సౌదీకి డేంజర్‌ బెల్స్‌.. వణుకుతున్న గల్ఫ్ దేశం! | Saudi Arabia on High Alert Houthi Tension Growing Threat | Sakshi
Sakshi News home page

సౌదీకి డేంజర్‌ బెల్స్‌.. వణుకుతున్న గల్ఫ్ దేశం!

Nov 28 2026 10:47 AM | Updated on Nov 28 2026 10:50 AM

Saudi Arabia on High Alert Houthi Tension Growing Threat

పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింత కమ్ముకుంటున్నాయి. యెమెన్‌లో కొనసాగుతున్న అంతర్యుద్ధం ఇప్పుడు పొరుగున ఉన్న సౌదీ అరేబియాకు కూడా తీవ్ర ముప్పుగా మారింది. ఇరాన్ మద్దతు ఉన్న హూతీ తిరుగుబాటుదారులు సౌదీ భూభాగంపై డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులతో వరుస దాడులకు దిగుతున్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా సౌదీ రాజధాని రియాద్ లక్ష్యంగా దాడులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. విమానాశ్రయాలు, చమురు సంస్థలు, భారీ భవనాలు సైతం దాడుల ముప్పును ఎదుర్కొంటున్నాయి.

జూలై 1 నుంచి నవంబర్ 25 వరకు దాదాపు ఐదు నెలల వ్యవధిలో సౌదీ అరేబియాపై 274 హూతీ దాడులు జరిగాయి. వీటిలో అధిక శాతం దాడులను సౌదీ రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నప్పటికీ, కనీసం 41 దాడులు లక్ష్యాలను చేరుకున్నట్లు సమాచారం. అంతకుముందు ఐదు నెలల్లో కేవలం ఒక్క దాడి మాత్రమే నమోదవడం పరిస్థితిలో వచ్చిన మార్పును సూచిస్తోంది.

రియాద్ విమానాశ్రయంపై భీకర దాడి
అక్టోబర్ 10న రియాద్‌లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన దాడి సౌదీ ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. ఈ దాడిలో 13 మంది మరణించగా, 300 మందికి పైగా గాయపడ్డారు. ఇటీవలి సంవత్సరాల్లో సౌదీ గడ్డపై జరిగిన అత్యంత ప్రాణాంతక దాడుల్లో ఇది ఒకటిగా నిలిచింది. ఆ సమయంలో విమానాశ్రయంలో ఉన్న 25 ఏళ్ల ఇంజినీర్ మాజిద్ తన భయానక అనుభవాన్ని చెప్పుకొచ్చాడు. విమాన ప్రయాణానికి సిద్ధమవుతున్న సమయంలో ఒక తల్లి తన పిల్లలను పుష్‌చైర్‌లో తీసుకెళ్తుండగా ఒక్కసారిగా దాడి జరిగిందని గుర్తుచేసుకున్నాడు. రక్తంతో తడిసిన వ్యక్తిని చూశానని, క్షతగాత్రులను విమానాశ్రయంలోని ప్రథమ చికిత్స కేంద్రానికి తరలించారని తెలిపాడు.

ఆకాశహర్మ్యాలపైనా దాడులు
హూతీల దాడులు విమానాశ్రయాలకే పరిమితం కాలేదు. రియాద్‌లోని ప్రముఖ ఆర్థిక ప్రాంతంలోని భారీ భవనాలు కూడా లక్ష్యంగా మారాయి. నవంబర్ 19న సౌదీ అరేబియాలోనే అత్యంత ఎత్తైన భవనమైన పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (PIF) టవర్‌పై దాడి జరిగింది. ఈ ఘటనలో 11 మంది గాయపడ్డారు. ప్రభుత్వ చమురు సంస్థ ఆరామ్‌కోకు చెందిన భవనంపైనా దాడి జరిగినట్లు నివేదిక వెల్లడించింది. క్షిపణులు, డ్రోన్ల దాడుల ముప్పు ఉన్నప్పటికీ రియాద్‌లో సాధారణ జనజీవనం కొనసాగుతోంది. అయితే ఎప్పుడు ఏ వైపు నుంచి దాడి జరుగుతుందోనన్న భయం ప్రజలను వెంటాడుతోంది. మొబైల్ ఫోన్లకు వచ్చే అత్యవసర హెచ్చరికలు, ఆకాశంలో క్షిపణులను అడ్డుకునే రక్షణ వ్యవస్థల శబ్దాలు ప్రజల్లో ఆందోళన పెంచుతున్నాయి.

యెమెన్‌లో అంతర్యుద్ధం..
ఇదిలా ఉండగా.. దశాబ్దానికి పైగా యెమెన్‌లో అంతర్యుద్ధం కొనసాగుతోంది. ఇరాన్ మద్దతుతో హూతీ తిరుగుబాటుదారులు ఉత్తర యెమెన్‌లోని పెద్ద ప్రాంతాలను తమ ఆధీనంలో ఉంచుకున్నారు. అంతర్జాతీయ గుర్తింపు పొందిన యెమెన్ ప్రభుత్వానికి సౌదీ అరేబియా మద్దతుగా నిలుస్తోంది. గతంలో యెమెన్‌లో అనధికార కాల్పుల విరమణ కొనసాగినప్పటికీ, జూలైలో అది విచ్ఛిన్నమైంది. ఆ తర్వాత హూతీలు సౌదీపై దాడులను పెంచారు. యెమెన్‌పై సౌదీ వైమానిక దాడులు, హూతీల ఆధీనంలోని ప్రాంతాల్లోని ఓడరేవులు, విమానాశ్రయాలపై ఆంక్షలకు ప్రతీకారంగానే తాము దాడులు చేస్తున్నామని హూతీలు చెబుతున్నారు. మరోవైపు హూతీల దాడులకు ప్రతిస్పందనగా సౌదీ నేతృత్వంలోని అరబ్ కూటమి యెమెన్‌లో వైమానిక దాడులను తీవ్రతరం చేసింది. నవంబర్‌లో సనాలో జరిగిన ఒక దాడిలో 44 మంది మరణించినట్లు హూతీ అధికారులు వెల్లడించారు. ఈ చర్యలు యెమెన్ ప్రజలను, అంతర్జాతీయ వాణిజ్య మార్గాలను హూతీల నుంచి రక్షించేందుకేనని సౌదీ చెబుతోంది.

గల్ఫ్ భద్రతకు కొత్త సవాల్..
సౌదీ అరేబియా గత కొన్నేళ్లుగా రియాద్ వంటి నగరాలను అంతర్జాతీయ పెట్టుబడులు, పర్యాటకం, వ్యాపారాలకు కేంద్రాలుగా తీర్చిదిద్దుతోంది. ప్రపంచానికి సురక్షితమైన దేశంగా తన ప్రతిష్ఠను పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే హూతీల డ్రోన్లు, క్షిపణి దాడులు ఈ భద్రతా ప్రతిష్ఠకు సవాలుగా మారుతున్నాయి.
ఒకవైపు సౌదీ నగరాలపై దాడులు.. మరోవైపు యెమెన్‌లో వైమానిక దాడులు, అంతర్యుద్ధం.. ఇంకోవైపు లక్షలాది మంది ప్రజల నిరాశ్రయ పరిస్థితులు.. మొత్తంగా ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. యెమెన్ నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు సౌదీకి చేరుకున్న అబూ ఖలీల్ వంటి వేలాది మంది జీవితాలు ఈ యుద్ధం ఎంతటి మానవతా సంక్షోభాన్ని సృష్టిస్తోందో స్పష్టం చేస్తున్నాయి.

ఇదీ చదవండి: ఇజ్రాయెల్ రాజకీయాల్లో సంచలనం.. నెతన్యాహు కొత్త ట్విస్ట్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement