వాషింగ్టన్: అమెరికాలో ‘థాంక్స్ గివ్వింగ్’ వేడుకల వేళ ప్రకృతి ప్రకోపం తీవ్ర అంతరాయం కలిగించింది. దేశంలోని తూర్పు, పశ్చిమ తీర ప్రాంతాలను భారీ వర్షాలు, మంచు తుపానులు, బలమైన ఈదురుగాలులు వణికిస్తున్నాయి. ప్రతికూల వాతావరణం కారణంగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. రహదారులపై రాకపోకలు స్తంభించాయి. మరోవైపు దాదాపు 7 లక్షల మంది వినియోగదారులకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
శుక్రవారం తెల్లవారుజామున దాదాపు 7 లక్షల మంది విద్యుత్ వినియోగదారులు సరఫరా లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పెన్సిల్వేనియా, న్యూజెర్సీ, మేరీల్యాండ్ రాష్ట్రాలపై తుపానుల ప్రభావం అధికంగా ఉంది. భారీ వర్షాలు, బలమైన గాలుల కారణంగా విద్యుత్ తీగలు, చెట్లు నేలకొరిగాయి. తుపానుల ప్రభావంతో విమాన ప్రయాణాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. గురువారం ఒక్కరోజే 462 విమానాలు రద్దయ్యాయి. మరో 2,700 విమానాలు ఆలస్యంగా నడిచాయి. శుక్రవారం తెల్లవారుజామునాటికి మరో 100 విమానాలు రద్దయినట్లు ఫ్లైట్ ట్రాకింగ్ సంస్థ ఫ్లైట్ అవేర్ వెల్లడించింది.
వాయిదా పడిన పరేడ్
న్యూయార్క్‌లో ఏటా నిర్వహించే ప్రసిద్ధ మేసీస్ థాంక్స్‌గివింగ్ డే పరేడ్ కూడా వాతావరణం కారణంగా వాయిదా పడింది. భారీ బెలూన్ల భద్రతకు బలమైన గాలుల వల్ల ముప్పు ఏర్పడుతుందనే ఆందోళనతో నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ పరేడ్ వాయిదా పడటం ఇదే తొలిసారి.
న్యూయార్క్, న్యూజెర్సీలో అత్యవసర పరిస్థితి
ప్రతికూల వాతావరణం నేపథ్యంలో న్యూయార్క్, న్యూజెర్సీ రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితి కొనసాగుతోంది. న్యూయార్క్ నగరంలో వరద నీటిలో చిక్కుకున్న కార్ల నుంచి ఇద్దరిని రక్షించినట్లు మేయర్ జొహ్రాన్ మమ్దానీ తెలిపారు. ఇతర తీర ప్రాంతాల్లోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. నార్త్ కరోలినా నుంచి న్యూజెర్సీ వరకు తూర్పు తీర ప్రాంతాల్లో వరదలు సంభవించాయి. రహదారులు నీట మునగడంతో పలు చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని హైవేలు, వంతెనలను తాత్కాలికంగా మూసివేశారు. దక్షిణ వర్జీనియాలోని చెసాపీక్ బే బ్రిడ్జ్-టన్నెల్‌ను గురువారం కొన్ని గంటలపాటు మూసివేశారు.
మరికొన్ని ప్రాంతాల్లో మంచు వర్షాలు
అమెరికా వాయవ్య ప్రాంతంలో మరో తుపాను ప్రభావం కొనసాగుతోంది. ఒరెగాన్ తీర ప్రాంతంలో వర్షాలు కురుస్తుండగా, క్యాస్కేడ్ పర్వత శ్రేణులు, మోంటానా, వ్యోమింగ్ పర్వత మార్గాల్లో మరింత మంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మిడ్‌వెస్ట్ ప్రాంతంలో పరిస్థితులు కొంత ప్రశాంతంగా మారాయి. అయితే మిస్సోరిలోని తూర్పు ప్రాంతంలో గురువారం ఏకంగా 15 అంగుళాల (38 సెంటీమీటర్ల) మంచు కురిసినట్లు జాతీయ వాతావరణ సేవ వెల్లడించింది. శుక్రవారం తూర్పు అమెరికాలో వాతావరణం మెరుగుపడే అవకాశమున్నప్పటికీ, భారీ తుపాను వ్యవస్థ బలహీనపడటానికి మరికొంత సమయం పడుతుందని తెలిపింది.


