ఢిల్లీ: కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన ఓ చిన్న వ్యాఖ్య ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. తన జీవనశైలి చాలా సాదాసీదాగా ఉంటుందని చెప్పేందుకు ఆయన రూ.50 హెయిర్‌కట్ ఉదాహరణగా చెప్పగా.. అదే వ్యాఖ్యను పట్టుకున్న బీజేపీ, శివకుమార్ ప్రకటించిన రూ.1,400 కోట్లకు పైగా ఆస్తులను ప్రస్తావిస్తూ తీవ్ర విమర్శలు గుప్పించింది.
బుధవారం జరిగిన ఇండియా టుడే రౌండ్‌టేబుల్ కర్ణాటక కార్యక్రమంలో డీకే శివకుమార్ ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శివకుమార్ వ్యక్తిగత జీవనశైలికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన సంఘటనను ప్రస్తావించారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఢిల్లీలోని తనకు ఇష్టమైన బార్బర్ దగ్గర హెయిర్‌కట్ చేయించుకోవాలని వెళ్లారని చెప్పారు.
తనకు సింపుల్‌గా జీవించడం ఇష్టం అంటూ చెప్పుకొచ్చారు. ఢిల్లీలో తనకు ఇష్టమైన బార్బర్ దగ్గరే ఇప్పటికీ రూ.50 చెల్లించి హెయిర్‌కట్ చేయించుకున్నానని ఆయన వెల్లడించారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత భద్రతా సిబ్బంది బార్బర్‌ను ఇంటికే పిలిపించాలని సూచించినా.. తానే స్వయంగా వెళ్లాలని పట్టుబట్టినట్లు తెలిపారు. తన వద్దకు వచ్చిన స్నేహితులు ఖరీదైన వస్తువులు బహుమతిగా ఇస్తుంటారని శివకుమార్ చెప్పారు. లూయిస్ విట్టన్ మఫ్లర్ కూడా తనకు స్నేహితులు ఇచ్చిందేనని పేర్కొన్నారు. ‘‘ఎంత తింటాం? సింపుల్‌గా జీవించడం ప్రాథమిక మర్యాద’’ అంటూ తన జీవన విధానాన్ని వివరించారు.
చదవండి: కర్ణాటకకు అన్నాడీఎంకే నేత వార్నింగ్.. ఆయన జైలుకే అంటూ..
అయితే శివకుమార్ చెప్పిన ‘సింపుల్ లైఫ్’ వ్యాఖ్యకు ఆయన ఎన్నికల అఫిడవిట్‌లో ప్రకటించిన ఆస్తుల వివరాలు పూర్తి భిన్నమైన చిత్రాన్ని చూపుతున్నాయని బీజేపీ విమర్శిస్తోంది. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో శివకుమార్, ఆయన ఆధారితులు ప్రకటించిన మొత్తం ఆస్తుల విలువ సుమారు రూ.1,413.78 కోట్లు. ఎన్నికల అఫిడవిట్ డేటాను సంకలనం చేసే మైఎనెట్ ప్రకారం ఈ మొత్తం దాదాపు రూ.1,413.80 కోట్లు. ఇందులో సుమారు రూ.273.42 కోట్ల చరాస్తులు, రూ.1,140.38 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు వివరాలు చెబుతున్నాయి. అంటే ఒకవైపు రూ.50కే హెయిర్‌కట్ చేయించుకుంటానని సీఎం చెబుతుండగా.. మరోవైపు ఆయన ప్రకటించిన ఆస్తుల విలువ రూ.1,400 కోట్లకు పైగా ఉండటాన్ని బీజేపీ రాజకీయంగా అస్త్రంగా మార్చుకుంది.


