బెంగళూరులో ఇల్లు కొన్నానోచ్‌.. జెన్‌జీ ఆనందం! | 24 Year Old Entrepreneur Buys Rs 1 8 Crore Bengaluru Home | Sakshi
Sakshi News home page

బెంగళూరులో ఇల్లు కొన్నానోచ్‌.. జెన్‌జీ ఆనందం!

Aug 1 2026 4:48 PM | Updated on Aug 1 2026 5:43 PM

24 Year Old Entrepreneur Buys Rs 1 8 Crore Bengaluru Home

సొంతిల్లు ఎవరికైనా జీవిత కల. అదే ప్రాపర్టీ ధరలు ఆకాశాన్నంటే బెంగళూరు లాంటి నగరంలో అయితే.. పాతికేళ్లు కూడా నిండకుండానే సాకారమైతే అంతకుమించిన విజయం ఇంకేముం‍ది అంటే అతిశయోక్తి కాదు. 24 ఏళ్ల వయసులోనే రూ.1.8 కోట్ల విలువైన అపార్ట్‌మెంట్‌ను సొంతం చేసుకున్న లీగల్‌-టెక్‌ స్టార్టప్‌ వ్యవస్థాపకుడు ఆకాశ్‌ నారాయణ్‌.. తన విజయాన్ని కేవలం వ్యక్తిగత ఘనతగా చూడటం లేదు. ఆర్థిక అనిశ్చితి, కుటుంబ సమస్యల నుంచి మొదలైన తన ప్రయాణంలో తల్లి, మెంటార్లు, స్నేహితులు, తొలి టీమ్‌ సభ్యుల సహకారమే తనను ఈ స్థాయికి తీసుకొచ్చిందని చెబుతున్నారు.

ఆకాశ్‌ నారాయణ్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. బెంగళూరులోని ఎలక్ట్రానిక్‌ సిటీ సమీపంలోని కాసాగ్రాండ్‌ వివాసిటీలో ఈ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణంలో ఉండగా.. 2027 ఏప్రిల్‌ నాటికి ఫ్లాట్‌ స్వాధీనం లభించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఆకాశ్‌ నారాయణ్‌ ప్రస్తుతం లీగలిట్‌ అనే లీగల్‌-టెక్‌ సంస్థను నడుపుతున్నారు. ఆ సంస్థ వార్షిక స్థూల ఆదాయం సుమారు రూ.13 కోట్లని సమాచారం.

‘ఇది నా విజయం మాత్రమే కాదు’

తన తొలి ఇంటిని కొనుగోలు చేసిన సందర్భంగా సోషల్‌ మీడియాలో ఆకాశ్‌ నారాయణ్‌ చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది. 24 ఏళ్లకే మొదటి అపార్ట్‌మెంట్‌ కొనుగోలు చేశానని చెబుతూ.. ఈ మైలురాయి తనది మాత్రమే కాదని పేర్కొన్నారు. కుటుంబం, మెంటార్లు, టీమ్‌, స్నేహితులు తన ప్రయాణంలోని ప్రతి దశలో అండగా నిలిచారని తెలిపారు.

ఒకప్పుడు సొంత ఇల్లు అనేది తనకు సాధ్యం కాని కలలా అనిపించేదని ఆకాశ్‌ చెప్పారు. ఇప్పుడు ఆ కల నిజమైనప్పటికీ, దాని వెనుక ఎంతో మంది సహకారం ఉందన్నారు. తన తల్లి ప్రోత్సాహంతోపాటు తనతో కలిసి పనిచేసిన టీమ్‌ సహకాన్ని గుర్తుచేసుకుంటూ ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

‘ఇది ప్రారంభం మాత్రమే’

తొలి ఇంటి కొనుగోలును ఆకాశ్‌ నారాయణ్‌ తన జీవితంలో ముగింపు గమ్యంగా కాకుండా మరో దశకు ఆరంభంగా చూస్తున్నారు. ‘‘ఇది ప్రారంభం మాత్రమే’’ అంటూ తన సోషల్‌ మీడియా పోస్ట్‌ను ముగించారు. వ్యక్తిగతంగా సాధించిన విజయాన్ని కుటుంబం, టీమ్‌, మెంటార్లు, స్నేహితులతో పంచుకోవడం ద్వారా.. విజయానికి వెనుక ఉండే సహకారం కూడా అంతే ముఖ్యమని ఆయన చెప్పిన సందేశం ఇప్పుడు సోషల్‌ మీడియాను ఆకట్టుకుంటోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement