మళప్పురం: బామ్మ వయసు 76 ఏళ్లే కానీ... మనసు మాత్రం పదహారుకు మించదు. అందుకేనేమో... కొడుకు, కోడళ్లు.. మనుమలు, మనుమరాండ్రు అందరితో విహారయాత్రకు వెళ్లి... జిప్‌లైన్ సవారీ చేస్తానని పట్టుపట్టింది. కుటుంబ సభ్యులు వద్దని వారించినా... ప్రమాదమని హెచ్చరించినా అస్సలు పట్టించుకోలేదు. ‘‘అదేంటో (జిప్‌లైన్ సవారీ) నాకు తెలియదు. కానీ చూడగానే సవారీ చేయాలని అనిపించింది. ఇంట్లోవాళ్లందరూ పడవలో తిరుగుతూండగా చూశా జిప్‌లైన్‌ను. అక్కడి వెళ్లా. అక్కడున్న వ్యక్తి ఏం ఫర్వాలేదు. నేను తీసుకెళతా. భయపడొద్దు అన్నాడు. సరే అని సవారీ మొదలుపెట్టా. భయమేమీ కాలేదు.
సగం దూరం వెళ్లిన తరువాత... నా చేయి వదిలేయమని ఆ వ్యక్తికి చెప్పాను. నేనే స్వయంగా తాడు పట్టుకుని సవారీ మొత్తం పూర్తి చేశా’’అని బోసినవ్వుతో తన అనుభవాన్ని వెల్లడించింది. సవారీ మొత్తం పూర్తి చేసినందుకు సంతోషంగా ఉందంటూనే... ఎప్పుడు ఇలాంటి సాహసాలు ఎదురపడ్డా వదిలేది లేదని ధీమాగా చెప్పింది. ఊరూ.. పేరు చెప్పనే లేదు కదూ... బామ్మది కేరళలోని మళప్పురం వద్ద ఉన్న తనూర్. పేరు లక్ష్మి. పొన్నాని నదిపై జిప్‌లైన్‌పై బామ్మ సవారీ ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్!


