‘3BHK ఇల్లు కొనేశానోచ్‌’.. ఐటీ ఉద్యోగిని సక్సెస్‌ స్టోరీ వైరల్‌ | IT Woman 3BHK Flat success story Savings Journey Goes Viral | Sakshi
Sakshi News home page

‘3BHK ఇల్లు కొనేశానోచ్‌’.. ఐటీ ఉద్యోగిని సక్సెస్‌ స్టోరీ వైరల్‌

Nov 22 2026 3:37 PM | Updated on Nov 22 2026 4:00 PM

IT Woman 3BHK Flat success story Savings Journey Goes Viral

సొంతిల్లు ప్రతి ఒక్కరికీ జీవిత కల. ఆ కలను నెరవేర్చుకోవాలంటే భారీ జీతం ఒక్కటే మార్గం కాదు.. ఆర్థిక క్రమశిక్షణ, నిరంతర పొదుపు, సరైన పెట్టుబడులు కూడా కీలకమని ఓ ఐటీ ఉద్యోగిని నిరూపించారు. 15 ఏళ్ల వయసు నుంచే సంపాదించడం ప్రారంభించిన ఆమె, కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూనే చివరకు సొంతంగా 3BHK ఫ్లాట్ కొనుగోలు చేశారు. ఆమె సక్సెస్‌ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

సోషల్ మీడియాలో శిఖా శర్మగా గుర్తింపు పొందిన ఆమె.. టీనేజర్‌గా ఉన్నప్పుడే కుటుంబానికి అండగా నిలిచారు. ట్యూషన్లు చెప్పడంతో పాటు కాల్ సెంటర్లలో పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేశారు. వచ్చిన ఆదాయంలో ఎక్కువ భాగం కుటుంబ అవసరాలకే ఖర్చు చేసేవారు. దీంతో ప్రారంభంలో పెద్దగా పొదుపు చేసే అవకాశం లేకపోయింది.

ఐటీ ఉద్యోగంతో మార్పు..

ఐటీ రంగంలో ఉద్యోగం సంపాదించిన తర్వాత ఆమె ఆర్థిక ప్రణాళికలో మార్పు వచ్చింది. ప్రతి నెలా తన ఆదాయానికి అనుగుణంగా రూ.2,000 నుంచి రూ.5,000 వరకు పొదుపు చేయడం ప్రారంభించారు. ఇలా కొన్నేళ్లపాటు కూడబెట్టిన మొత్తంతో తక్కువ ధరకు ఓ స్థలాన్ని కొనుగోలు చేశారు. ఈ ఏడాది ఆ భూమిని మంచి లాభానికి విక్రయించారు.

భూమి అమ్మకం ద్వారా వచ్చిన డబ్బుతో పాటు ఇన్నాళ్లుగా కూడబెట్టిన పొదుపులను కలిపి 3BHK ఫ్లాట్‌కు డౌన్ పేమెంట్ చెల్లించారు. మిగిలిన మొత్తాన్ని హోమ్‌ లోన్‌ ద్వారా సమకూర్చుకున్నారు. ఈ ఇల్లు తనకు కేవలం ఆస్తి మాత్రమే కాదని, కుటుంబం కోసం చేసిన ఏళ్ల తరబడి శ్రమ, త్యాగాలు, కలలకు ప్రతిరూపమని ఆమె పేర్కొన్నారు.

మీరూ ఇల్లు కొనొచ్చు ఇలా..

తన అనుభవం నుంచి కొన్ని ముఖ్యమైన ఆర్థిక పాఠాలను కూడా శిఖా పంచుకున్నారు. ఇల్లు కొనాలనే లక్ష్యం ఉన్నవారు ముందుగానే ఆర్థిక ప్రణాళిక ప్రారంభించాలని, అత్యవసర అవసరాల కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఆదాయం తక్కువగా ఉన్నప్పటికీ ప్రతి నెలా కొంత మొత్తాన్ని క్రమం తప్పకుండా పొదుపు చేసి పెట్టుబడులు పెట్టాలని తెలిపారు.

ముఖ్యంగా కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తున్నవారు తమ ఆర్థిక పురోగతిని ఇతరులతో పోల్చుకోవద్దని సూచించారు. ప్రతి ఒక్కరి పరిస్థితులు, అవకాశాలు వేర్వేరుగా ఉంటాయని గుర్తుచేశారు. ఆమె ప్రయాణంపై సోషల్ మీడియాలో పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. చిన్న మొత్తాలతో ప్రారంభించిన పొదుపు, దీర్ఘకాలిక పెట్టుబడి, ఆర్థిక క్రమశిక్షణ ఒక పెద్ద లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎలా దోహదపడతాయో ఈ ఉదంతం తెలియజేస్తోంది.

ఇదీ చదవండి: బెంగళూరులో అద్దె ఇల్లు.. వింత షరతులు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement