టీసీఎస్‌ ఉద్యోగం వదిలి రూ. 11వేలతో మొదలై రూ. 40 లక్షలు దాకా | meet Shruti Kundan who quit TCS to start a handmade candle business with Rs 11000 | Sakshi
Sakshi News home page

టీసీఎస్‌ ఉద్యోగం వదిలి రూ. 11వేలతో మొదలై రూ. 40 లక్షలు దాకా

Nov 24 2026 5:34 PM | Updated on Nov 24 2026 5:37 PM

meet Shruti Kundan who quit TCS to start a handmade candle business with Rs 11000

ShrutiKundan-Boholette successstory జెన్‌ప్యాక్ట్ (Genpact), టీసీఎస్ (TCS), యాక్సెంచర్ (Accenture) వంటి దిగ్గజ కంపెనీలలో పనిచేసిన అనుభవం. కార్పొరేట్ ఫైనాన్స్ అనలిస్ట్‌గా ఎంతో విజ్ఞానం. సౌకర్యవంతమైన జీతం. జీవితం. అయినా  స్వతంత్రంగా జీవిస్తూ, ఆర్థిక ఉన్నతిని సాధించాలనే కోరిక బాగా ఉండేది. ఎట్టకేలకు 2023లో ఆమె కల ఫలించింది. అలా కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి 'బోహోలెట్' (Boholette) అనే సంస్థను ప్రారంభించారు. కేవలం రూ. 11,000 ప్రారంభ పెట్టుబడితో హోం మేడ్‌ క్యాండిల్స్‌ వ్యాపారంలో అనూహ్యం విజయం సాధించారు. పదండి శ్రుతి కుందన్ విజయ ప్రస్థానం తెలుసుకుందాం.

కార్పిరేట్‌ ఉద్యోగం వదిలి వ్యాపారం
శ్రుతి కోల్‌కతాలో పెరిగారు. 2014లో కలకత్తా విశ్వవిద్యాలయం నుండి బీ.కామ్ ఆనర్స్ పూర్తి చేశారు. ఆ తర్వాత పలు పెద్ద కంపెనీలలో ఉద్యోగం చేసి, ప్రొఫెషనల్ మేనేజ్‌మెంట్ మరియు క్లయింట్ డీలింగ్ నైపుణ్యాలను నేర్చుకున్నారు. చిన్నప్పటి నుండే సృజనాత్మక పనులపై ఆమెకు ఆసక్తి ఉండేది. దీనిని గుర్తించిన ఆమె భర్త ప్రణవ్ శ్రీ, సొంతంగా వ్యాపారం ప్రారంభించమని ఆమెను ప్రోత్సహించారు. దాదాపు ఏడేళ్ల పాటు కార్పొరేట్ రంగంలో పనిచేసిన తర్వాత, శ్రుతి కుందన్ 2023లో ఇంటి నుండే 'బోహోలెట్' (Boholette) చేతితో తయారు చేసిన కొవ్వొత్తుల (handmade candles)  సంస్థను మొదలు పెట్టారు. ఇంటి వ్యాపారంగా మొదలైన ఇది, క్రమంగా డైరెక్ట్-టు-కన్స్యూమర్ (D2C) బ్రాండ్లు, చిన్న వ్యాపారాలకు సేవలందించే ప్యాకేజింగ్ సంస్థగా రూపాంతరం చెందింది.

శ్రుతి 2017లో జెన్‌ప్యాక్ట్‌లో ప్రాసెస్ అసోసియేట్‌గా కెరీర్‌ ప్రారంభించి, 2019 వరకు అక్కడ పనిచేశారు. ఆ తర్వాత టీసీఎస్‌లో చేరి, అనంతరం 2022లో యాక్సెంచర్‌లో ఫైనాన్షియల్ అనలిస్ట్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత తన భర్త ప్రణవ్ శ్రీ ప్రోత్సాహంతో  2023లో  కేవలం రూ. 11 వేల ప్రారంభ పెట్టుబడితో  ఇంటి వంటగదిలో రూ. 250 విలువైన మైనంతో 'లడ్డూ కొవ్వొత్తులు' తయారు చేయడంతో ఆమె ప్రయాణం మొదలైంది. మహారాష్ట్రలో గణేష్ చతుర్థి సమయంలో ఆమె తయారు చేసిన మొదటి 100 కొవ్వొత్తులు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. దీంతో ఆమె ఆత్మవిశ్వాసం రెట్టింపైంది.  క్రమంగా ఆమె  కంపెనీ  భారీ వేర్‌హౌస్‌గా , ఏటా రూ. 40 లక్షలకు పైగా టర్నోవర్ కలిగిన వ్యాపారంగా ఎదిగింది. కొవ్వొత్తులు అమ్మడంతో పాటు, మార్కెట్‌లో ఉన్న ప్యాకేజింగ్ సమస్యను గుర్తించి ఆమె B2B (బిజినెస్-టు-బిజినెస్) వ్యాపారాన్ని కూడా నిర్మించారు. 

ఇదీ చదవండి: జెన్సన్ సీఈఓ : ప్రముఖ బ్యాంకర్‌ ఉదయ్‌ కోటక్‌ స్పందన ఇదీ!

