ఇజ్రాయెల్ రాజకీయాల్లో సంచలనం.. నెతన్యాహు కొత్త ట్విస్ట్‌! | Netanyahu weighs rotating premiership with Eisenkot In Israel | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్ రాజకీయాల్లో సంచలనం.. నెతన్యాహు కొత్త ట్విస్ట్‌!

Nov 28 2026 7:42 AM | Updated on Nov 28 2026 7:42 AM

Netanyahu weighs rotating premiership with Eisenkot In Israel

టెలీఅవీవ్‌: ఇజ్రాయెల్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగుతున్న ఉత్కంఠ మధ్య ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సంచలన ప్రతిపాదనకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. యాషర్ పార్టీ అధినేత గాడి ఐసెన్‌కోట్‌తో కలిసి జాతీయ ఐక్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు, అవసరమైతే ప్రధాని పదవిలో రెండో స్థానంలో కొనసాగేందుకు కూడా నెతన్యాహు సిద్ధంగా ఉన్నట్లు ది జెరూసలేం పోస్ట్ తన కథనంలో వెల్లడించింది.

ఈ ప్రతిపాదన ప్రకారం ఇద్దరు నేతలు నిర్ణీత కాల వ్యవధిలో ప్రధానమంత్రి బాధ్యతలను పంచుకునే అవకాశం ఉంది. దేశ భద్రత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు నెతన్యాహు ప్రకటించే అవకాశం ఉందని చర్చలకు సంబంధించిన వర్గాలు వెల్లడించినట్లు కథనం పేర్కొంది. చర్చల్లో పురోగతి కనిపిస్తే రెండు రోజుల్లోనే దీనిపై ప్రకటన వెలువడవచ్చని సమాచారం. అయితే ఈ వార్తలపై నెతన్యాహు కార్యాలయం, ఐసెన్‌కోట్ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. కాగా, అక్టోబర్ 27న జరిగిన ఎన్నికల అనంతరం ఏ రాజకీయ కూటమికీ స్పష్టమైన మెజారిటీ లభించకపోవడంతో ఇజ్రాయెల్‌లో ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నెతన్యాహు నేతృత్వంలోని లికుడ్ పార్టీ, ఐసెన్‌కోట్‌కు చెందిన యాషర్ కూటమి మధ్య గత కొన్ని వారాలుగా చర్చలు జరుగుతున్నాయి.

రాజకీయ వ్యూహం?
అయితే నెతన్యాహు ముందుకు తెస్తున్నట్లు ప్రచారంలో ఉన్న రొటేషన్ ప్రధానమంత్రి ప్రతిపాదనపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది నిజమైన ఐక్య ప్రభుత్వ ఏర్పాటుకు చేస్తున్న ప్రయత్నమా? లేక ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటును అడ్డుకునేందుకు చేస్తున్న రాజకీయ ఎత్తుగడనా? అనే చర్చ మొదలైంది. ప్రతిపక్ష శిబిరంలోని కొందరు నేతలు నెతన్యాహు ప్రతిపాదనను అనుమానంతో చూస్తున్నారు. ఇజ్రాయెల్ బైటెనూ పార్టీ అధినేత అవిగ్డోర్ లీబర్‌మన్ కూడా ఇదే అంశంపై స్పందించారు. నెతన్యాహు, ఐసెన్‌కోట్‌కు రొటేషన్ ప్రధానమంత్రి పదవిని ఆఫర్ చేసే అవకాశాన్ని తోసిపుచ్చలేమని, అయితే అది కేవలం రాజకీయ వ్యూహం మాత్రమే కావచ్చని ఆయన వ్యాఖ్యానించారు.

పదవుల కంటే విధానాలే ముఖ్యం: ఐసెన్‌కోట్
మరోవైపు ఐసెన్‌కోట్ మాత్రం ప్రభుత్వంలో పదవుల పంపకం కంటే విధానపరమైన అంశాలకే ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేస్తున్నారు. లికుడ్ పార్టీతో ఇప్పటికే ఐదు విడతల చర్చలు జరిగినప్పటికీ, కీలక అంశాల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండు వారాల్లో ఐదు సమావేశాలు జరిగిన నేపథ్యంలో నిజంగా ఒప్పందం కుదుర్చుకోవాలనే ఆసక్తి ఉంటే ఇప్పటికే పురోగతి సాధ్యమయ్యేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఐక్యత అంటే పదవుల గురించి లేదా ఎవరు ముందుగా ప్రధాని అవుతారనే దాని గురించి చర్చించడం కాదు. విధానాలు, విలువల గురించి చర్చించడమే నిజమైన ఐక్యత అని ఐసెన్‌కోట్ పేర్కొన్నారు. నెతన్యాహు నాయకత్వంలోని మరో ప్రభుత్వంలో చేరాలంటే విధానపరమైన మార్పులు, కీలక అంశాల్లో రాజీ తప్పనిసరని ఆయన సంకేతాలిచ్చారు. ప్రజలు కోరుకుంటున్న రాజకీయ మార్పులకు ప్రాధాన్యత ఇవ్వకుండా మరోసారి అదే ప్రభుత్వంలో భాగస్వాములు కావడం ఓటర్ల నమ్మకాన్ని దెబ్బతీస్తుందని అభిప్రాయపడ్డారు. అయితే లికుడ్ పార్టీ ధైర్యమైన నిర్ణయాలు తీసుకుని, కీలక అంశాల్లో రాజీకి సిద్ధమైతే చర్చలకు తలుపులు తెరిచే ఉంటాయని స్పష్టం చేశారు. 

ఇదీ చదవండి: భారత్‌పై భారీ టారిఫ్‌ బాంబు! 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement