breaking news
Bharatiya Nyaya Sanhita
-
చెక్‌బౌన్స్ కేసు.. రాజీ పద్ధతిలో కేసు కొట్టివేయలేరు!
నామీద రెండు చెక్కు బౌన్స్ కేసులు ఉన్నాయి. రెండూ ఒకే లావాదేవీకి సంబంధించిన వేర్వేరు చెక్కులు. నా భర్త బిజినెస్ లావాదేవీ కోసం చెక్కులు ఇచ్చాను. ట్రైల్ మొదలుకాక ముందు కాంప్రమైజ్ అవుదామని పార్టీని డిగాను. కేసు పెట్టిన అతను కాంప్రమైజ్ కావాలంటే మూడింతల డబ్బు కావాలి అని అడుగుతున్నాడు. అంటే 10 లక్షలకి 30 లక్షలన్నమాట! జడ్జిగారికి చెప్తే ‘‘అతను కాంప్రమైజ్ అవకపోతే నేను ఏమీ చేయలేను’’ అంటున్నారు. డబ్బు కట్టేస్తాను అని చెప్పినా అతని సమ్మతి అవసరమా? ఇప్పుడు కేసు నడపాల్సిందే అంటారా? నాకు ఏదైనా పరిష్కారం ఉందా?– మీనాక్షి, గుంటూరునెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ లోని సెక్షన్ 147 ప్రకారం చెక్కు బౌన్స్ కేసులు కాంప్రమైజ్ /రాజీ (కాంపౌండ్) చేసుకోవచ్చు. అయితే భారతీయ న్యాయ సురక్ష సంహిత (బీఎన్ఎస్ ) సెక్షన్ 359 పూర్వం సీ.ఆర్.పి.సి. సెక్షన్ 320లో సూచించిన విధంగా రాజీ విధానాన్ని నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ సూచించలేదు. బహుశా అందుకే మీటర్స్ – ఇన్స్ట్రుమెంట్స్ 2018 అనే కేసులో సుప్రీం కోర్టు సెక్షన్ 147 కింద కేసుని రాజీ చేయడానికి ఫిర్యాదుదారుని సమ్మతి తప్పనిసరి ఏమీ కాదని వ్యాఖ్యానించింది. ఆ తర్వాత చాలా కేసులలో ఫిర్యాదుదారుని సమ్మతి లేకుండా కూడా పలు కోర్టులు చెక్ బౌన్స్ కేసులలో నిందితుడు ముందుకు వచ్చి డబ్బులు కట్టేస్తాను అంటే కేసులను రాజీ జరిగినట్టు పరిగణించి మూసివేశాయి. కానీ ‘త్వరితగతిన చెక్ బౌన్స్ కేసులను తేల్చాలి అంటూ 2021లో సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులలో అలా కుదరదు, ఫిర్యాదుదారుని అంగీకారం తప్పనిసరి అని చెప్పింది. అందుకనే మీ కేసులో జడ్జిగారు ఫిర్యాదుదారుని అంగీకారం తప్పనిసరి అని చె΄్పారు. ప్రస్తుతానికి రాజీ పద్ధతిలో కేసును కొట్టివేయడం కుదరదు కనుక మీరు హైకోర్టును ఆశ్రయించి మీ ఉద్దేశాన్ని కూడా తెలుపుతూ క్వాష్ చేయమని కోరవచ్చు. హైకోర్టు బీ. ఎన్. ఎస్.ఎస్. సెక్షన్ 528 కింద తన ప్రత్యేక అధికారంతో మాత్రమే చేసే వీలు ఉంది. లేకపోతే మీరు కేసు నడపాల్సిందే.శ్రీకాంత్ చింతల హైకోర్టు న్యాయవాదిమీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comకు మెయిల్ చేయవచ్చు. -
ట్రాన్స్జెండర్లకు బీఎన్ఎస్ 69 వర్తించదు
సాక్షి, న్యూఢిల్లీ: వివాహం చేసుకుంటానని నమ్మించి మోసం చేశారనే ఆరోపణలతో దాఖలయ్యే కేసుల్లో భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్) చట్టంలోని ట్రాన్స్‌జెండర్(ట్రాన్స్‌జెండర్)కు సంబంధించిన 69వ సెక్షన్ వర్తించబోదని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ చట్టంలోని సెక్షన్లో పేర్కొన్న మహిళ అనే పదానికి ‘స్త్రీలు’ మాత్రమే పరిగణనలోకి వస్తారని తేల్చిచెప్పింది. ఓ కేసులో అరెస్టయిన నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ అరుణ్ కుమార్ సింగ్ దేశ్వాల్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు కీలక తీర్పు వెలువరించింది. పుట్టుకతో పురుషుడు లేదా స్త్రీగా ఉండి లింగ మార్పిడి శస్త్రచికిత్స ద్వారా మరో లింగానికి మారినప్పటికీ వారు ట్రాన్స్‌జెండర్‌గానే పరిగణించబడతారని న్యాయస్థానం స్పష్టం చేసింది. బీఎన్ఎస్ 69లో పేర్కొన్న ‘మహిళ’ అనే పదం కింద కేవలం స్త్రీలు మాత్రమే వస్తారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. చట్టం ప్రకారం వారు పూర్తిస్థాయి పురుషుడు లేదా స్త్రీ కాలేరని తేల్చిచెప్పింది.ఆ చట్టం కింద రక్షణ..ట్రాన్స్జెండర్లకు ప్రత్యేకంగా ట్రాన్స్‌జెండర్ పర్సన్స్ (ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్) చట్టం–2019 కింద గుర్తింపు ఉందని కోర్టు గుర్తు చేసింది. ట్రాన్స్జెండర్లు ఏదైనా శారీరక, లైంగిక వేధింపులకు గురైతే ఈ చట్టంలోని సెక్షన్ 18(డి) కింద ఆశ్రయించవచ్చని స్పష్టం చేసింది. దీని ప్రకారం లైంగిక వేధింపులకు పాల్పడితే గరిష్టంగా రెండేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉందని వివరించింది.అసలేం జరిగింది?బరేలీ పోలీసు స్టేషన్లో నమోదైన ఓ కేసులో మహ్మద్ సాకిర్ అలియాస్ మహ్మద్ సకీర్ అనే వ్యక్తి బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించాడు. వివాహం చేసుకుంటానని నమ్మించి ఏడాదిన్నర పాటు తనతో సంబంధం కొనసాగించాడని, రూ.5 లక్షలు తీసుకున్న తర్వాత పెళ్లికి నిరాకరించి కుటుంబ సభ్యులతో కలిసి దూషించారని ఓ ట్రాన్స్‌జెండర్ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీని ఆధారంగా పోలీసులు నిందితుడిపై బీఎన్ఎస్ 69 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు తాజా తీర్పు వెలువరించింది.వైద్య నివేదిక కీలకం..విచారణ సందర్భంగా నిందితుడి తరఫు న్యాయవాది కృష్ణగోపాల్ వాదనలు వినిపించారు. ‘‘ఫిర్యాదుచేసిన వ్యక్తి పుట్టుకతో పురుషుడు. 2023 ఏప్రిల్‌లో శస్త్రచికిత్స ద్వారా లింగమార్పిడి చేయించుకుని అమ్మాయిగా మారాడు. వైద్య బోర్డు నివేదిక ప్రకారం అతడు ఇప్పుడు అమ్మాయిగా మారినా గర్భాశయం లేదు. అవయవ మార్పిడి చేసుకున్నాసరే అతను పురుషుడే. అందుకే ఈ కేసుకు బీఎన్ఎస్ చట్టంలోని 69వ సెక్షన్ వర్తించదు’’ అని వాదించారు. చట్టబద్ధంగా లింగ మార్పిడి కోసం అధికారికంగా ఎలాంటి దరఖాస్తు చేసుకోలేదనే అంశాన్ని న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. ప్రాథమిక ఆధారాల ప్రకారం నిందితుడిపై బీఎన్ఎస్ 69 కింద కేసు నమోదుకు తగిన కారణాలు లేవని తెలుపుతూ అతడికి బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ప్రభుత్వం తరఫున అదనపు ప్రభుత్వ న్యాయవాది రామ్ వర్మ వాదనలు వినిపించగా, అమికస్ క్యూరీగా న్యాయవాది మయూరి వ్యవహరించారు. బీఎన్ఎస్లో అవసరమైన సవరణలు తీసుకువచ్చి, అత్యాచారం చట్టం పరిధిలోకి ట్రాన్స్వుమెన్ను చేర్చాలని 2023లో రాజ్యసభకు సమర్పించిన నివేదికలో హోం వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫార్సు చేసిన విషయాన్ని న్యాయస్థానం తన తీర్పులో ప్రస్తావించింది. పార్లమెంటు ఆ నివేదికను ఆమోదించలేదని, అందుకే బీఎన్ఎస్లో మహిళ అనే పదం కింద ట్రాన్స్‌వుమెన్ రాదు అని కోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. -
జంట హత్యల కేసులో మరణశిక్ష
పాలక్కాడ్: కేరళలో గత ఏడాది సంచలనం సృష్టించిన నెన్మర జంట హత్యల కేసు నిందితుడికి మరణశిక్ష పడింది. పాలక్కాడ్ అదనపు సెషన్స్ జడ్జి కెన్నెత్ జార్జ్ సోమవారం ఈ మేరకు తీర్పు ప్రకటించారు. జంట హత్యలను అత్యంత అరుదైన కేసుగా పరిగణించిన న్యాయమూర్తి 61 ఏళ్ల నిందితుడు చెన్‌తామర రూ.20 లక్షల జరిమానా కూడా కట్టాలని ఆదేశించారు. భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 103(1), సెక్షన్ 126 (2)ల కింద ఈ శిక్ష విధిస్తున్నట్లు న్యాయమూర్తి స్పష్టం చేశారు. గత ఏడది జనవరి 27న చెన్‌తామర తన పొరుగింటి సుధాకరన్తోపాటు తల్లి లక్ష్మిని హత్య చేశారు. చెన్‌తామర ఒకే కుటుంబంలోని వారిని హత్య చేసినందున ఈ కేసును అరుదైనదిగా భావిస్తున్నట్లు న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. తన దాంపత్య సమస్యలన్నింటికీ కారణమని ఆరోపిస్తూ చెన్‌తామర పొరుగింటి సుధాకరన్ భార్య సజితను 2019లో హత్య చేశాడు. ఈ కేసులో డబుల్ జీవిత ఖైదు శిక్ష పడింది. అయితే గత ఏడాది జనవరిలో బెయిల్‌పై విడుదలైన సందర్భంగా మరోసారి ఆ ఇంటిపై దాడి చేసి సుధాకరన్తోపాటు అతడి తల్లిని చంపేశాడు. ఈ ఘటన కాస్తా నెన్మర జంట హత్యల కేసుగా ఖ్యాతి చెందింది. పోలీసులు చాలా వేగంగా నిందితుడిని అరెస్ట్ చేయగలిగారు. విచారణ సందర్భంగా న్యాయస్థానం సుమారు 81 మంది సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసింది. అలాగే దాదాపు 28 వస్తువులను పరిశీలించింది. సోమవారం ఇరు పక్షాల వాదనలు విన్న తరువాత న్యాయమూర్తి కెన్నెత్ జార్జ్ చెన్తామరకు మరణ శిక్ష విధిస్తున్నట్లు ప్రకటించారు. బాధితుడి పెద్ద కుమార్తెకు ప్రభుత్వం ఒక ఉద్యోగం ఇవ్వాలని కూడా న్యాయమూర్తి ఆదేశించారు. ఆ ఇంటికెళ్లం నెన్మర జంట హత్యల కేసులో నిందితుడికి మరణ శిక్ష విధిస్తూ న్యాయమూర్తి ఇచ్చిన తీర్పును బాధితుడు సుధాకరన్ కుమార్తెలు అతుల్య, అఖిల స్వాగతించారు. నిందితుడికి తగిన శిక్ష పడటంలో సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తీర్పు వెలువడిన తరువాత వారిద్దరూ విలేకరులతో మాట్లాడుతూ తల్లిదండ్రులతోపాటు నానమ్మను కూడా కోల్పోయిన ఆ ఇంటికి మళ్లీ వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ‘‘నాన్న, మిగిలిన వారందరి జ్ఞాపకా>లున్నాయి అక్కడ. మళ్లీ అక్కడికి వెళ్లలేము. వెళితే ఆ జ్ఞాపకాలు చుట్టుముడతాయి.’’అని అన్నారు. ప్రస్తుతం వీరిద్దరూ బంధువుల ఇంట్లోనే ఉంటున్నారు. తీర్పు వెలువడిన తరువాత కూడా చెన్‌తామర ముఖంలో ఎలాంటి పశ్చాతాపమూ కనిపించలేదని అతుల్య వ్యాఖ్యానించగా న్యాయప్రక్రియ పూర్తయ్యేంతవరకూ భయం తమను వెంటాడుతూనే ఉంటుందని అఖిల ఆందోళన వ్యక్తం చేసింది. -
మైనర్లను రవాణా చేస్తే ‘పోక్సో’ వర్తింపు
న్యూఢిల్లీ: ధన సంపాదనే ధ్యేయంగా లైంగిక దోపిడీ కోసం అక్రమ రవాణాకు గురైన బాధితుల్లో మైనర్ ఉంటేనే భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్), అనైతిక అక్రమ రవాణా–నివారణ(ఐటీపీఏ) చట్టాలతోపాటు పోక్సో చట్టాన్ని వర్తింపజేయాల్సి ఉంటుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. ఈ మేరకు కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. సెక్స్ వర్కర్లకు సంబంధించిన అంశాలతోపాటు నేరస్థులపై విచారణ, బాధితుల పునరావాసం కోసం చట్టపరమైన నిబంధనల పాటించాలని సూచిస్తూ జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహాదేవన్‌ల సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది. నేరస్థుల చర్యలు, ఉద్దేశాలపైనే ప్రధానంగా దృష్టి పెట్టాలని సూచించింది. మానవ అక్రమ రవాణా నేరంలోని అంశాలు రుజువైన తర్వాత బాధితురాలు ‘అంగీకరించింది’ అనే ఏ వాదన లేదా ఆరోపణ అయినా అసంబద్ధమైనదిగా పరిగణించాలని తేల్చిచెప్పింది. ఒక మహిళ తాము లైంగిక పరిశ్రమలో, వ్యభిచారంలో ఉన్నామని తెలుసుకున్నంత మాత్రాన, వారు మానవ అక్రమ రవాణా బాధితులు కాకుండా పోరని స్పష్టంచేసింది. ఎందుకంటే పని పరిస్థితుల గురించి తప్పుడు సమాచారం ఇచ్చి వారిని మోసగించి ఉండవచ్చని, ఆ పరిస్థితులు తరువాత దోపిడీకి గురిచేసేవిగా తేలి ఉండవచ్చని ధర్మాసనం అభిప్రాయపడింది. మానవ అక్రమ రవాణాను అరికట్టాలని, లైంగిక దోపిడీకి గురైన బాధితులకు హక్కులను అమలు చేయాలంటూ ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం ఈ ఉత్తర్వును జారీ చేసింది. లైంగిక దోపిడీకి గురైనవారికి పునరావాసం కల్పించకపోతే.. బాధితురాలు తిరిగి ఆ పాత పరిస్థితుల్లోకే వెళ్తుందని వెల్లడించింది. అందువల్ల బాధితులకు తగిన పునరావాసం కల్పించాలని ఆదేశించింది. రాజ్యాంగంలోని ఆరి్టకల్ 21, 23 ఇదే అంశాన్ని సూచిస్తున్నాయని గుర్తుచేసింది. లైంగిక దాడి కోసం ఒక బాలికను అక్రమ రవాణా చేస్తే పోక్సో చట్టంలోని నిబంధనలతోపాటు బీఎన్ఎస్లోని సెక్షన్లు 143, 144, ఐటీపీఏ చట్టంలో సెక్షన్లను వర్తింపజేయాలని కోర్టు స్పష్టంచేసింది. చట్ట ప్రకారం పిల్లలపై జరిగే ప్రతి లైంగిక దోపిడీ చర్య వారి అంగీకారం లేకుండానే జరుగుతుందనే విషయంలో అస్పష్టత లేదని పేర్కొంది. -
Allu Arjun Case: ఆ సెక్షన్లు అంత తీవ్రమైనవా?
ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న నటుడు అల్లు అర్జున్ను.. చిక్కడపల్లి పోలీసులు ఈ ఉదయం ఆయన నివాసంలోనే అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ కేసులో అల్లు అర్జున్ సహా ఏడుగురిని అరెస్ట్ చేశారు. తొలుత పుష్ప హీరోను పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లి స్టేట్మెంట్ రికార్డుచేసి.. అటుపై వైద్యపరీక్షల కోసం గాంధీ ఆస్పత్రి.. అటు నుంచి అటు రిమాండ్ కోసం కోర్టుకు తరలించారు. అయితే..ఈ కేసులో అల్లు అర్జున్ పై 105, 118(1) రెడ్ విత్ 3(5) BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు ఎఫ్ఐఆర్లో ఉంది. ఐపీసీ స్థానంలో వచ్చిన భారతీయ న్యాయ సంహిత చట్టం వచ్చిన సంగతి తెలిసిందే. అయితే కొత్త చట్టంలోని సెక్షన్ల ప్రకారం ఈ కేసు అంత తీవ్రమైందా?.. ఒకవేళ నేరం రుజువైతే పడే శిక్షల గురించి ఓసారి పరిశీలిద్దాం..👉105 సెక్షన్ అనేది నాన్ బెయిలబుల్. ఉద్దేశపూర్వకంగా చంపేందుకు.. ఉద్దేశం లేకపోయినా అది మరణానికి దారి తీస్తుందని తెలిసిగానీ చేసే నేరాలు ఈ సెక్షన్ పరిధిలోకి వస్తుంది. ఇది హత్యానేరం(Murder) కిందకు రాకపోయినప్పటికీ.. శిక్షించదగిన హత్యానేరమే అవుతుంది.👉105 సెక్షన్ కింద.. ఉద్దేశపూర్వకంగా మరణానికి కారణమైతే మినిమమ్ ఐదేళ్లు.. గరిష్టంగా పదేళ్ల శిక్షతో పాటు జరిమానా విధిస్తారు. కేసు తీవ్రతను బట్టి జీవిత ఖైదు కూడా విధించవచ్చు.👉105 సెక్షన్ ప్రకారం.. ఒకవేళ ఉద్దేశపూర్వకంగా చేయకపోయినప్పటికీ తెలిసికూడా మరణానికి గనుక కారణమైతే.. ఆ శిక్షకుగానూ గరిష్టంగా పదేళ్ల శిక్ష, జరిమానా విధిస్తారు.👉సెక్షన్ 118(1).. ప్రమాదకరమైన ఆయుధాలు లేదంటే ఇతరత్రా మార్గల ద్వారా గాయపర్చడం. ఈ నేరం తీవ్ర దృష్ట్యా మూడేళ్ల వరకు జైలు శిక్ష.. రూ.20వేల జరిమానా విధిస్తారు. అల్లు అర్జున్ అరెస్ట్ కేసు లైవ్ అప్డేట్స్ కోసం క్లిక్ చేయండిదిల్సుఖ్ నగర్‌కు చెందిన భాస్కర్ మాగుడంపల్లి(మృతురాలు రేవతి భర్త) ఫిర్యాదుతో చిక్కడపల్లి పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. సంధ్యా 70 ఎంఎం థియేటర్ మేనేజ్మెంట్, స్టాఫ్‌తో పాటు అల్లు అర్జున్, ఆయన పర్సనల్ భద్రతా సిబ్బందిని నిందితులుగా చేర్చారు. ఇప్పటిదాకా ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు ప్రకటించగా.. అల్లు అర్జున్ పేరు 11వ నిందితుడిగా చేర్చారు. నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో.. చంచల్‌గూడ జైలుకు తరలించనున్నారు.కాగ్నిజబుల్ నేరం . అంటే ఒక పోలీసు అధికారికి వారెంట్ లేకుండా అరెస్టు చేయడానికి, కోర్టు అనుమతితో లేకుండా విచారణ జరిపే అధికారం ఉన్న నేరమన్నమాట. నేరం తీవ్రత దృష్ట్యా ఇది అన్వయింపజేస్తారు. తాజాగా.. కాగ్నిజబుల్ నేరం కిందనే వారెంట్ లేకుండానే అల్లు అర్జున్ను అరెస్ట్ చేశారు చిక్కడపల్లి పోలీసులు.సెక్షన్ 118(1) విత్ సెక్షన్ 3(5).. సెక్షన్ 118(1)కు సెక్షన్ 3(సబ్ సెక్షన్-5)నుకూడా పోలీసులు జత చేశారు. ఈ సెక్షన్ కింద.. ఒక నేరంలో ఎక్కువ మందికి గనుక భాగం ఉంటే.. వాళ్లందరికీ సమానంగా బాధ్యత ఉంటుందని అర్థం.ఇండియన్ పీనల్ కోడ్‌లోని సెక్షన్ 304, సెక్షన్ 324, సెక్షన్ 34ను.. బీఎన్ఎస్లో 105, 118(1), 3(5) సెక్షన్లతో భర్తీ చేశారు.