కష్టానికి దక్కిన  తొలి ఫలితం
 వ్యాపారం మొదలు పెట్టిన నెల రోజుల్లోనే  శ్రుతికి దుబాయ్‌లోని ఒక క్లయింట్ నుండి 700 లడ్డూ కొవ్వొత్తుల ఆర్డర్ వచ్చింది. ఆ సమయంలో ఆమె వద్ద కేవలం 10 అచ్చులు (మౌల్డ్స్) మాత్రమే ఉన్నాయి. ఈ ఆర్డర్‌ను సమయానికి పూర్తి చేయడానికి శ్రుతి రాత్రింబవళ్లు కష్టపడ్డారు. ఫలితంగా రూ. 9,000 ఖర్చుతో కూడిన ఈ అంతర్జాతీయ ఆర్డర్ ద్వారా ఆమెకు రూ. 20,000 ఆదాయం లభించింది. అదే ఆమెలో పట్టుదల మరింత పెంచింది. ఆ తర్వాత ఇండియామార్ట్ (IndiaMART) వంటి ప్లాట్‌ఫారమ్‌లతో చేతులు కలపాలని నిర్ణయించుకున్నారు. దీని ద్వారా నేరుగా సరఫరాదారులతో అనుసంధానమై తన ఉత్పత్తి ఖర్చులను తగ్గించుకుని, వ్యాపారాన్ని మరింత లాభదాయకంగా మార్చుకున్నారు.

ఇదీ చదవండి: రూ. 32 కోట్ల జాక్‌పాట్‌.. ఎవరీ స్నేహ జాయ్?

ప్యాకేజింగ్ వ్యాపారంలోకి అడుగు
వ్యాపారం చేస్తున్న క్రమంలో చిన్న పారిశ్రామికవేత్తలకు నాణ్యమైన ప్యాకేజింగ్ బాక్సులు దొరకడం చాలా కష్టంగా ఉందని శ్రుతికి అర్థమైంది.  పెద్ద సరఫరాదారులు కనీసం 2,000 బాక్సుల ఆర్డర్ ఇవ్వాలని షరతు పెట్టడమే దీనికి కారణం. ఈ లోటును తనకు అనుకూల అవకాశంగా మార్చుకున్నారు. తన బ్రాండ్ కింద తక్కువ పరిమాణంలో (కేవలం 20 పీసుల నుండి ప్రారంభించి) బాక్సులను విక్రయించడం మొదలుపెట్టారు. 

2025 ఏప్రిల్ -  2026 ఫిబ్రవరి మధ్య కాలంలో బోహోలెట్ 2,804 ఆర్డర్లను పూర్తి చేసి  రూ.38 లక్షల ఆదాయాన్ని ఆర్జించింది. సాధారణ నెలల్లో ఈ సంస్థకు నెలకు సుమారు  రూ.3 లక్షల -5 లక్షల వరకు అమ్మకాలు జరుగుతుండగా, పండుగ సీజన్‌లలో అవి రూ.10 లక్షల నుండి  రూ.11 లక్షల వరకు పెరుగుతుంది.  ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఆమె రూ. 6.5 లక్షల విలువైన సెమీ-ఆటోమేటిక్ యంత్రాన్ని ఏర్పాటు చేశారు. ఇది ప్రతిరోజూ 20,000 యూనిట్లను తయారు చేయగలదు.నేడు ఆమె వ్యాపారంలో 80శాతం వాటా ఈ ప్యాకేజింగ్ విభాగం నుండే వస్తోంది.

భారీ లక్ష్యాలతో ముందుకు..
2023లో ఇంటి నుండి మొదలైన శ్రుతి ప్రయాణం నేడు గురుగ్రామ్‌లోని పటౌడీలో ఉన్న 1,200 చదరపు అడుగుల వేర్‌హౌస్‌కు చేరుకుంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆమె ఆదాయం దాదాపు రూ. 42 లక్షలకు చేరుకుంటుందని అంచనా. శ్రుతి దృష్టి ఇప్పుడు కేవలం కొవ్వొత్తుల తయారీకే పరిమితం కాలేదు. కాస్మెటిక్, పెర్ఫ్యూమ్ మరియు ఫార్మా కంపెనీలకు ప్రీమియం ప్యాకేజింగ్ అందించే పెద్ద హబ్‌గా ఎదగాలని ఆమె ఆకాంక్షిస్తున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరం నాటికి రూ. 1 కోటి వార్షిక విక్రయాల మైలురాయిని చేరుకోవాలని, ఆ తర్వాతి మూడేళ్లలో దానిని రూ. 50 కోట్లకు తీసుకెళ్లాలని ఆమె లక్ష్యంగా పెట్టుకున్నారు.

వ్యాపారం ప్రారంభించడంలో ఎదురైన సవాళ్ల గురించి మాట్లాడుతూ, స్థిరమైన కార్పొరేట్ జీతాన్ని వదులుకోవడం చాలా కష్టమైన నిర్ణయమని శ్రుతి పేర్కొన్నారు. ప్రారంభ రోజుల్లో ఎక్కువ గంటలు పనిచేయడం, తక్కువ నిద్ర,, అనేక బాధ్యతలను ఒంటరిగా నిర్వహించడం వంటివి చేయాల్సి వచ్చింది. ఈ మార్పును తట్టుకోవడంలో తన భర్త కుటుంబ సభ్యుల మద్దతు ఎంతో సహాయపడిందని ఆమె తెలిపారు. అలాగే బోహోలెట్‌ నిర్వహణలో  తన గత కార్పొరేట్ అనుభవం ఎంతో ఉపయోగపడిందని ఆమె చెప్పారు.

"మీ ప్రయాణాన్ని ప్రారంభించడానికి భారీ పెట్టుబడి అవసరం లేదు. మీ ప్రతిభను గుర్తించి, దానిని ఒక వృత్తిగా మార్చుకునే ధైర్యం ఉంటే చాలు. తొలి అడుగు ఎప్పుడూ కష్టమే, కానీ అదే అత్యంత ముఖ్యమైంది’’- శ్రుతి కుందన్. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement