నేడు సెమీఫైనల్లోశ్రీలంక ‘ఎ’తో భారత్ ‘ఎ’ ఢీ
ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీ
మధ్యాహ్నం 3:30 నుంచి సోనీ స్పోర్ట్స్, సోనీ లివ్ యాప్‌లో ప్రసారం
దోహా: ఒకే ఒక్క ఇన్నింగ్స్‌తో రికార్డుల వరద పారించిన వైభవ్ సూర్యవంశీ ప్రధాన ఆకర్షణగా నేడు భారత్ ‘ఎ’ జట్టు కీలకపోరుకు సిద్ధమైంది. ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ వన్డే క్రికెట్ టోర్నీలో భాగంగా నేడు శ్రీలంక ‘ఎ’తో భారత ‘ఎ’ జట్టు తలపడనుంది. యూఏఈతో మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగి రికార్డు డబుల్ సెంచరీ నమోదు చేసిన సంగతి తెలిసిందే. నేటి మ్యాచ్‌లో వైభవ్‌తో పాటు బ్యాటర్లంతా సమష్టిగా సత్తా చాటాలని టీమ్ మేనేజ్‌మెంట్ ఆశిస్తోంది.
యువీ సూచనలు ఫలితాన్నిచ్చాయి: వైభవ్
రికార్డు డబుల్ సెంచరీ మ్యాచ్‌కు ముందు తన స్ఫూర్తి ప్రదాత యువరాజ్ సింగ్‌తో అరగంట పాటు సంభాషించినట్లు యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ వెల్లడించాడు. అది తనకు ఎంతగానో ఉపయోగపడిందని పేర్కొన్నాడు. ‘యువరాజ్ సింగ్ సర్‌తో అరగంట మాట్లాడా. నా బ్యాటింగ్‌కు సంబంధించిన విషయాలపై చర్చించా. నా సమస్యలు ఏంటో చెప్పా. దానికి బదులు కనీసం 20 బంతులు ఆడితే పరుగులు వాటంతటవే వస్తాయని యువరాజ్ సూచించారు. కొన్ని టెక్నికల్ సూచనలు కూడా మ్యాచ్‌లో నాకు ఎంతో ఉపయోగపడ్డాయి. మార్గదర్శి చెప్పిన మాటలు ఎవరైనా శ్రద్ధగా వింటారు కదా.
పిచ్ ఎలా స్పందిస్తుందో తెలుసుకునేందుకు కొన్ని బంతులు వేచి చూశా. బంతి బ్యాట్ మీదకు వస్తుందని అనిపించాక భారీ షాట్‌లు ఆడా. గత వీడియోలు చూశాక నేనేం తప్పులు చేశానో అర్థమైంది. పిచ్ బౌలర్లకు అనుకూలంగా ఉంటే నా ఆటతీరును మార్చుకునేందుకు ప్రయత్నిస్తా. బ్యాటింగ్‌కు సహకరిస్తుందని భావిస్తే వదిలిపెట్టను’ అని వైభవ్ సూర్యవంశీ వివరించాడు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది.


