లక్నో: ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో 2027 అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే వేడి మొదలైంది. మీరట్‌లో నిర్వహించిన సామాజిక పరివర్తన్ మోర్చా సభలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2027లో యోగి ఆదిత్యనాథ్‌ను, 2029లో ప్రధాని నరేంద్ర మోదీని అధికారానికి దూరం చేస్తామని ప్రకటించారు. ఉత్తరప్రదేశ్ తదుపరి ముఖ్యమంత్రిగా చంద్రశేఖర్ ఆజాద్‌ను ప్రకటించి రాజకీయంగా సరికొత్త చర్చకు తెరలేపారు.
ఈ సందర్భంగా సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్‌పై ఓవైసీ తీవ్ర విమర్శలు చేశారు. ముస్లింల అదృష్టాన్ని నిర్ణయించే అధికారం అల్లా చేతుల్లో ఉందని, అఖిలేశ్ చెప్పినట్లు తమ రాజకీయ ప్రయాణానికి ఎవరి నియంత్రణ లేదన్నారు. అఖిలేశ్ రాజకీయ తాడు మాత్రం బీజేపీ చేతుల్లో ఉందని వ్యాఖ్యానించారు. సమాజ్‌వాదీ పార్టీ ఎన్నికల్లో బీజేపీని అడ్డుకోవడంలో విఫలమైందని విమర్శించారు. పీడీఏ నినాదాన్ని ప్రస్తావిస్తూ ‘పల్టు దియా అఖిలేశ్’ అంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు కూడా తమ కూటమిలో చేరాలని ఆహ్వానించారు.
రైతుల రుణమాఫీ, చెరకు క్వింటాల్‌కు రూ.600 మద్దతు ధర, పది నెలల్లో చెరకు బకాయిల చెల్లింపు వంటి హామీలను ప్రకటించారు. యువతకు ఉపాధి, మెరుగైన విద్య, వైద్య సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. మీరట్, ముజఫర్‌నగర్ అల్లర్లు, దళితులు, మైనారిటీలపై వివక్ష, మూకదాడుల అంశాలను కూడా ప్రస్తావించారు. ఇదిలా ఉండగా సభలో కొందరు యువకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కుర్చీలు విసరడంతో పాటు బారికేడ్లు ధ్వంసమయ్యాయి. దీంతో కొంతసేపు సభా ప్రాంగణంలో గందరగోళం నెలకొంది.
ఇదీ చదవండి: పెళ్లి కోసం కెనడా నుంచి వచ్చిన 61 ఏళ్ల మహిళకు షాక్!


