'డిజిటల్ అరెస్ట్' స్కామ్‌లో న్యూయార్క్‌కు చెందిన రిటైర్డ్ న్యాయవాది ఒకరు భారీగా నష్టపోయిన వైనం వెలుగులోకి వచ్చింది. సైబర్ నేరగాళ్లు సీబీఐ (CBI), ఎన్ఐఏ (NIA) అధికారులుగా నటిస్తూ చేసిన డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లో ఆయన సుమారు రూ. 4 కోట్లు పోగొట్టుకున్నారు. పహల్గామ్ ఉగ్రదాడితో ఆయనకు సంబంధం ఉందంటూ భయపెట్టి ఈ మోసానికి పాల్పడ్డారు. ఈ మోసం ఎలా జరిగిందంటే..
బాధితుడైన 62 ఏళ్ల అతుల్ తల్వార్ న్యూయార్క్‌లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసి పదవీ విరమణ చేశారు. ఢిల్లీకి చెందిన ఆయన 1982లో న్యూయార్క్ వెళ్లి, దాదాపు మూడు దశాబ్దాల పాటు కార్మిక సంఘాల తరపున వాదించారు. జులై 31న న్యూయార్క్ నుండి భారత్‌కు వచ్చిన ఆయన, నోయిడా సెక్టార్ 30లోని తన పూర్వీకుల ఇంటి మరమ్మతు పనులను పర్యవేక్షిస్తూ గురుగ్రామ్‌లోని తన సోదరుడి వద్ద ఉంటున్నారు. ఇదే అదునుగా సైబర్ కేటుగాళ్లు రంగంలోకి దిగారు. చకా చకా తన ప్లాన్‌ను అమలు చేశారు.
బాధితుడి ఫిర్యాదు మేరకు అక్టోబర్ 17న మోసగాళ్లు తల్వార్‌ను సంప్రదించారు. మొదటి కాలర్ తనను తాను ముంబైలోని కొలాబా పోలీస్ స్టేషన్ పోలీసు అధికారిగా పరిచయం చేసుకుని, పహల్గామ్ ఉగ్రదాడి కేసుకు సంబంధించి తల్వార్ ఆధార్ కార్డు దొరికిందని చెప్పాడు. ఆయన ఆధార్ ఆధారంగా ఉన్న కెనరా బ్యాంక్ ఖాతా ద్వారా రూ. 53 కోట్లు బదిలీ అయ్యాయని, ఈ లావాదేవీలో ఆయనకు రూ. 5 కోట్లు కమీషన్ అందిందని కాలర్ ఆరోపించాడు. తల్వార్ ఈ ఆరోపణలను ఖండించగా, కాల్‌లో ఉన్న మరో వ్యక్తి తక్షణమే అరెస్టు చేస్తామని బెదిరించాడు. ఆ వెంటనే, మోసగాళ్లు సీబీఐ అసిస్టెంట్ డైరెక్టర్ పేరుతో ఉన్న ఒక రహస్య లేఖను వాట్సాప్‌లో పంపారు. అనంతరం ఆయనను నిరంతరం ఆడియో, వీడియో నిఘాలో ఉంచి, బయటకు వెళ్లకుండా కట్టడి చేశారు. ఆయనను కలవడానికి ఎవరు వస్తున్నారో ఆ వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు.
అక్టోబర్ 18న, ఉగ్రవాదులతో సంబంధం ఉన్న ఇద్దరు సాయుధ గార్డులను ఆయన నివాసానికి సమీపంలో అరెస్టు చేస్తున్నట్లుగా ఒక దృశ్యాన్ని వీడియోలో చూపించి ఆయన భయాన్ని మరింత పెంచారు. ఇలా ఆయనను దాదాపు 20 రోజుల పాటు వర్చువల్ నిఘాలో ఉంచి, విచారణ పేరుతో తన పొదుపు మొత్తాన్ని వివిధ ఖాతాలకు బదిలీ చేసేలా ఒప్పించారు.
మరుసటి రోజు, అక్టోబర్ 19న నిందితులు తమను తాము సీబీఐ, ఎన్ఐఏ అధికారులుగా పరిచయం చేసుకుని, వీడియో కాల్స్ ద్వారా 'ఆన్‌లైన్ విచారణ' (Online Hearings) పేరుతో నాటకం ప్రారంభించారు.
ఈ క్రమంలో బాధితుడి సిటీబ్యాంక్‌లోని ఆయన వ్యక్తిగత రిటైర్మెంట్ ఖాతాలో ఉన్న డాలర్లను నగదుగా మార్చి(సుమారు 3.55కోట్ల రూపాయలు) బదిలీ చేయాలని ఆదేశించారు. రెండు బ్రోకరేజ్ ఖాతాల నుండి నిధులను బదిలీ చేయడంలో సహాయపడటానికి ఒక నకిలీ ఐటీ నిపుణుడిని కూడా ఆయనకు పరిచయం చేశారు. అంతేకాకుండా, ఆన్‌లైన్‌లో ఒక క్రిప్టోకరెన్సీ ఖాతాను తెరిచేలా ఆయనను ఒప్పించారు.
ఇదీ చదవండి: 77 ఏళ్ల గంగా బాబా గుట్టురట్టు : ఏడు రోజులు నరక యాతన
సుమారు రూ. 4 కోట్ల నష్టం
ఇందులో భాగంగా, పన్ను చెల్లింపుల పేరుతో సుమారు రూ. 1.5 కోట్లు మినహాయించుకోగా, దాదాపు రూ. 2.5 కోట్లను 'ఎథీరియం' (Ethereum) క్రిప్టోకరెన్సీ రూపంలో బదిలీ చేయించుకున్నారు. మొత్తంగా నవంబర్ 7 నాటికి బాధితుడు దాదాపు రూ. 4 కోట్లు కోల్పోయారు.
తమ విచారణ పూర్తయిన వెంటనే డబ్బు తిరిగి ఇచ్చేస్తామని మోసగాళ్లు పదేపదే హామీ ఇచ్చారు. అయితే, నవంబర్ 7 నాటికి కూడా డబ్బు తిరిగి రాకపోవడంతో తల్వార్‌కు అనుమానం వచ్చింది. ఆ వెంటనే నిందితులు ఆయనను సంప్రదించడం మానేశారు. దీంతో తాను నిజమైన విచారణలో కాకుండా సైబర్ మోసానికి గురయ్యానని ఆయన గ్రహించారు. చివరికి తల్వార్ గౌతమ్ బుద్ధ నగర్‌లోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. నవంబర్ 11న న్యూయార్క్ తిరిగి వెళ్లిన ఆయన, అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI)కి కూడా ఫిర్యాదు చేశారు. ఖచ్చితంగా కొన్ని అనుమానాలు వచ్చినప్పటికీ వారు నిజమైన పోలీసులు కాదని ఒక్క క్షణం కూడా తనకు అనిపించలేదని వాపోయారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీసీపీ (సైబర్ సెక్యూరిటీ) శైవ్య గోయల్ తెలిపారు.
ఇదీ చదవండి: 178 సంస్థలపై భారీ సైబర్ దాడి.. ఐఫోన్లు, క్రిప్టో టార్గెట్లు


