మలయాళ సినిమా అనగానే చాలామందికి థ్రిల్లర్సే గుర్తొస్తాయి. అంతలా ఈ జానర్‌లో మూవీస్ తీస్తుంటారు. ఈ మధ్య కాలంలో అలా వచ్చిన ధృడం, ఉయిర్ లాంటి చిత్రాలు తెలుగు ప్రేక్షకుల్ని అలరించాయి. ఇప్పుడు మరో సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా స్ట్రీమింగ్‌కి సిద్ధమైంది. ఈ మేరకు అధికారికంగా తేదీని ప్రకటించారు.
(ఇదీ చదవండి: థియేటర్లలో హిట్.. ఓటీటీకి వచ్చాక ఘోరంగా ట్రోల్స్)
కుంచకో బోబన్, పోలీస్‌గా చేసిన సినిమా 'ఉన్మాదం'. 'జై భీమ్' ఫేమ్ లిజోమోల్ జోస్ కథానాయిక. కిరణ్ దాస్ దర్శకుడు. 'జోసెఫ్', 'నాయట్టు' లాంటి పోలీస్ థ్రిల్లర్స్‌కి రచయితగా చేసిన షాహీ కబీర్.. ఈ చిత్రానికి కథనందించారు. ఇది సాధారణ పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టోరీలా కాకుండా, సైకలాజికల్ డ్రామాగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. జూలై 31న థియేటర్లలో రిలీజైంది. సెప్టెంబరు 04 నుంచి సోనీ లివ్ ఓటీటీలోకి రానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో చూడొచ్చు.
'ఉన్మాదం' విషయానికొస్తే.. ఎప్పటికైనా సినిమా రైటర్ కావాలని కలలు కనే ఓ పోలీస్ అధికారి(కుంచకో బోబన్) ఓ పాత ఆత్మహత్య కేసుని మళ్లీ తెరుస్తాడు. కానీ దర్యాప్తు లోతుగా చేసేసరికి అది ఆత్మహత్య కాదు.. దాని వెనుక ఓ సైకోపాత్ మైండ్ దాగి ఉందని తెలుస్తుంది. ఆ మిస్టరీని చేధించే క్రమంలో ఇతడు చూసే నిజాలు పిచ్చి లేపుతాయి. కేసు క్లైమాక్స్‌కి వచ్చేసరికి, శత్రువుల కంటే సొంత బుర్రే అతడికి పెద్ద శత్రువులా మారుతుంది.
ఒకవైపు ప్రాణాంతకమైన నేరస్తులు, మరోవైపు తనని మానసికంగా ముంచేస్తున్న భ్రమలు.. ఈ రెండింటి మధ్య నలిగిపోతూ సదరు పోలీస్ అధికారి అల్లాడిపోతాడు. తనే ఒక ఉన్మాదిలా మారే పరిస్థితి వచ్చినా, చివరి నిమిషం వరకు పోరాడి ఆ చీకటి రహస్యాన్ని అతడు ఎలా బయటపెట్టాడు అనేదే ఈ ఇంటెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్ స్టోరీ.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ ఐదు డోంట్ మిస్)


