న్యూఢిల్లీ: బిహార్ మహిళలు ఛత్ పూజ సందర్భంగా పాటించే సింధూర సంప్రదాయంపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన స్టాండప్ కమెడియన్ యశ్ మహేశ్వరి ఎట్టకేలకు క్షమాపణలు చెప్పారు. ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. మహిళల సంప్రదాయాన్ని, పండుగ పవిత్రతను కించపరిచేలా మాట్లాడారంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్లు కూడా వచ్చాయి.
ఈ వివాదంపై యశ్ మహేశ్వరి తన యూట్యూబ్ ఛానెల్‌లో క్షమాపణ వీడియో విడుదల చేశారు. బిహార్ సంస్కృతి, సంప్రదాయాల గురించి తాను చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని అంగీకరించారు. ఆ విధంగా మాట్లాడకూడదని, తన తప్పును పూర్తిగా అంగీకరిస్తున్నానని పేర్కొన్నారు. తన వ్యాఖ్యలతో ఎవరి మతపరమైన మనోభావాలను, పండుగను జరుపుకునే వారి భావాలను గాయపరచాలనే ఉద్దేశం తనకు లేదన్నారు.
యశ్ మహేశ్వరి చేసిన స్టాండప్ కామెడీ ప్రదర్శనకు సంబంధించిన ‘మోరల్లీ క్వశ్చనబుల్’ వీడియోలోని ఓ క్లిప్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఛత్ పూజ సందర్భంగా బిహార్‌లో వివాహిత మహిళలు నుదుటిపై పొడవుగా ధరించే సింధూరం గురించి ఆయన చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలు వివాదానికి కారణమయ్యాయి. ఈ వ్యాఖ్యలు మహిళలను అవమానించడమే కాకుండా పండుగ మతపరమైన ప్రాధాన్యతను కించపరిచేలా ఉన్నాయని పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ వ్యవహారంపై బీజేపీ నేత, కార్యకర్త రీతూ జైస్వాల్ తీవ్రంగా స్పందించారు. ఛత్ పూజను, ఆ పండుగను ఆచరించే భక్తులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను ఆమె తప్పుబట్టారు. కమెడియన్‌పై బిహార్‌లోని ప్రతి జిల్లాలో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు. దీంతో ఈ వివాదం సోషల్ మీడియాలో మరింత చర్చనీయాంశంగా మారింది. తన వ్యాఖ్యలతో మనోభావాలు దెబ్బతిన్న ప్రతి ఒక్కరికీ మరోసారి క్షమాపణలు చెబుతున్నానని యశ్ మహేశ్వరి తెలిపారు. భవిష్యత్తులో తాను కంటెంట్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటానని, ఇలాంటి పొరపాట్లు మళ్లీ జరగకుండా చూసుకుంటానని చెప్పారు. యశ్ మహేశ్వరి తన షోలో మహిళలు ధరించే సిందూరం పొడవును వారి భర్తల వ్యక్తిగత శరీర భాగాలతో (అశ్లీల అర్థం వచ్చేలా) పోల్చడం వివాదాస్పదంగా మారింది.
ఇదీ చదవండి: మిస్ యూనివర్స్‌లో భారత్‌కు నిరాశ!


