పోలీసు కమిషనర్‌ సీమా లాట్కర్‌ బదిలీ | Police Commissioner Seema Latkar Transferred | Sakshi
Sakshi News home page

పోలీసు కమిషనర్‌ సీమా లాట్కర్‌ బదిలీ

Nov 15 2026 8:35 AM | Updated on Nov 15 2026 8:44 AM

Police Commissioner Seema Latkar Transferred

కర్ణాటక: ఈ మధ్యకాలంలో తరచుగా వివాదాలతో వార్తల్లోకెక్కుతున్న మైసూరు నగర పోలీసు వ్యవస్థలో భారీ మార్పు జరిగింది. సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న పోలీస్‌ కమిషనర్‌ సీమా లాట్కర్‌ను సర్కారు ఆకస్మికంగా బదిలీ చేసింది. ఆమె స్థానంలో ఎన్‌.విష్ణువర్ధన్‌ను నియమించింది. ఆయన 2012 బ్యాచ్‌ ఐపీఎస్‌. ఇప్పటివరకు మైసూరులోని కర్ణాటక పోలీస్‌ అకాడమీ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. విష్ణువర్ధన్‌ గతంలో విరాజ్‌పేట డీఎస్పీ, ఉడుపి, ఉత్తర కన్నడ, మైసూరు జిల్లా ఎస్పీగా వ్యవహరించారు.

సీమాకు వేకెన్సీ రిజర్వు..  
సుమారు మూడేళ్లుగా మైసూరు పోలీసు బాస్‌గా సేవలందిస్తున్న సీమా లాట్కర్‌ను బదిలీ చేయడంతో పాటు ఇంకా ఆమెకు మరే పోస్టును కేటాయించకుండా వేకెన్సీ రిజర్వులో ఉంచారు. మైసూరు నగరంలో పెరుగుతున్న మాదకద్రవ్యాల అక్రమ రవాణా, ఇతర రాష్ట్రాల పోలీసులు మైసూరులో మాదకద్రవ్యాల కర్మాగారాలను కనుగొని దాడులు చేయడం వంటివి రాష్ట్ర ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బందిని కలిగించింది. దొంగతనాలు, దోపిడీల బెడద కూడా ఎక్కువగా ఉంది.  

దసరా తగాదాలతో తలనొప్పి  
ఈసారి నాడహబ్బ మైసూరు దసరా ఉత్సవాలలో రచ్చలు సరేసరి. ప్యాలెస్‌లోని రాజవంశీకులు, పోలీసు అధికారుల మధ్య వైమనస్యాలు రచ్చకెక్కాయి. దసరా రోజున రాజభవనంలో పోలీసుల ప్రవర్తన కారణంగా, రాజకుటుంబం వజ్రముష్టి కుస్తీ పోటీలను జరపలేకపోయిందని ఆరోపణలున్నాయి. అలాగే బంగారు ఖజానా ముందు ఇతర వ్యక్తులు ఫోటోలు తీసుకోవడం వంటివి జరిగాయని రాజమాత ప్రమోదాదేవి పలుమార్లు మీడియా భేటీల్లో అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆమె రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు కూడా రాయడంతో ఎప్పుడూ లేని విధంగా రభస తలెత్తింది. దీనిపై సీఎం డీకే శివకుమార్‌ కూడా తరచూ వివరణ ఇచ్చుకుంటూ వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం, ఇన్‌చార్జి మంత్రి యతీంద్ర చర్యలు, పోలీసుల తీరుపై ప్యాలెస్‌ నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో సీమా లాట్కర్‌కు డీకే ప్రభుత్వం స్థానభ్రంశం కలిగించింది. మునుముందు మరిన్ని మార్పులు   ఉండవచ్చని ప్రచారం ఊపందుకుంది.

విష్ణువర్ధన్‌ స్వీకారం 
ఎన్‌.విష్ణువర్ధన్‌ శనివారమే బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయిన వెంటనే ఆయన నగర పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయానికి చేరుకుని, బదిలీ పత్రాలపై సంతకం చేసి కుర్చీలో కూర్చున్నారు. డీసీపీ సుందర్‌తో సహా పోలీస్‌ అధికారులు ఆయనకు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement