నో ఐఐటీ ట్యాగ్‌ : ఆంత్రోపిక్‌ సీటీఓగా రాహుల్‌ సక్సెస్‌ స్టోరీ | IIT tag no Ivy League degree How Rahul Patil became the CTO of Anthropic | Sakshi
Sakshi News home page

నో ఐఐటీ ట్యాగ్‌ : ఆంత్రోపిక్‌ సీటీఓగా రాహుల్‌ సక్సెస్‌ స్టోరీ

Nov 17 2026 4:52 PM | Updated on Nov 17 2026 4:57 PM

IIT tag no Ivy League degree How Rahul Patil became the CTO of Anthropic

అమెరికా అనేక దిగ్గజ కంపెనీల్లో ఉన్నత పదవులు పొందిన భారతీయ సంతతికి చెందిన ఎగ్జిక్యూటివ్స్‌లా అతను  ఐఐటీలోగానీ, ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయంలోగానీ  చదువుకోలేదు. అయితేనేం  ప్రపంచంలోని ప్రముఖ ఏఐ (AI)  ఆంత్రోపిక్‌(Anthropic)కు చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (CTO)గా సత్తా చాటుతున్నారు రాహుల్‌ పాటిల్‌. బెంగళూరులోని పీఈఎస్  ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని కంప్యూటర్ సైన్స్ తరగతి గది నుండి అత్యున్నత టెక్నాలజీ పదవి దాకా రాహుల్ కరీర్‌  ప్రపంచంలోని కొన్ని అతిపెద్ద టెక్ సంస్థల్లో సాగింది.  గ్లోబల్ టెక్నాలజీ కెరీర్ అంటే ఐఐటీ డిగ్రీ లేదా ఎలైట్ కాలేజీ ట్యాగ్ ఉండాలని భావించే ఇంజనీరింగ్ విద్యార్థులకు రాహుల్‌ సక్సెస్‌  స్టోరీ ఒక  కనువిప్పు.

ప్రపంచంలోని అతిపెద్ద ఏఐ కంపెనీలలో ఒకదాని టెక్నాలజీ బృందానికి నాయకత్వం వహించాలంటే ఏం చేయాలి అనేదానికి రాహుల్ పాటిల్  ప్రస్తానం చక్కటి ఉదాహరణ. బెంగళూరులోని పీఈఎస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని కంప్యూటర్ సైన్స్ తరగతి గదిలో మొదలైంది.  అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత, పాటిల్ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. అరిజోనా స్టేట్ యూనివర్సిటీ నుండి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పొందారు, ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ నుండి ఎంబీఏ పూర్తి చేశారు. పాటిల్ తన కెరీర్‌లో మైక్రోసాఫ్ట్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS), ఒరాకిల్ క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి టెక్నాలజీ పరిశ్రమలోని కొన్ని అతిపెద్ద సంస్థలలో పనిచేశారు. టెక్‌ ఇండస్ట్రీలో ఆయన సంపాదించిన అనుభవమే చివరికి ఆయన్ను ఆంత్రోపిక్ నాయకత్వ బృందంలోకి తీసుకువెళ్ళింది. గత ఏడాది అక్టోబర్‌లో ఏఐ అసిస్టెంట్ 'క్లాడ్' (Claude) రూపొందించిన ఆంత్రోపిక్ సంస్థకు చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (CTO) గా నియమితులయ్యారు.


మైక్రోసాఫ్ట్ నుండి స్ట్రైప్ వరకు
రాహుల్‌  కెరీర్ మైక్రోసాఫ్ట్ (Microsoft)లో ప్రారంభించారు, అక్కడ ఆయన తొమ్మిదేళ్లపాటు వివిధ ఇంజనీరింగ్ హోదాల్లో పనిచేశారు. 2013లో, అమెజాన్ వెబ్ సర్వీసెస్‌ (AWS) లో మేనేజర్‌గా చేరారు.  ఆ తర్వాత ఒరాకిల్ క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (Oracle Cloud Infrastructure) వంటి టెక్నాలజీ పరిశ్రమలోని దిగ్గజ సంస్థల మీదుగా సాగింది. భారీ స్థాయిలో పనిచేసే వ్యాపారాలకు మద్దతు ఇచ్చే టెక్నాలజీ మౌలిక సదుపాయాల నిర్మాణం, నిర్వహన ఆయన పనిలో భాగం. ఈ అనుభవమే టాప్‌ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల వెనుక ఉండే సిస్టమ్‌లు, కంప్యూటింగ్ సామర్థ్యాలు , ఇంజనీరింగ్ సవాళ్లపై ఆయనకు లోతైన అవగాహనను కల్పించాయి. ఆంత్రోపిక్ కంటే ముందు పాటిల్‌ గ్లోబల్ పేమెంట్స్ కంపెనీ 'స్ట్రైప్' (Stripe) లో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా పనిచేశారు. అక్కడ సాంకేతిక విభాగానికి నాయకత్వం వహిస్తూ, లక్షలాది వ్యాపారాలకు మద్దతు ఇచ్చే మౌలిక సదుపాయాలపై పనిచేశారు. ఆయన నియామకాన్ని ప్రకటిస్తూ, టెక్నాలజీ మౌలిక సదుపాయాలను నిర్మించడంలో మరియు నిర్వహించడంలో పాటిల్‌కు 20 సంవత్సరాలకు పైగా అనుభవం ఉందని ఆంత్రోపిక్ పేర్కొనడం ఆయన ప్రతిభకు నిదర్శనం.  

ప్రస్తుతం 'క్లాడ్' వెనుక ఉన్న టెక్నాలజీ నిర్మాణంలో...

ఆంత్రోపిక్ సీటీఓగా పాటిల్  బాధ్యతలలో కంపెనీ ఇంజనీరింగ్ విభాగం, ప్రొడక్ట్, కంప్యూట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇన్‌ఫరెన్స్, డేటా సైన్స్ సెక్యూరిటీ వంటి కీలక అంశాలు ఉన్నాయి. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఆంత్రోపిక్ తన 'క్లాడ్' (Claude) ను విస్తరిస్తూ, ఏఐ మౌలిక సదుపాయాలను పెంచుకుంటున్న కీలక సమయంలో ఆయన ఈ బాధ్యతలు చేపట్టారు. ఏఐ ప్రొడక్ట్ నిర్మించడం ఒక సవాలు అయితే, దాని వెనుక ఉన్న టెక్నాలజీ లక్షలాది మంది వినియోగదారులకు నమ్మకంగా సేవలు అందించేలా చూడటం మరో పెద్ద సవాలు.

తన నియామక ప్రకటన సందర్భంగా పాటిల్ మాట్లాడుతూ, ఏఐ అభివృద్ధి దశలోని కీలక మలుపు వద్ద తాను ఆంత్రోపిక్‌లో చేరడంపై  సంతోషాన్ని ప్రకటించారు. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం చాలా ముఖ్య మని, బాధ్యతా యుతమైన ఏఐ విజయం సాధించాలని ఆయన నొక్కి చెప్పారు. మనం ఎక్కడ, ఏమి చదివాం అనేది కూడా ముఖ్యమే అయినప్పటికీ జీవితంలో నిత్య విద్యార్థిగా పెంచుకున్న నైపుణ్యాలు, అనుభవం, క్లిష్టమైన సవాళ్లను స్వీకరించే సామర్థ్యం కూడా సక్సెస్‌కు  అంతే ముఖ్యమని రాహుల్‌ పాటిల్ ప్రయాణం చెప్పకనే చెబుతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement