అమెరికా వాణిజ్య సుంకాలపై భారత్ కౌంటర్‌! | No structural excess capacity India rejects US allegations | Sakshi
Sakshi News home page

అమెరికా వాణిజ్య సుంకాలపై భారత్ కౌంటర్‌!

Nov 26 2026 7:00 AM | Updated on Nov 26 2026 7:06 AM

No structural excess capacity India rejects US allegations

వాషింగ్టన్‌: అమెరికా వాణిజ్య సుంకాల ప్రతిపాదనపై భారత్ తన వైఖరిని స్పష్టం చేసింది. దేశంలోని ఏ పారిశ్రామిక రంగంలోనూ నిర్మాణాత్మక మిగులు ఉత్పత్తి సామర్థ్యం లేదని తేల్చిచెప్పింది. ఈ మేరకు అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం (యూఎస్‌టీఆర్‌) చేసిన ఆరోపణలను భారత్ ఖండించింది. వాణిజ్య సమస్యలను పరస్పర చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించింది. భారత్‌-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బీటీఏ)ను వీలైనంత త్వరగా ఖరారు చేయడానికి కట్టుబడి ఉన్నట్లు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది.

25 శాతం సుంకాలు ప్రతిపాదించిన అమెరికా
భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 25 శాతం వరకు సుంకాలు విధించాలని అమెరికా నవంబర్ 25న ప్రతిపాదించింది. అయితే భారత్‌తో వాణిజ్య ఒప్పందం కుదిరితే ఈ రేటును 17 శాతానికి తగ్గించే అవకాశం ఉందని ప్రకటించింది. ఈ నేపథ్యంలో అమెరికా ఆరోపణలను భారత్ అంగీకరించలేదు. తమ దేశంలో ఏ రంగంలోనూ మిగులు ఉత్పత్తి సామర్థ్యం లేదని స్పష్టం చేసింది. అమెరికా ప్రతిపాదనపై ఎలాంటి ప్రతీకార చర్యలను ప్రకటించకుండా, యూఎస్‌టీఆర్‌ నోటీసును పరిశీలిస్తున్నట్లు తెలిపింది.

ఎనిమిది నెలల విచారణ.. 16 దేశాలపై సుంకాలు
1974 నాటి ట్రేడ్ యాక్ట్‌లోని సెక్షన్ 301 కింద అమెరికా మార్చి 11, 2026న ఈ విచారణ ప్రారంభించింది. ఎనిమిది నెలల పాటు 16 ప్రధాన వాణిజ్య భాగస్వాములపై పరిశీలన జరిపింది. ఆయా దేశాలు అనుసరిస్తున్న విధానాలు అమెరికా వాణిజ్యాన్ని ప్రభావితం చేస్తున్నాయని యూఎస్‌టీఆర్‌ ఆరోపించింది. భారత్‌తో పాటు చైనా, యూరోపియన్ యూనియన్, బంగ్లాదేశ్, జపాన్, దక్షిణ కొరియా, ఇండోనేషియా, మలేసియా, సింగపూర్, స్విట్జర్లాండ్, తైవాన్, థాయ్‌లాండ్, వియత్నాం, కంబోడియా దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి.

చైనాపై 40 శాతం వరకు సుంకాలు
యూరోపియన్ యూనియన్, జపాన్, దక్షిణ కొరియా, తైవాన్, స్విట్జర్లాండ్‌పై 15 శాతం, సింగపూర్‌పై 10 శాతం సుంకాలు ప్రతిపాదించింది. చైనాపై 20 శాతం అదనపు సుంకాలను ప్రతిపాదించడంతో గతంలో విధించిన సెక్షన్ 301 సుంకాలతో కలిపి మొత్తం భారం 40 శాతం వరకు చేరనుంది. మెక్సికో, నార్వే దేశాలను తాజా జాబితాలో చేర్చలేదు.

అభిప్రాయ సేకరణ తర్వాతే అమలు
ప్రతిపాదిత సుంకాలు వెంటనే అమల్లోకి రావు. ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే ఉన్న వాణిజ్య ఒప్పందాలను కూడా పరిగణనలోకి తీసుకుంటామని అమెరికా అధికారులు తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్‌-అమెరికా వాణిజ్య చర్చలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 

ఇదీ చదవండి: పురుషుల చూపులపై 80 శాతం మహిళల ఫిర్యాదు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement