పర్యావరణ పరిరక్షణకు వీగన్ ఆహారమే మేలు: ‘పెటా’ | Vegan food is better for the environment | Sakshi
Sakshi News home page

పర్యావరణ పరిరక్షణకు వీగన్ ఆహారమే మేలు: ‘పెటా’

Oct 15 2026 11:19 AM | Updated on Oct 15 2026 11:19 AM

Vegan food is better for the environment

హైదరాబాద్‌: ప్రపంచ శాకాహార అవగాహన మాసం, ప్రపంచ ఆహార దినోత్సవం (అక్టోబర్ 16) సందర్భంగా హైదరాబాద్‌లోని లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ‘పెటా’ ఇండియా, సిటిజన్స్ ఫర్ యానిమల్స్, వీగన్స్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో వినూత్న అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు పులి, జీబ్రా, జిరాఫీ వేషధారణల్లో ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలపనున్నారు. మాంసాహార వినియోగం వల్ల జీవజాతులు అంతరించిపోతున్నాయని, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజలు శాకాహారంతో పాటు జంతు ఉత్పత్తులు పూర్తిగా లేని వీగన్ జీవనశైలిని ఎంచుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

మాంసం, పాలు, గుడ్ల ఉత్పత్తి కోసం సాగిస్తున్న పశు సంపద పెంపకం వల్ల అడవులు ధ్వంసమవుతున్నాయి. భూమిపై ఉన్న క్షీరదాల జీవరాశిలో పెంపుడు, వ్యాపార అవసరాలకు వాడే జంతువులే దాదాపు 60 శాతనికిపైగా ఉండగా, అడవి క్షీరదాలు కేవలం 4 నుండి 5 శాతానికి పడిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా వెలువడే వార్షిక గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలలో దాదాపు 18 శాతం ఈ మాంస, పాడి పరిశ్రమల వల్లే విడుదలవుతూ వాతావరణ మార్పులను తీవ్రతరం చేస్తున్నాయి.

మరోవైపు మానవ ఆహార భద్రతపై కూడా పశు పరిశ్రమ తీవ్ర ప్రభావం చూపుతున్నది. ప్రపంచంలో పండే సోయాబీన్‌లో 80 శాతం, మొక్కజొన్నలో 50శాతం పంటను పశువుల మేతకే వాడుతున్నారు. ఆకలితో అలమటిస్తున్న లక్షలాది ప్రజలకు ఆహారం అందించాల్సింది పోయి, జంతువుల పెంపకానికి ధాన్యాన్ని మళ్లించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆహార కొరత పెరుగుతోందని ఐక్యరాజ్యసమితి నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. పూర్తిగా మొక్కల ఆధారిత వీగన్ ఆహార విధానానికి మారడం ద్వారా ఏటా వందలాది జంతువులను కాపాడటంతో పాటు కర్బన ఉద్గారాలను గణనీయంగా తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా, ఈ ఆహారపు అలవాటు గుండె జబ్బులు, మధుమేహం, కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తుందని వైద్య అధ్యయనాలు సూచిస్తున్నాయి. భూమిని, సమస్త జీవకోటిని రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ వీగన్ మార్గాన్ని ఎంచుకోవాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. 

ఇదీ చదవండి: 2018 నాటి కేసులో యూట్యూబర్ ధ్రువ్ రాఠీకి కోర్టు సమన్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement