తిరువనంతపురం: శబరిమల అయ్యప్ప స్వామి మండల దీక్ష యాత్రకు ఆలయం తెరుచుకునే సమయం దగ్గరపడుతోంది. మరో రెండు రోజుల్లో యాత్ర ప్రారంభం కానుండగా పంబలో యాత్రికుల కోసం సకల ఏర్పాట్లను అధికారులు పూర్తిచేశారు. చాళక్కయం నుంచి పంబ వరకు సుమారు రెండు కిలోమీటర్ల పాత కాంక్రీట్ రోడ్డును విస్తరించడంతోపాటు కొత్తగా తారు రోడ్డు వేశారు. పంబ కేఎస్‌ఆర్టీసీ బస్‌స్టాండ్‌కు సమీపంలో సుమారు 100 కార్లకు సరిపడా పార్కింగ్ స్థలాన్ని సిద్ధం చేశారు. అయితే అది మట్టి ప్రదేశం కావడంతో వర్షాలకు బురద సమస్య తలెత్తే అవకాశం ఉందింటున్నారు.
భక్తులకు విశ్రాంతి గదులు, క్యూ సౌకర్యాలు
పంబలో విశ్రాంతి షెల్టర్ల నిర్మాణం దాదాపు పూర్తయింది. వాటి పక్కనే ఉచిత మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. నవంబర్ 7న అధికారులు వీటిని పరిశీలించారు. నడక మార్గం ప్రారంభమయ్యే ప్రాంతంలో వర్చువల్ క్యూ బుకింగ్ సదుపాయంతోపాటు ఎండ నుంచి రక్షణకు షెల్టర్లు ఏర్పాటు చేశారు.
శరణుఘోషకు సిద్ధమవుతున్న పంబ
ప్రస్తుతం పంబ నదిలో నీటి ప్రవాహం తక్కువగా ఉంది. అయితే ఈ ప్రాంతంలో పలు నిర్మాణ పనుల కోసం వచ్చిన కార్మికులే కనిపిస్తున్నారు. ప్రస్తుతం పంబ కేఎస్‌ఆర్టీసీ బస్‌స్టాండ్ ప్రశాంతంగా ఉన్నప్పటికీ, త్వరలో వివిధ రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చే భక్తులతో సందడిగా మారనుంది. మండల దీక్ష రద్దీకి ముందే పందళం, పంబలో మిగిలిన సౌకర్యాలను పూర్తి చేయాలని భక్తులు కోరుతున్నారు.
పందళంలో సమస్యలెన్నో!
పందళంలో గత ఏడాది ప్రారంభించిన కొత్త అయ్యప్ప బస్‌స్టాండ్ ఇంకా అందుబాటులోకి రాలేదు. ప్రహరీ గోడ లేకపోవడంతో ఆర్టీఓ అనుమతి లభించలేదని సమాచారం. ఉచిత పార్కింగ్ స్థలం పరిమితంగా ఉండటంతోపాటు వర్షాలకు బురదమయంగా మారుతోంది. దీంతో భక్తులు పెయిడ్ పార్కింగ్‌ను ఆశ్రయిస్తున్నారు. దశాబ్దాల నాటి మరుగుదొడ్లే అందుబాటులో ఉండగా, కొత్తవాటిలో కొన్నింటిని అధికారుల వినియోగానికి కేటాయించారనే విమర్శలున్నాయి.
అన్నదానం, వైద్య సేవల్లోనూ ఇబ్బందులు
సరైన ప్రణాళిక లేకుండా నిర్మించిన అన్నదాన మండపానికి మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగం అనుమతి లభించలేదు. మహిళా భక్తులు స్నానాల అనంతరం దుస్తులు మార్చుకునేందుకు తగిన సౌకర్యాలు లేవు. విశ్రాంతి గదులు సరిపోవడం లేదు. రాత్రివేళ వైద్యులు, మందులు అందుబాటులో లేకపోవడం మరో సమస్య. పందళం రాజభవనం, తిరువాభరణ దర్శనం కోసం ఇతర రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు వస్తున్నప్పటికీ మౌలిక సదుపాయాలు పూర్తిస్థాయిలో కల్పించలేదనే విమర్శలున్నాయి. అయితే మున్సిపాలిటీ పరిధిలో 85 శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలినవి రెండు మూడు రోజుల్లో పూర్తి చేస్తామని చైర్‌పర్సన్ తెలిపారు.
ఇదీ చదవండి: ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో గురునానక్ బోధనలు!


