మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్‌లో ఆసక్తికర పరిణామాలు
డిప్యూటీ సీఎం భట్టితో కొండా మురళీ భేటీ
కుమార్తె సుస్మిత వ్యాఖ్యలతో తనకేం సంబంధమన్న మురళీ
అంతకుముందే ప్రజాభవన్‌కు వచ్చిన ఉత్తమ్, శ్రీధర్‌బాబు, రాజగోపాల్‌రెడ్డి
ఏది పడితే అది రాస్తే మర్యాదగా ఉండదని కొన్ని మీడియాలకు రాజగోపాల్‌రెడ్డి హెచ్చరిక.. ఏబీఎన్ రాధాకృష్ణ ఒళ్లు దగ్గరపెట్టుకోవాలని తీవ్ర వ్యాఖ్యలు
సాయంత్రం బెంగళూరుకు వెళ్లిన భట్టి... ఖర్గేను కలిసే చాన్స్
అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యే లోపు సురేఖ ఎపిసోడ్‌కు ఫుల్‌స్టాప్
సాక్షి, హైదరాబాద్: దేవాదాయ, అటవీ శాఖల మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ ఊహించని మలుపులు తిరుగుతోంది. ఆమెపై వేటు వేయాల్సిందేనంటూ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో శంఖంలో పోయడమే తరువాయి అనుకుంటున్న తరుణంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారిక నివాసమైన ప్రజాభవన్ వేదికగా నాటకీయ ఘటనలు జరిగాయి. యాదృచ్ఛికమో ఏమో తెలియదు కానీ క్రమశిక్షణ కమిటీ నివేదిక ఇచ్చిన మరుసటి రోజు బుధవారం భట్టి నివాసంలో కొండా మురళీ కనిపించారు. ఆయన వచ్చిన సమయంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కూడా అక్కడే ఉన్నారు. దీంతో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో కనిపించింది. కొండా ఎపిసోడ్‌ను కోల్డ్‌స్టోరేజీలో పెట్టే దిశలో పరిణామాలు జరుగుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే సురేఖ కుటుంబంతో మాట్లాడే బాధ్యతలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. భట్టికి అప్పగించారని, అందులో భాగంగానే మురళీని కలిశారని అంటున్నారు.
కలిసి వచ్చారా..?
మంత్రులు ఉత్తమ్, శ్రీధర్‌బాబు, అసమ్మతికి మారుపేరైన రాజగోపాల్‌రెడ్డి ప్రజాభవన్‌లో ఉన్న సమయంలోనే మురళీ కూడా రావడం అత్యంత రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే, గ్లోబల్ సమ్మిట్‌పై మంత్రివర్గ ఉపసంఘం సమావేశం కోసం ఉత్తమ్, శ్రీధర్‌బాబు వచ్చారని, తన నియోజకవర్గ పనుల కోసం రాజగోపాల్‌రెడ్డి వచ్చారే తప్ప ముందస్తు సమాచారం ప్రకారం రాలేదని ప్రజాభవన్ వర్గాలు తెలిపాయి. కానీ, మురళీని కలిసేందుకు భట్టి సమ్మతించడం, సీఎంతో ఆయన ఎప్పటికప్పుడు మాట్లాడుతుండటం, సాయంత్రానికి హడావిడిగా బెంగళూరుకు బయలుదేరి వెళ్లడంతో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ వ్యక్తమవుతోంది. భట్టి భుజంపై తుపాకీ పెట్టి సురేఖ కుటుంబాన్ని కాల్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా లేదంటే తొందరపడద్దనే ధోరణితో సీఎం ఉన్నారా... లేదా సురేఖ వ్యవహారం మధ్యే మార్గంలో వెళ్తుందా అన్న చర్చ గాం««దీభవన్ వర్గాల్లో జరుగుతోంది. భట్టి గురువారం బెంగళూరులో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను కలిసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే మాత్రం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే సెపె్టంబర్ 7 నాటికే కొండా ఎపిసోడ్‌కు ఫుల్‌స్టాప్ పడుతుందని సమాచారం.
మురళీ ఏమన్నారంటే...
మురళీ, భట్టి భేటీలో ఏం జరిగిందన్నది కూడా రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం భట్టి కొంత గట్టిగానే మాట్లాడినట్టు తెలుస్తోంది. సుస్మిత చేసిన వ్యాఖ్యలు సీఎంను కించపరిచేలా, పార్టీని నష్టపరిచేలా ఉన్నాయని చెప్పినట్లు సమాచారం. అయితే, సుస్మిత మాటలతో తనకేం సంబంధమని మురళీ చెప్పినట్టు తెలిసింది. పదేపదే వివాదాలకు కారణమవడం, జిల్లా నేతలతో సమన్వయంతో వ్యవహరించలేకపోవడం, సీఎంతో ముఖాముఖి కలిసే పరిస్థితి కూడా లేకుండా చేసుకోవడం లాంటి అంశాలపై ఇద్దరూ చర్చించినట్టు సమాచారం. అనంతరం మురళీ మీడియాతో మాట్లాడుతూ.. తాను ఓ బిల్లు కోసం భట్టి దగ్గరకు వచ్చానని చెప్పారు. సుస్మిత వ్యాఖ్యల గురించి తాను భట్టితో మాట్లాడలేదని, ఆ వ్యాఖ్యలకు తనకు ఏం సంబంధమని ప్రశ్నించారు. ‘అది నా బిడ్డకు సంబంధించింది. ఆమెకు 35 ఏళ్ల వయసు.. 15 ఏళ్ల పిల్లలున్నారు. వరల్డ్ చాంపియన్ అయిన కొడుకు ఉన్నాడు.
ఆమె మనోభావాలు ఆమెకు ఉండొచ్చు. ఎవరి స్వతంత్రత వారిది... ఆమెను ప్రశ్నించే హక్కు మాకు లేదు. ఆమె ప్లాన్ ఏలో భాగంగా ఏదో మాట్లాడింది. ప్లాన్ బీలో ఏం చేస్తుందో.. ఆమె మనసులో ఉన్నది మాకెలా తెలుస్తుంది. కవిత గారు పోయారు. అలానే ఎవరి నిర్ణయం వాళ్లు తీసుకుంటారు. మాకు సోనియా, రాహుల్, ప్రియాంకా గాం«దీలపై సంపూర్ణ విశ్వాసం ఉంది. మేం కాంగ్రెస్‌లోనే ఉంటాం’ అని మురళీ వ్యాఖ్యానించారు. రాజగోపాల్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తన నియోజకవర్గ విషయాలు మాట్లాడేందుకు ప్రజాభవన్‌కు వచ్చానన్నారు. తాను ఎప్పుడూ ముఖ్యమంత్రి గురించి, వ్యక్తిగతంగా ఎవరి గురించీ మాట్లాడలేదన్నారు. పార్టీ క్రమశిక్షణ విషయంలో హైకమాండ్‌దే తుది నిర్ణయమని, ఏఐసీసీ ఏ నిర్ణయం తీసుకున్నా శిరసావహించాల్సిందేనన్నారు. సురేఖ విషయంలోనూ హైకమాండ్‌దే తుది నిర్ణయమని, ఈ విషయంలో సీఎం అభిప్రాయమే తన అభిప్రాయమన్నారు.
ఒళ్లు దగ్గర పెట్టుకో రాధాకృష్ణ: రాజగోపాల్ రెడ్డి
రాజగోపాల్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానల్, ఆ చానల్ ఎండీ రాధాకృష్ణకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ‘ఏబీఎన్ చానల్ ఎవరికి సపోర్ట్ చేస్తోంది. కొంచెం ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉంటే మంచిది. లేదంటే మర్యాద దక్కదు. మా కెపాసిటీ ఏంటో చూపిస్తే మీ చానల్, పేపర్ ఉండవు. తెలంగాణలో నిజమైన ఉద్యమకారులు, నిజాయితీపరులు ఎంతోమంది ఉన్నారు. ఇతర పారీ్టల నుంచి వచ్చిన వ్యక్తులు ఉన్నతస్థాయిలో ఉండొచ్చు. అంతమాత్రాన పార్లమెంటులో తెలంగాణ కోసం కొట్లాడిన మాలాంటి వ్యక్తులను కించపరచొద్దు. అసలైన కాంగ్రెస్ రక్తం మాది. మా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా కథనాలు రాస్తే బాగుండదని హెచ్చరిస్తున్నా. మీడియా ముసుగులో మమ్మల్ని బలహీనపర్చే విధంగా ప్రయత్నించడం మంచిది కాదు. ఎవరు చేస్తున్నారో వారికే చెబుతున్నా. కొందరు వ్యక్తుల గురించి, వారిని బలంగా చేసేందుకు నా లాంటి వారిని బలహీనులను చేయొద్దు. జాగ్రత్తగా ఉండండి... ఇలాంటి చానళ్లు, పేపర్లు 100 పెడతా. మాకు ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదు’ అని రాజగోపాల్‌రెడ్డి హెచ్చరించారు.


