జమ్మూ కశ్మీర్‌కు కొత్త అడ్వకేట్ జనరల్.. ఎవరీ ఫైసల్ ఖాద్రీ? | Syed Faisal Qadri Appointed New Advocate General of Jammu and Kashmir | Sakshi
Sakshi News home page

జమ్మూ కశ్మీర్‌కు కొత్త అడ్వకేట్ జనరల్.. ఎవరీ ఫైసల్ ఖాద్రీ?

Nov 28 2026 10:42 AM | Updated on Nov 28 2026 10:42 AM

Syed Faisal Qadri Appointed New Advocate General of Jammu and Kashmir

శ్రీనగర్‌: జమ్మూ కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతానికి కొత్త అడ్వకేట్ జనరల్ నియమితులయ్యారు. సీనియర్ న్యాయవాది సయ్యద్ ఫైసల్ ఖాద్రీ నియామకానికి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆమోదం తెలిపారు. దీంతో రెండేళ్లకు పైగా ఖాళీగా ఉన్న ఈ కీలక రాజ్యాంగబద్ధ పదవి భర్తీ కానుంది. 2024 అక్టోబర్‌లో అప్పటి అడ్వకేట్ జనరల్ డీసీ రైనా రాజీనామా చేసినప్పటి నుంచి ఈ పదవి ఖాళీగానే ఉంది. సయ్యద్ ఫైసల్ ఖాద్రీ జమ్మూ కశ్మీర్, లద్దాఖ్ హైకోర్టుల్లో సీనియర్ న్యాయవాదిగా పనిచేస్తున్నారు. పలు కీలక రాజ్యాంగపరమైన, సర్వీసు సంబంధిత కేసుల్లో ప్రభుత్వం, వివిధ శాఖల తరఫున వాదనలు వినిపించారు. 2020 డిసెంబర్ 3న ఆయనకు సీనియర్ అడ్వకేట్ హోదా లభించింది.

2024 అక్టోబర్‌లో అప్పటి అడ్వకేట్ జనరల్ డీసీ రైనా తన పదవికి రాజీనామా చేశారు. కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలోని ఎన్నికైన ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ పదవిని భర్తీ చేయాలని కోరుతూ వచ్చింది. తాజాగా మనోజ్ సిన్హా ఆమోదం తెలపడంతో నియామకానికి మార్గం సుగమమైంది. త్వరలో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నట్లు అధికారులు వెల్లడించారు. అడ్వకేట్ జనరల్‌గా సయ్యద్ ఫైసల్ ఖాద్రీ కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వానికి ప్రధాన న్యాయ సలహాదారుగా వ్యవహరిస్తారు. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో కీలక కేసుల విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున ప్రాతినిధ్యం వహిస్తారు. పౌర, క్రిమినల్, రాజ్యాంగపరమైన అంశాల్లో ప్రభుత్వానికి న్యాయపరమైన సలహాలు అందిస్తారు.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 165 ప్రకారం రాష్ట్ర అడ్వకేట్ జనరల్‌ను నియమిస్తారు. ప్రభుత్వానికి ప్రధాన న్యాయ సలహాదారుగా ఉండటంతో పాటు కోర్టుల్లో ప్రభుత్వ వాదనలు వినిపించడం ఆయన బాధ్యత. గవర్నర్ లేదా ప్రభుత్వం సూచించిన అంశాలపై న్యాయపరమైన అభిప్రాయాలు అందిస్తారు. అవసరమైనప్పుడు రాష్ట్ర శాసనసభ సమావేశాలు, కమిటీలకు హాజరై తన అభిప్రాయాలను వెల్లడించవచ్చు. అయితే అక్కడ ఓటు వేసే అధికారం ఉండదు.

సయ్యద్ ఫైసల్ ఖాద్రీ కశ్మీర్ యూనివర్సిటీలో 2004లో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. ఆయన తండ్రి ప్రొఫెసర్ అఫ్జల్ ఖాద్రీ కశ్మీర్ యూనివర్సిటీ న్యాయ విభాగానికి గతంలో అధిపతిగా, డీన్‌గా పనిచేశారు. క్రిమినల్ లా నిపుణుడిగా, అధ్యాపకుడిగా గుర్తింపు పొందారు. తండ్రి న్యాయరంగంలో విశేష అనుభవం కలిగిన వ్యక్తి కాగా, కుమారుడు కూడా అదే రంగంలో ఎదిగి తాజాగా జమ్మూ కశ్మీర్ అడ్వకేట్ జనరల్‌గా నియమితులయ్యారు.

ఇదీ చదవండి: Puerto Rico: పెరిగిన విద్యుత్ ఛార్జీలు.. జనం తిరుగుబాటు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement