20 వికెట్లు పడగొట్టాల్సిందే! | Indias second Test against New Zealand starts tomorrow | Sakshi
Sakshi News home page

20 వికెట్లు పడగొట్టాల్సిందే!

Nov 26 2026 3:47 AM | Updated on Nov 26 2026 3:47 AM

Indias second Test against New Zealand starts tomorrow

భారత బౌలింగ్‌పైనే భారం

రేపటి నుంచి న్యూజిలాండ్‌తో రెండో టెస్టు 

తెల్లవారుజామున గం.3:30 నుంచి సోనీ స్పోర్ట్స్, సోనీ లివ్‌ యాప్‌లో ప్రసారం  

క్రైస్ట్‌చర్చ్‌: బ్యాటర్లు మ్యాచ్‌లు గెలిపిస్తే బౌలర్లు టోర్నీలు గెలిపిస్తారు... క్రికెట్‌ ప్రపంచంలో బాగా ప్రాచుర్యంలో ఉన్న మాట ఇది. ఇప్పుడు ఇది భారత జట్టుకు సరిగ్గా సరిపోతుంది. న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో భారత్‌ ఏకంగా 720 పరుగులు సాధించింది. ఎనిమిదో స్థానంలో కూడా బ్యాటింగ్‌ చేయగలిగే బౌలర్‌ కావాలన్నట్లుగా టీమ్‌ మేనేజ్‌మెంట్‌ తుది జట్టును ఎంపిక చేసింది. కానీ ఏం లాభం... రెండో ఇన్నింగ్స్‌లో 120 ఓవర్లు బౌలింగ్‌ చేసి కూడా కేవలం 5 న్యూజిలాండ్‌ వికెట్లే భారత బౌలర్లు పడగొట్టగలిగారు. 

పిచ్‌ ఏమాత్రం సహకరించకపోవడం వాస్తవమే అయినా... 352 పరుగుల భారీ ఆధిక్యం తర్వాత కూడా ప్రత్యర్థిపై బౌలర్లు ఒత్తిడి పెంచలేకపోయారు. టెస్టు క్రికెట్‌ అంటే ఎంత భారీ స్కోరు చేసినా...  ప్రత్యర్థి జట్టు 20 వికెట్లు పడగొట్టాల్సిందే. ఈ నేపథ్యంలో రెండో టెస్టులో భారత బౌలింగ్‌పైనే అందరి దృష్టీ నిలిచింది. బుధవారం విశ్రాంతి తీసుకున్న టీమిండియా ఆటగాళ్లు మ్యాచ్‌కు ముందు రోజు మాత్రమే ప్రాక్టీస్‌ చేయనున్నారు. 2020 సిరీస్‌లో భాగంగా క్రైస్ట్‌చర్చ్‌లో ఆడిన టెస్టులో భారత్‌ 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.  

సిరాజ్‌కు చాన్స్‌ దక్కేనా! 
కివీస్‌తో తొలి టెస్టులో బ్యాటర్లందరూ ఆశించినట్లుగా చెలరేగారు కాబట్టి ఆ విషయంలో ఎలాంటి సందేహాలు లేవు. ఇక బౌలింగ్‌ బృందంలోనే ఏమైనా మార్పులు జరుగుతాయా అనేదే కీలకం. ఇక్కడి పిచ్‌ పేసర్లకు అనుకూలించే అవకాశం ఉంది. పరిస్థితులను బట్టి చూస్తే నలుగురు పేసర్లలో బుమ్రాకు తోడుగా ఆకాశ్‌దీప్‌ కూడా ఆడటం ఖాయం. బ్యాటింగ్‌ కూడా చేయగల అన్షుల్‌ కంబోజ్‌కు కూడా చోటుపై సందేహాలు లేవు. మిగతా ముగ్గురితో పోలిస్తే వెలింగ్టన్‌లో ప్రభావం చూపలేకపోయిన ప్రసిధ్‌ కృష్ణ స్థానంపైనే చర్చ జరుగుతోంది. 

అయితే అతడిని పక్కన పెడితే సిరాజ్‌ను తీసుకుంటారా కూడా చెప్పలేని పరిస్థితి. తొలి టెస్టులో సిరాజ్‌ను ఆడించకపోవడంపై తీవ్ర విమర్శలు వచ్చినా కెప్టెన్, బ్యాటింగ్‌ కోచ్‌ తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. కాబట్టి ఇప్పుడూ సిరాజ్‌కు చోటుపై సందేహమే. మరోవైపు గుర్నూర్‌ బ్రార్‌ రూపంలో పొడగరి, ‘హిట్‌ ద డెక్‌’ బౌలర్‌ కూడా అందుబాటులో ఉన్నాడు. కాబట్టి అతని అరంగేట్రానికే ఎక్కువగా చాన్స్‌ ఉంది. మరోవైపు వాషింగ్టన్‌ సుందర్‌ విషయంలో ఇప్పటికిప్పుడు ఎలాంటి ప్రతికూలత లేదు కాబట్టి రవీంద్ర జడేజా మరోసారి పెవిలియన్‌కే పరిమితం కావచ్చు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement