శబరిమల: ఉచిత టాయిలెట్లకు నీళ్లు బంద్.. నకిలీ కూపన్ల దందా! | Devaswom Board alleges attempt to disrupt water supply to toilets at Pampa | Sakshi
Sakshi News home page

శబరిమల: ఉచిత టాయిలెట్లకు నీళ్లు బంద్.. నకిలీ కూపన్ల దందా!

Nov 17 2026 11:49 AM | Updated on Nov 17 2026 11:54 AM

Devaswom Board alleges attempt to disrupt water supply to toilets at Pampa

శబరిమల: శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు  చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. భక్తుల కోసం ఉచితంగా ఏర్పాటు చేసిన టాయిలెట్లకు నీటి సరఫరాను ఉద్దేశపూర్వకంగా నిలిపివేసేందుకు కుట్ర జరిగినట్లు ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది. మరోవైపు విశ్రాంతి కేంద్రాల్లో నకిలీ కూపన్లతో అదనపు డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించిన వ్యవహారం బయటపడింది.

పంపాలోని నాలుగు టాయిలెట్ సముదాయాలు, పోలీసు మెస్‌కు ఆదివారం సాయంత్రం నీటి సరఫరా నిలిచిపోయింది. అధికారులు పరిశీలించగా ఉద్దేశపూర్వకంగా వాల్వులు మూసివేసినట్లు గుర్తించారు. వెంటనే వాటిని సరిచేశారు. దీని వెనుక కుట్ర ఉందని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు కె. జయకుమార్ ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ ఏడాది తొలిసారిగా టాయిలెట్ల నిర్వహణ బాధ్యతలను దేవస్థానం బోర్డు స్వయంగా చేపట్టింది. భక్తులకు పూర్తిగా ఉచితంగా సేవలు అందిస్తోంది. గతంలో ఈ సౌకర్యాలను వేలంలో కాంట్రాక్టర్లు దక్కించుకుని భారీగా లాభాలు పొందేవారని జయకుమార్ వెల్లడించారు. వాస్తవానికి టాయిలెట్ వినియోగానికి అధికారిక రుసుము రూ.5 మాత్రమేనని, కొందరు భక్తుల నుంచి రూ.50 నుంచి రూ.500 వరకు వసూలు చేసేవారని తెలిపారు.

ఉచిత సౌకర్యాల నిర్ణయంతో నష్టపోయినవారే ప్రస్తుత వ్యవస్థను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. బాధ్యులను గుర్తించేందుకు సంబంధిత ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇదిలా ఉంటే.. భక్తులు విశ్రాంతి తీసుకునే విరివెప్పు కేంద్రాల్లోనూ మరో అక్రమం వెలుగులోకి వచ్చింది. సన్నిధానం అన్నదాన మండపం సమీపంలోని కేంద్రంలో తనిఖీలు నిర్వహించగా ఏకంగా 53 కట్టల కూపన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో ధరలు పేర్కొనని కూపన్లు కూడా ఉండటంతో అక్రమ వసూళ్లకు సిద్ధమైనట్లు అనుమానిస్తున్నారు.

ఈ కేంద్రంలో విశ్రాంతి సౌకర్యానికి నిర్ణయించిన రుసుము కేవలం రూ.50 మాత్రమే. అయినప్పటికీ నకిలీ కూపన్లతో అదనపు డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించినట్లు అధికారులు గుర్తించారు. అనధికారిక కూపన్లు ముద్రించినా, నిర్ణీత రుసుము కంటే ఎక్కువ వసూలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని జయకుమార్ హెచ్చరించారు. ఇతర కేంద్రాల్లోనూ తనిఖీలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి: శబరిమల: తెల్లారి 3 గంటలకే పోటెత్తిన భక్తులు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement