సాక్షి,బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర కలకలం సృష్టిస్తున్న 'స్టింగ్ ఆపరేషన్' వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. తాజాగా కేంద్ర మంత్రి, జేడీఎస్ అధినేత హెచ్‌డీ కుమారస్వామి రాష్ట్ర ప్రభుత్వంపై, ముఖ్యంగా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌పై సంచలన ఆరోపణలు చేశారు. మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ కుటుంబాన్ని రాజకీయంగా అంతం చేయడమే లక్ష్యంగా రూ. 600 కోట్ల కుట్రకు తెరలేపారని ఆయన ఆరోపించారు.
హాసన్ జిల్లాలోని శ్రీ రంగనాథస్వామి ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం కుమారస్వామి విలేకరులతో మాట్లాడారు. ‘మా కుటుంబాన్ని నాశనం చేయడానికి, రాజకీయ ఉనికిని దెబ్బతీయడానికి అనేక కుట్రలు పన్నారు. అందులో భాగంగానే రూ. 600 కోట్ల 'సుపారీ' ప్లాన్ చేశారు. మా కుటుంబాన్ని అంతం చేయాలని ఆదేశించింది మరెవరో కాదు, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలోని ముఖ్య నేతలే. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదని అన్నారు.
స్టింగ్ ఆపరేషన్ వెనుక ఉన్నదెవరు?
ఈ వివాదాస్పద స్టింగ్ ఆపరేషన్ వెనుక ఎవరున్నారనే విషయాల్ని వెల్లడించారు.జర్నలిస్ట్ రాకేష్ శెట్టి, కాంగ్రెస్ నాయకురాలు కృపా అల్వా, వారి అనుచరులు కలిసి నిర్వహించారని వెల్లడించారు. 2023లో కాంగ్రెస్ కార్యకర్తల సహకారంతో రూపొందించిన ఈ స్టింగ్ ఆపరేషన్‌ను, అప్పట్లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను పదవి నుంచి తొలగించేందుకు ఉపయోగించినట్లు స్పష్టం చేశారు. ఈ పరిణామాల గురించి డీకే శివకుమార్‌తో పాటు మరికొందరు కాంగ్రెస్ నాయకులకు ముందే తెలుసని ఆయన ఆరోపించారు.
డైవర్షన్ పాలిటిక్స్
రాష్ట్రంలో ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్న కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామక కుంభకోణం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే ప్రభుత్వం ఈ స్టింగ్ ఆపరేషన్ డ్రామాను తెరపైకి తెచ్చిందని కుమారస్వామి విమర్శించారు. ఈ కుట్రలో హోంమంత్రి ప్రియాంక ఖర్గే, మాజీ సీఎం సిద్ధరామయ్య ప్రమేయం కూడా ఉందని పేర్కొన్నారు.
విచారణపై అనుమానాలు
స్టింగ్ ఆపరేషన్ విచారణలో 80 శాతం పూర్తయిందని హోం మంత్రి చెబుతున్నారని, అదే సమయంలో కేపీఎస్సీ కుంభకోణానికి సంబంధించిన విచారణను మాత్రం 90 శాతం వరకు కప్పిపుచ్చి అణచివేశారని కుమారస్వామి ఎద్దేవా చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు స్టింగ్ ఆపరేషన్‌లో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టమైన ఆధారాలు చూపించారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కావాలనే ఈ కేసు విచారణను జేడీఎస్ వైపునకు మళ్లిస్తోందని మండిపడ్డారు.
పోలీసుల వేధింపులు
ఈ స్టింగ్ ఆపరేషన్‌లో కేంద్ర మంత్రులకు, జేడీఎస్‌తో సన్నిహితంగా ఉండేవారు పారిపోయారంటూ రాష్ట్ర హోం మంత్రి చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని కుమారస్వామి తీవ్రంగా ఖండించారు. ఎవరు పారిపోయారు? పారిపోయేంత తప్పు వారేం చేశారు?" అని ప్రశ్నించారు. ఈ కుట్రలను ఎదుర్కొనే సత్తా తమ పార్టీకి ఉందన్నారు. ఒకవేళ ప్రభుత్వం ఈ విషయాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం కొనసాగిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.
మొత్తానికి, కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాలు, సీఎం కుర్చీ పోరుతో ప్రారంభమైన ఈ 'స్టింగ్ ఆపరేషన్' వ్యవహారం ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ జేడీఎస్ మధ్య తీవ్ర రాజకీయ రణరంగంగా మారింది. ఈ పరిణామాలు కర్ణాటక రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయనేది వేచి చూడాలి.
ఇదీ చదవండి : సీఎం డీకే రూ.50 హెయిర్‌కట్ స్టోరీ.. బీజేపీ రూ.1,400 కోట్ల ట్విస్ట్!


