Photo Credit: BCCI Twitter
రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ టోర్నీలో యూఏఈతో మ్యాచ్‌లో 204 పరుగుల సంచలన ఇన్నింగ్స్‌తో మెరిసిన వైభవ్ సూర్యవంశీపై స్టార్ క్రికెటర్లతో పాటు మాజీల నుంచి ప్రశంసల జల్లు కరుస్తోంది. ఇండియా 'ఎ' తరఫున ఆడుతున్న యువ బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ , కేవలం 53 బంతుల్లోనే 204 పరుగులతో లిస్ట్ 'ఎ' రికార్డులన్నింటిని తిరగరాశాడు.
28 బంతుల్లోనే శతకాన్ని పూర్తి చేసి లిస్ట్ 'ఎ' క్రికెట్‌లో ఆస్ట్రేలియాకు చెందిన జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ నెలకొల్పిన 29 బంతుల రికార్డు బద్దలయ్యింది. ఈ నేపథ్యంలో టీమిండియా సీనియర్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ వైభవ్ ప్రదర్శన పట్ల స్పందించాడు. ‘‘వైభవ్ సూర్యవంశీ.. ఇప్పుడు నువ్వే నా స్ఫూర్తి. ఎంతో గొప్ప ఆటగాడివి #వెరీ స్పెషల్’’ అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశాడు.
మరో మాజీ క్రికెటర్ సురేశ్ రైనా స్పందిస్తూ.. ఇది అద్భుతమైన ప్రతిభ. ఇంత చిన్న వయసులో డబుల్ సెంచరీ సాధించడం వైభవ్ సూర్యవంశీ అసాధారణ సామర్థ్యాన్ని మరోసారి బయటపెట్టింది. ఇలాగే ఆడుతూ ఉండు యంగ్ చాంపియన్* అని ఎక్స్ వేదికగా పేర్కొన్నాడు.
‘‘కేవలం 53 బంతుల్లో 204 పరుగులు.. 28 సిక్సర్లు. వైభవ్ సూర్యవంశీ రికార్డులు బద్దలుకొట్టేందుకు ఎదురుచూడడం లేదు. క్రికెట్ చరిత్రనే తిరగరాస్తున్నాడు. ఒక సూపర్‌స్టార్‌గా ఎదుగుతున్నాడు’’ అని మాజీ క్రికెట్ మహ్మద్ కైఫ్ పేర్కొన్నాడు.
‘‘వైభవ్ నీ ప్రతిభను వర్ణించేందుకు మాటలు రావడం లేదు. ఇలాగే ఆడుతూ దేశాన్ని మరింత గర్వపడే స్థాయికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నా’’ అని మరో మాజీ ఆటగాడు ఎస్. బద్రీనాథ్ వెల్లడించాడు.
మ్యాచ్ విషయానికొస్తే, వైభవ్ బీభత్స బ్యాటింగ్ ప్రదర్శనతో 250 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 14.2 ఓవర్లలోనే ఛేదించింది. వైభవ్ సూర్యవంశీ (53 బంతుల్లో 204; 7 ఫోర్లు, 28 సిక్సర్లు) చెలరేగడంతో 3 వికెట్ల నష్టానికి భారత్ 254 పరుగులు సాధించి టోర్నీలో సెమీఫైనల్ స్థానాన్ని ఖాయం చేసుకుంది.
అంతకు ముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన యూఏఈ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. హర్‌ప్రీత్ సింగ్ (144 బంతుల్లో 130; 12 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీ సాధించగా, బాసిల్ హమీద్ (36 నాటౌట్) రాణించాడు. భారత బౌలర్లలో అర్షద్ ఖాన్‌కు 4 వికెట్లు దక్కాయి. గురువారం జరిగే తొలి సెమీఫైనల్లో శ్రీలంక ‘ఎ’తో భారత్ ‘ఎ’ తలపడుతుంది.
ఇదీ చదవండి: నా విధ్వంసానికి కారణం అతడే: వైభవ్


