సాక్షి, హైదరాబాద్: జర్నలిస్టుల రైల్వే పాసులను కేంద్ర ప్రభుత్వం వెంటనే పునరుద్దరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) డిమాండ్ చేసింది. ఈ మేరకై శుక్రవారం హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ రైల్ నిలయం ఎదుట టీడబ్లూజేఎఫ్ ఆద్వర్యంలో జర్నలిస్టులు నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సారి పూర్తిగా వందశాతం రాయితీ ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. కరోనా కాలంలో రైల్వే పాసులను రద్దుచేయడంతో పాత్రికేయుల విధులకు తీవ్ర ఆటంకం కలుగుతున్నదని తెలియజేసింది.
ఈసందర్భంగా జర్నలిస్టులు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని దక్షిణ మధ్య రైల్వే డిప్యూటీ జనరల్ మేనేజర్ కె. కిరణ్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. దాదాపు రెండు గంటలపాటు నిరసన నిర్వహించారు. నినాదాలు చేశారు. రైల్ నిలయం ప్రధాన ద్వారం ఎదుట జరిగిన నిరసనలో రాప్ట్ర యాక్టింగ్ ప్రెసిడెంట్ పి రాంచందర్, ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య మాట్లాడుతూ గత ఐదేండ్లుగా జర్నలిస్టులు రైల్వే పాసులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు.
విధుల నిర్వహణలో స్థానిక ప్రయాణాలతోపాటు దేశీయంగా కూడా సమస్యలు తప్పడం లేదని వివరించారు. కార్పొరేట్లు, పెట్టుబడిదారులకు లక్షల కోట్ల రూపాయల మేర రాయితీ ఇచ్చే కేంద్ర ప్రభుత్వం, జర్నలిస్టుల రైల్వే పాసులను పునరుద్దరించకపోవడం దారుణమని అభిప్రాయపడ్డారు. కనీస వేతనాల చట్టం అమలుకాకపోవడంతో వేతనాలు సక్రమంగా అందడం లేదన్నారు. నిత్యావసర ధరలు పెరిగాయని చెప్పారు. కనీసం పాసులను సైతం ప్రభుత్వం పునురుద్దరించపోవడం ఎంతమాత్రం సరికాదని అభిప్రాయపడ్డారు.
కేంద్ర ప్రభుత్వంఅమలుచేసే ఒకే ఒక్క పథకాన్ని రద్దుచేసి చేతులు ఎత్తేసిందన్నారు. గత పదేండ్ల నుంచి జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిచడంలో కేంద్రం విఫలమైందని విమర్శించారు. కేంద్ర సమాచార, రైల్వే మంత్రిత్వ శాఖలు జర్నలిస్టుల సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టాలని డిమాండ్ చేశారు. సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. కేంద్ర మంత్రులు అశ్వినీకుమార్ వైష్ణవ్, జి కిషన్‌రెడ్డి, బండి సంజయ్, రైల్వే బోర్డు చైర్మెన్లను కలిసి పదే పదే చెప్పడం, వినతిపత్రాలు ఇచ్చినా రైల్వే పాసుల సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
లోక్‌సభ, రాజ్యసభల్లో పలుమార్లు రైల్వే పాసుల చర్చ జరిగినా ప్రధాని నరేంద్రమోడీకి కనీసం చీమకుట్టినట్టయినా లేకపోవడం బాధాకరమని చెప్పారు. వేజ్‌బోర్డు సిఫారసులను అమలుచేయడంలో వెనుకబడ్డ కేంద్రానికి రైల్వే పాసులను సైతం పునరుద్దరించడానికి మనసు రావడం లేదని అన్నారు. వెంటనే యుద్ధప్రాతిపదిక రైల్వే పాసులు పూర్తిగా వంద శాతం రాయితీతో మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో దేశవ్యాప్తంగా జర్నలిస్టు సంఘాలతో కలిసి ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి రైల్వే పాసుల విషయంలో ప్రధాని నరేంద్రమోడీ, రైల్వే శాఖ మంత్రి అశ్వనీకుమార్ వైష్ణవ్‌కు లేఖ రాయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ ఉపాధ్యక్షులు గుడిగ రఘు, బి. రాజశేఖర్, కార్యదర్శి ఈ చంద్రశేఖర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల కృష్ణ, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కార్యదర్శి రవినాయక్ తదితరులు పాల్గొన్నారు.


