జంట హత్యల కేసులో మరణశిక్ష | Kerala Court Death Sentence in 2025 Nenmara Double Murder Case | Sakshi
Sakshi News home page

జంట హత్యల కేసులో మరణశిక్ష

Jul 21 2026 1:19 AM | Updated on Jul 21 2026 1:20 AM

Kerala Court Death Sentence in 2025 Nenmara Double Murder Case

రూ. 20 లక్షల జరిమానా అదనం 

ఒకే కుటుంబంలో ముగ్గురి హత్య 

2019లో ఒకరు.. 2025లో ఇద్దరు మృతి 

అందుకే ఇది అరుదైన కేసు: న్యాయమూర్తి 

పాలక్కాడ్‌: కేరళలో గత ఏడాది సంచలనం సృష్టించిన నెన్మర జంట హత్యల కేసు నిందితుడికి మరణశిక్ష పడింది. పాలక్కాడ్‌ అదనపు సెషన్స్‌ జడ్జి కెన్నెత్‌ జార్జ్‌ సోమవారం ఈ మేరకు తీర్పు ప్రకటించారు. జంట హత్యలను అత్యంత అరుదైన కేసుగా పరిగణించిన న్యాయమూర్తి 61 ఏళ్ల నిందితుడు చెన్‌తామర రూ.20 లక్షల జరిమానా కూడా కట్టాలని ఆదేశించారు. 

భారతీయ న్యాయ సంహిత సెక్షన్‌ 103(1), సెక్షన్‌ 126 (2)ల కింద ఈ శిక్ష విధిస్తున్నట్లు న్యాయమూర్తి స్పష్టం చేశారు. గత ఏడది జనవరి 27న చెన్‌తామర తన పొరుగింటి సుధాకరన్‌తోపాటు తల్లి లక్ష్మిని హత్య చేశారు. చెన్‌తామర ఒకే కుటుంబంలోని వారిని హత్య చేసినందున ఈ కేసును అరుదైనదిగా భావిస్తున్నట్లు న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. తన దాంపత్య సమస్యలన్నింటికీ కారణమని ఆరోపిస్తూ చెన్‌తామర పొరుగింటి సుధాకరన్‌ భార్య సజితను 2019లో హత్య చేశాడు. ఈ కేసులో డబుల్‌ జీవిత ఖైదు శిక్ష పడింది.

 అయితే గత ఏడాది జనవరిలో బెయిల్‌పై విడుదలైన సందర్భంగా మరోసారి ఆ ఇంటిపై దాడి చేసి సుధాకరన్‌తోపాటు అతడి తల్లిని చంపేశాడు. ఈ ఘటన కాస్తా నెన్మర జంట హత్యల కేసుగా ఖ్యాతి చెందింది. పోలీసులు చాలా వేగంగా నిందితుడిని అరెస్ట్‌ చేయగలిగారు. విచారణ సందర్భంగా న్యాయస్థానం సుమారు 81 మంది సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసింది. అలాగే దాదాపు 28 వస్తువులను పరిశీలించింది. సోమవారం ఇరు పక్షాల వాదనలు విన్న తరువాత న్యాయమూర్తి కెన్నెత్‌ జార్జ్‌ చెన్‌తామరకు మరణ శిక్ష విధిస్తున్నట్లు ప్రకటించారు. బాధితుడి పెద్ద కుమార్తెకు ప్రభుత్వం ఒక ఉద్యోగం ఇవ్వాలని కూడా న్యాయమూర్తి ఆదేశించారు. 

ఆ ఇంటికెళ్లం 
నెన్మర జంట హత్యల కేసులో నిందితుడికి మరణ శిక్ష విధిస్తూ న్యాయమూర్తి ఇచ్చిన తీర్పును బాధితుడు సుధాకరన్‌ కుమార్తెలు అతుల్య, అఖిల స్వాగతించారు. నిందితుడికి తగిన శిక్ష పడటంలో సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తీర్పు వెలువడిన తరువాత వారిద్దరూ విలేకరులతో మాట్లాడుతూ తల్లిదండ్రులతోపాటు నానమ్మను కూడా కోల్పోయిన ఆ ఇంటికి మళ్లీ వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ‘‘నాన్న, మిగిలిన వారందరి జ్ఞాపకా>లున్నాయి అక్కడ. మళ్లీ అక్కడికి వెళ్లలేము. వెళితే ఆ జ్ఞాపకాలు చుట్టుముడతాయి.’’అని అన్నారు. ప్రస్తుతం వీరిద్దరూ బంధువుల ఇంట్లోనే ఉంటున్నారు. తీర్పు వెలువడిన తరువాత కూడా చెన్‌తామర ముఖంలో ఎలాంటి పశ్చాతాపమూ కనిపించలేదని అతుల్య వ్యాఖ్యానించగా న్యాయప్రక్రియ పూర్తయ్యేంతవరకూ భయం తమను వెంటాడుతూనే ఉంటుందని అఖిల ఆందోళన వ్యక్తం చేసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement