మోమోస్‌ ప్యాకింగ్‌కు రూ.10.. రూ.52,110 ఫైన్‌! | 10 Momo Packing Charge Costs Food Seller 52,110 Fine | Sakshi
Sakshi News home page

మోమోస్‌ ప్యాకింగ్‌కు రూ.10.. రూ.52,110 ఫైన్‌!

Nov 28 2026 4:35 PM | Updated on Nov 28 2026 4:45 PM

10 Momo Packing Charge Costs Food Seller 52,110 Fine

మోమోస్‌ ప్యాకింగ్‌ కోసం రూ.10 ఛార్జీ వసూలు చేసిన వ్యవహారంలో కోల్‌కతాలోని ఓ ఆహార విక్రయ కేంద్రానికి వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్‌ జరిమానా విధించింది. ఆహారాన్ని సురక్షితంగా అందించేందుకు అవసరమైన ప్రాథమిక ప్యాకింగ్‌ బాధ్యత విక్రేతదేనని స్పష్టం చేసింది. ప్యాకింగ్‌ రుసుముపై ముందస్తు సమాచారం ఇచ్చినట్లు, వినియోగదారుడు ప్రత్యేకంగా అదనపు ప్యాకింగ్‌ కోరినట్లు దుకాణం నిరూపించలేకపోవడంతో ఈ మేరకు చర్యలు చేపట్టారు.

2024 అక్టోబర్‌ 29న జరిగిన ఈ ఘటనలో ఓ వినియోగదారుడు రెండు ప్లేట్ల చికెన్‌ మోమోస్‌ కొనుగోలు చేశారు. ఒక్కో ప్లేట్‌ ధర రూ.109 కాగా, బిల్లులో అదనంగా రూ.10 ప్యాకింగ్‌ ఛార్జీని చేర్చారు. ఆ మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని వినియోగదారుడు కోరినా దుకాణం నిరాకరించడంతో ఆయన వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్‌ను ఆశ్రయించారు. విచారణలో దుకాణం తరఫున మోటార్‌సైకిల్‌పై ఆహారం తీసుకెళ్తున్నందున చిందకుండా అదనపు ప్యాకింగ్‌ కోరారని, ముందస్తు అంగీకారంతోనే ఆర్డర్‌ తీసుకున్నామని వాదించారు. అయితే, ప్రత్యేక అభ్యర్థన లేదా ముందస్తు సమ్మతికి సంబంధించిన ఎలాంటి ఆధారాలను దుకాణం సమర్పించలేకపోయింది.

నిబంధనలు ఏం చెబుతున్నాయి?

ఈ కేసులో కమిషన్‌ వస్తువుల అమ్మకం చట్టం, 1930లోని సెక్షన్‌ 36(5)ను ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంది. వస్తువుల అనువైన డెలివరీకి అయ్యే ఖర్చులను విక్రేతే భరించాలన్నది ఈ నిబంధన సారాంశం. టేక్‌అవే ఆహారాన్ని సాధారణంగా ప్యాక్‌ చేసి ఇవ్వడం విక్రయ ప్రక్రియలో అంతర్భాగమని, అదనపు రుసుము వసూలు చేయాలంటే వినియోగదారుడి ప్రత్యేక అభ్యర్థన, ముందస్తు సమ్మతికి స్పష్టమైన ఆధారాలు ఉండాలని కమిషన్‌ పేర్కొంది.

కమిషన్‌ జారీ చేసిన ఆదేశాలు

వినియోగదారుడికి ఊరట కల్పిస్తూ కమిషన్‌ ఆదేశాలు జారీ చేసింది. యూజర్‌ నుంచి వసూలు చేసిన రూ.10 ప్యాకింగ్‌ ఛార్జీని తిరిగి చెల్లించాలి. వినియోగదారుడికి రూ.100 పరిహారం ఇవ్వాలి. కేసు ఖర్చుల కింద రూ.2,000 చెల్లించాలి. కమిషన్‌ వినియోగదారుల న్యాయ సహాయ ఖాతాలో రూ.50,000 జమ చేయాలి. దాంతో దుకాణం చెల్లించాల్సిన మొత్తం రూ.52,110గా ఉంది.

ఇదీ చదవండి: ధరలతో చిర్రెత్తిన ఉల్లి, వెల్లుల్లి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement