దేశంలోని పిల్లలందరికీ షేర్లు.. ఎలాన్ మస్క్ భారీ ప్రకటన! | Elon Musk Says Every Child In America Will Receive Two SpaceX Shares giveaway | Sakshi
Sakshi News home page

దేశంలోని పిల్లలందరికీ షేర్లు.. ఎలాన్ మస్క్ భారీ ప్రకటన!

Nov 26 2026 12:22 PM | Updated on Nov 26 2026 12:26 PM

Elon Musk Says Every Child In America Will Receive Two SpaceX Shares giveaway

అమెరికాలోని చిన్నారులకు ప్రముఖ పారిశ్రామికవేత్త, స్పేస్‌ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ భారీ బహుమతి ప్రకటించారు. దేశంలోని ప్రతి చిన్నారికీ రెండు స్పేస్‌ఎక్స్ షేర్లు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఇందులో ఒక షేరును కంపెనీ అందిస్తుండగా, మరో షేరును ఆయన వ్యక్తిగతంగా బహుమతిగా ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని మస్క్ తన సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో ప్రకటించారు.

మస్క్ ప్రకటనకు ముందే స్పేస్‌ఎక్స్ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ట్రంప్ అకౌంట్స్’ పథకంలో ప్రస్తుతం క్రియాశీలంగా ఉన్న ప్రతి ఖాతాకు కొత్తగా జారీ చేసిన క్లాస్‌-ఏ కామన్ స్టాక్‌లో ఒక షేరును అందించనున్నట్లు నవంబర్ 25న ప్రకటించింది. కంపెనీ ఇచ్చే షేర్ల సంఖ్యకు సమానంగా తాను కూడా వ్యక్తిగతంగా షేర్లు ఇస్తానని మస్క్ వెల్లడించారు.

మస్క్ వ్యక్తిగతంగా ఇచ్చే షేర్ల పంపిణీ విధానంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే, ఆయనకు సంబంధించిన షేర్లపై ఉన్న లాకప్ గడువు 2027 జూన్‌లో ముగిసిన తర్వాత వాటిని బదిలీ చేయనున్నట్లు తాజా రాయిటర్స్ నివేదిక వెల్లడించింది. కంపెనీ ఇచ్చే షేర్లు, మస్క్ వ్యక్తిగతంగా ఇచ్చే షేర్లు కలిపి ఒక్కో చిన్నారికి రెండు షేర్లు అందనున్నాయి.

ఇదిలా ఉంటే, స్పేస్‌ఎక్స్ అధ్యక్షురాలు గ్విన్ షాట్‌వెల్, ఆమె భర్త కూడా ఈ కార్యక్రమంలో భాగంగా 20 లక్షల మందికి పైగా చిన్నారులకు తమ షేర్లను బహుమతిగా ఇవ్వనున్నట్లు అక్టోబర్ 30న ప్రకటించారు. తొలుత 11 నుంచి 17 ఏళ్ల మధ్య వయస్సు ఉండి, మధ్యస్థ కుటుంబ ఆదాయం 57,000 డాలర్లు లేదా అంతకంటే తక్కువగా ఉన్న ప్రాంతాల్లో నివసించే పిల్లలకు ఈ ప్రయోజనం అందించనున్నట్లు తెలిపారు. విదేశాల్లో పనిచేస్తున్న సైనికుల పిల్లలు, ఫోస్టర్ కేర్‌లో ఉన్న చిన్నారులు, అర్హత కలిగిన టెక్సాస్ కౌంటీల పిల్లల కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.

భవిష్యత్తులో ఇన్వెస్టర్లుగా చిన్నారులు

అమెరికా చిన్నారులకు దీర్ఘకాలిక పొదుపు, పెట్టుబడి ప్రయోజనాలు కల్పించడమే ట్రంప్ అకౌంట్స్ పథకం ప్రధాన ఉద్దేశం. ఈ ఖాతాల్లో స్పేస్‌ఎక్స్ షేర్లు జమ చేయడం ద్వారా చిన్న వయస్సులోనే కంపెనీలో వాటాదారులుగా మారే అవకాశం కల్పిస్తున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న షేరు ధర 127.44 డాలర్లుగా పరిగణిస్తే, రెండు షేర్ల మొత్తం విలువ ఒక్కో చిన్నారికి సుమారు 254.88 డాలర్లు అవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement