ఇడుక్కి: కేరళలోని ఇడుక్కి, కొట్టాయం జిల్లాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుంభవృష్టి కారణంగా పలుచోట్ల సంభవించిన భారీ కొండచరియలు విరిగిపడ్డ ఘటనల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇడుక్కి జిల్లా వాగమండ్‌లో కొండచరియలు విరిగిపడి ఒక ఇంటిపై పడటంతో వైకోమ్‌కు చెందిన ప్రభాకరన్ నాయర్ మృతి చెందారు. అయితే ఆయన మృతదేహం ఇంకా లభ్యం కాలేదు. అదూర్మలలో మరో కొండచరియ విరిగిపడటంతో ఒక వ్యక్తి గల్లంతయ్యారు. కొచ్చి-ధనుష్కోడి జాతీయ రహదారిపై అడిమాలి సమీపంలోని మాచిప్లావు వద్ద కొండచరియలు విరిగిపడటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
#WATCH | Keralam: Heavy rainfall triggers widespread damage in Idukki district. One person was killed after a landslide struck a house at Vagamon in the district. The deceased has been identified as Prabhakaran Nair, a native of Vaikom. His body has not yet been recovered.
A… pic.twitter.com/0TVGJSQjE8— ANI (@ANI) August 1, 2026
మరోవైపు కొట్టాయం జిల్లా పయ్యనితోటంలో జరిగిన ప్రమాదంలో ఒక యువకుడు మరణించగా, అతని తల్లి శిథిలాల కింద కూరుకుపోయారు. జోసెఫ్ అనే యువకుడు ప్రాణాలు కోల్పోగా, అతని తల్లి కోసం రెస్క్యూ సిబ్బంది గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఉప్పుతుర ప్రాంతంలో పుల్లకాయరు నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో కొక్కయార్ వంతెన మునిగిపోయింది. చుట్టుపక్కల ఆరు ఇళ్లు జలమయం కావడంతో బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఎరట్టుపేట, కాంజిరపల్లి, కూట్టిక్కల్, ఎరుమేలి ప్రాంతాల్లో వరద పోటెత్తడంతో జనజీవనం పూర్తిగా స్థంభించిపోయింది. వందలాది నివాసాలు నీట మునిగాయి. ఎరట్టుపేటలో అర్ధరాత్రి ఒక్కసారిగా వరద నీరు పెరగడంతో అధికారులు రాకపోకలను నిలిపివేశారు. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. జిల్లాలోని చిన్న ప్రాజెక్టుల గేట్లను అధికారులు ఎత్తివేశారు.
ఇది కూడా చదవండి: కుల్గామ్ ఉగ్రదాడి: ఆస్పత్రిలో మరో కార్మికుడు మృతి


