సాక్షి, ఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న నిరసనలపై ఢిల్లీ పోలీసులు కీలక ప్రకటన చేశారు. జూలై 20 నుండి జూలై 24 మధ్య జంతర్ మంతర్ దాని పరిసర ప్రాంతాలలో నేర చరిత్ర ఉన్న సుమారు 400 మంది వ్యక్తులను ఢిల్లీ పోలీసుల ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ గుర్తించినట్లు తెలిపారు. వీరిలో కొందరికి జూలై 20న జరిగిన హింసాత్మక ఘటనలు, విధ్వంసంతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
నీట్ లీకేజ్‌పై నిరసనలతో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జులై 20 న భారీగా హింస చేలరేగిన సంగతి తెలిసిందే. తాజాగా పోలీసులు దానిపై విచారణను ముమ్మరం చేశారు. ఆ రోజున జరిగిన హింసాత్మక ఘటనల్లో నేరస్థులకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు గుర్తించిన నేర చరిత్ర కలిగిన వ్యక్తులలో సాహిల్, మనోజ్ కుమార్, రూబల్ సాహిల్ సైఫీ ఉన్నారు. నిరసన సమయంలో వీరు ఏవైనా వ్యవస్థీకృత ముఠాలలో భాగస్వాములుగా ఉన్నారా లేదా అనే అంశాన్ని పోలీసులు తనిఖీ చేస్తున్నారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల మొదటి రోజున, 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) చేపట్టిన 'చలో సన్సద్' మార్చ్‌లో వేలాది మంది నిరసనకారులు పాల్గొన్నారు. విద్యా సంస్కరణలు చేపట్టాలని మరియు పరీక్షల్లో అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. హై-సెక్యూరిటీ జోన్‌లోని బారికేడ్లను బద్దలు కొట్టడానికి నిరసనకారులు ప్రయత్నించడంతో జూలై 20న హింస చెలరేగింది. తాజాగా దీనిపై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు.


