్ని అణచివేయాలని చూస్తే మీ ప్రభుత్వాన్ని ఒక్కో మెట్టు ఎక్కి తొక్కుతారు..’అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు హెచ్చరించారు. ఢిల్లీలో విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం అణిచివేతకు, దాష్టీకానికి పాల్పడుతోందని విమర్శిస్తూ భారత్ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం (బీఆర్‌ఎస్‌వీ) శుక్రవారం ఇందిరాపార్కు వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో కేటీఆర్ ప్రసంగించారు.
‘లీక్ ఇన్ ఇండియా’గా మార్చేశారు..
‘ఏ రాజకీయ నాయకుడి అండ లేకున్నా దేశ నలుమూలల నుంచి వేలాది మంది ఢిల్లీ జంతర్ మంతర్‌కు తరలి వస్తున్నారు. యువత ఆగ్రహం కేవలం నీట్ పేపర్ లీక్‌కు సంబంధించినదే కాదు. 12 ఏళ్లుగా కేంద్రంలోని బీజేపీ చేస్తున్న మోసాలు, ద్రోహాలపై వారు మండిపడుతున్నారు. పాలనను పక్కదోవ పట్టిస్తూ మతం పేరిట ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తప్పుకుంటున్న తీరును యువత అర్ధం చేసుకుంది. మేకిన్ ఇండియా అడిగితే ‘లీక్ ఇన్ ఇండియా’ను ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం నుంచి యువతరం జవాబుదారీతనాన్ని కోరుకుంటోంది. విద్యార్థులకు జరుగుతున్న నష్టాన్ని చూడలేక బీఆర్‌ఎస్ చేపట్టిన నిరసన వెనుక ఎలాంటి రాజకీయం లేదు.
ఇద్దరు పిల్లలకు తండ్రిగా విద్యార్థులకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈ నిరసనలో పాల్గొంటున్నా. యువతరం ప్రధాన మంత్రి కుర్చీనో, కేంద్ర మంత్రి పదవినో అడగడం లేదు. తమకు న్యాయం చేసి, భవిష్యత్తును కాపాడమని అడగడంలో అన్యాయం ఏముంది? మీడియా మద్దతు లేకున్నా సోషల్ మీడియా అండతో జెన్ జీ యువత దేశాన్ని కదిలిస్తోంది. 50 ఏళ్ల క్రితం ‘జీనాహైతో మర్‌నా సీఖో.. కదం కదం పర్ లడ్‌నా సీఖో’అంటూ తెలంగాణ గడ్డ మీద నుంచి ఒక యువకుడు ఇచ్చిన నినాద బలంతో దేశ యువత ప్రస్తుతం పోరాడుతోంది..’అని కేటీఆర్ అన్నారు.
భవిష్యత్తు నిర్మాతలు మేల్కొన్నారు..
‘రష్యా ఉక్రెయిన్ యుద్దాన్ని ఆపినట్లు చెప్పుకున్న ప్రధాని ఢిల్లీలో పిల్లల మీద జరుగుతున్న దాడిని ఎందుకు ఆపడం లేదు? మోదీకి వ్యతిరేకంగా గొంతు విప్పితే నొక్కేసే ప్రయత్నం చేస్తూ మీడియాను అడ్డుపెట్టుకుని వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. ఈ దేశ భవిష్యత్తు నిర్మాతలు మేల్కొన్నారు. మీడియాతో ఎజెండాను సెట్ చేసే రాజకీయం ఇకపై నడవదు. కాక్‌రోచ్‌లు ఢిల్లీలో దండయాత్ర చేస్తున్నాయి.
పిల్లలు గర్జిస్తుంటే విశ్వ గురువు నోరు విప్పడం లేదు. ‘పరీక్షా పే చర్చా’అంటూ ప్రసంగాలు చేసే ప్రధాని ప్రశ్నపత్రాల లీక్‌లకు సమాధానాలు చెప్పాలి. విద్యార్థుల డిమాండ్ మేరకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. విద్యార్థులపై దాష్టీకానికి పాల్పడి అక్రమ కేసులు నమోదు చేయడంపై క్షమాపణ చెప్పడంతో పాటు పోలీసు కేసులను వెనక్కి తీసుకోవాలి. రేప్ కేసుల్లో నిందితులుగా ఉన్న కేంద్ర మంత్రులు కుమారులకు బెయిల్ సులభంగా వస్తోంది కానీ పేపర్ లీక్‌లపై ప్రభుత్వం నుంచి సమాధానం ఎందుకు రావడం లేదో బీజేపీ నేతలు చెప్పాలి.
రాజకీయ ఎజెండాల పట్ల అప్రమత్తంగా ఉండాలి..
ఢిల్లీలో యువత, విద్యార్థులు చేస్తున్న పోరాటాన్ని పా ర్టీల జెండాలు, ఎజెండాలతో కలుషితం చేయొద్దు. ఎజెండాను హైజాక్ చేసే ప్రయత్నాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలి. స్వతంత్రంగానే మీ ఎజెండా మేరకు మీ ఉద్యమాన్ని కొనసాగించండి. పా ర్టీలతో కలిసి మీరు కొట్లాడితే మిమ్మల్ని ఆయా పార్టీల ఏజెంట్లు అని మీ ఉద్యమాన్ని, మీ డిమాండ్లను బలహీనపరిచే ప్రమాదం ఉంది. మీకు మా సంపూర్ణ మద్దతు ఉంటుంది. విద్యార్థులు, యువతకు అవసరమైన సమయంలో కేసీఆర్ వెంట నిలుస్తారు. కేంద్రం దిగి వచ్చే దాకా విద్యార్థులకు అండగా ఉంటాం..’అని కేటీఆర్ చెప్పారు.
నేను తప్పు చేస్తే నిరూపించి ఉరితీయించు
‘పేపర్ లీక్ అంశంపై రేవంత్‌రెడ్డి నాపై దు్రష్పచారం చేస్తున్నారు. నేను తప్పు చేస్తే నిరూపించి నన్ను ఉరి తీయి. నేను మోదీని ప్రశి్నస్తే రేవంత్‌రెడ్డి అనే కేడీకి కోపం ఎందుకు వస్తోంది? ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఢిల్లీలో కొట్లాడుతుంటే నల్లమల పులిని అని చెప్పుకునే రేవంత్ పిల్లిలా కొడంగల్‌లో దాక్కున్నాడు. రేవంత్ కూతురునో, మనవడినో ఢిల్లీలో పిల్లలను కొట్టినట్లు కొడితే ఆయన ఊరుకుంటాడా. దేశమంతా మోదీ, ధర్మేంద్ర ప్రధాన్‌ను ప్రశి్నస్తుంటే రేవంత్ మాత్రం కేటీఆర్, కేసీఆర్‌ను విమర్శిస్తున్నాడు..’అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పెద్ద ఎత్తున తరలివచ్చిన యువత
బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమానికి యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ, ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శిస్తూ మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేటీఆర్‌తో పాటు మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, దేవిరెడ్డి సు«దీర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, పార్టీ నేతలు ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.


