లక్నో: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన విద్యార్థుల ఆధ్వర్యంలోని జెన్ జీ (1997 - 2012 మధ్య పుట్టినవారు) నిరసన ప్రభావం జెన్ ఆల్పా(2013 - 2025 మధ్య పుట్టినవారు)పై కూడా పడింది. ఉత్తరప్రదేశ్‌లో 6 నుంచి 12 తరగతుల వరకు చదువుతున్న 1,500 మందికి పైగా విద్యార్థులు తమ పాఠశాలలో మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు.
ఫతేపూర్ జిల్లాలోని సర్వోదయ ఇంటర్ కాలేజీ విద్యార్థులు తమ పాఠశాలలో మౌలిక సదుపాయాల కొరతపై ధర్నా చేపట్టారు. దీంతో యాజమాన్యం వారి డిమాండ్లలో చాలా వరకు అంగీకరించింది. ఈ నిరసనను సామాజిక మాధ్యమాల్లో “జెన్ ఆల్ఫా నిరసన”గా చర్చించినప్పటికీ, ఢిల్లీలోని జంతర్ మంతర్ ఆందోళనలో పాల్గొని తిరిగి వచ్చిన కొందరు సీనియర్ విద్యార్థులు దీన్ని ప్రణాళిక చేశారని పాఠశాల అధికారులు అంటున్నారు.
నీట్ ప్రశ్నపత్ర లీక్ ఆరోపణలపై జంతర్ మంతర్ ఉద్యమంలో పాల్గొన్న 12వ తరగతి విద్యార్థులు నలుగురు ఈ నిరసనకు నాయకత్వం వహించారు. అక్కడి అనుభవంతో ప్రేరణ పొందిన వారు తాగునీటి కొరత, పారిశుద్ధ్య సమస్యలు, తరగతి గదుల మౌలిక సదుపాయాల లోపం, క్రీడా సదుపాయాల కొరత వంటి దీర్ఘకాల సమస్యలపై తమ పాఠశాలలో ఇదే తరహా ఆందోళన చేపట్టాలని నిర్ణయించారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లాల్ బహదూర్ సింగ్ మాట్లాడుతూ.. “నేను పాఠశాలకు చేరుకున్న వెంటనే విద్యార్థులు తరగతులకు వెళ్లకుండా ధర్నా చేపట్టారని ఉపాధ్యాయులు చెప్పారు. ఆ సమయంలో ఆందోళనకు నాయకత్వం వహించిన అంకూర్ సోన్కర్ ఇటీవల జంతర్ మంతర్ ఉద్యమంలో పాల్గొన్న విషయం నాకు తెలియదు. తర్వాత అతడు అక్కడ ఉన్న వీడియోలు చూశాను. చిన్న పిల్లలు ఇలాంటి నిరసనలకు దూరంగా ఉండాలని చెప్పాం. వారి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చాం. అయినా వారిని ఒప్పించడానికి 6 గంటలు పట్టింది” అని ఆయన చెప్పారు.
అంకూర్ మాట్లాడుతూ.. ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ తనపై గాఢ ప్రభావం చూపారని తెలిపారు. జంతర్ మంతర్ నిరసన సమయంలో రికార్డు చేసిన వీడియోల్లో “సోనమ్ సర్‌కు మద్దతు ఇవ్వండి. మంచి వ్యక్తులకు మద్దతు ఇవ్వకపోతే ఇంకెవరికిస్తాం? మీ హక్కుల కోసం పోరాడండి” అని యువతకు పిలుపునిచ్చారు.
అంకూర్ తెలిపిన వివరాల ప్రకారం విద్యార్థులు ఆర్‌వో వ్యవస్థతో స్వచ్ఛమైన తాగునీరు, కొత్త మరుగుదొడ్లు, ప్రతి తరగతి గదిలో 4 ఫ్యాన్లు, మెరుగైన క్రీడా సదుపాయాలు, మౌలిక వసతుల అభివృద్ధి కోరారు. నిరసన అనంతరం యాజమాన్యం డిమాండ్లను అంగీకరించడంతో ఆందోళన విరమించారు.
6 గంటల ధర్నా, చేతుల్లో అంబేడ్కర్ చిత్రపటాలు
ఉదయం 7.30 గంటల సమయంలో 6 నుంచి 12 తరగతుల వరకు చదువుతున్న 1,500 మందికి పైగా విద్యార్థులు అంబేడ్కర్ చిత్రాలు, ప్లకార్డులు పట్టుకుని పాఠశాల ప్రాంగణంలో గుమికూడటంతో నిరసన ప్రారంభమైందని తెలిసింది. విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్యం, తరగతి గదుల సదుపాయాల లోపం చాలా కాలంగా ఉందని, వాటి వల్ల చదువులకు ఇబ్బంది కలుగుతోందని విద్యార్థులు ఆరోపించారు. కొందరు ఉపాధ్యాయులు విద్యార్థులతో అనుచితంగా ప్రవర్తిస్తున్నారని కూడా ఆరోపించారు. తమ డిమాండ్లను పట్టించుకోకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
జెన్ ఆల్ఫా నిరసన వార్త వ్యాపించడంతో పాఠశాల అధికారులు, స్థానిక పోలీసులు విద్యార్థులను తరగతులకు పంపేందుకు ప్రయత్నించారు. అయితే జిల్లా ఉన్నతాధికారులు పాఠశాలకు వచ్చే వరకు నిరసన విరమించబోమని విద్యార్థులు స్పష్టం చేశారు.
జిల్లా పాఠశాలల పరిశీలకుడు రాకేష్ కుమార్, నాయబ్ తహసీల్దార్ నితిన్ కుమార్ తదితర అధికారులు క్యాంపస్‌కు చేరుకుని 8 మంది విద్యార్థుల ప్రతినిధి బృందంతో చర్చించారు. సమావేశం అనంతరం విద్యార్థుల 8 డిమాండ్లలో 7 డిమాండ్లను లిఖితపూర్వకంగా అంగీకరించారు. దీంతో మధ్యాహ్నం తర్వాత నిరసన ముగిసింది.
ప్రతి తరగతి గదిలో 4 ఫ్యాన్లు ఏర్పాటు చేస్తామని, విద్యుత్ వైరింగ్ మరమ్మతులు చేపడతామని, సురక్షిత తాగునీటి కోసం ఆర్‌వో ప్లాంట్ ఏర్పాటు చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. మరుగుదొడ్లను క్రమం తప్పకుండా శుభ్రం చేయిస్తామని, క్రీడా మైదానాన్ని నిర్వహిస్తామని, మధ్యాహ్న భోజన నాణ్యత, పరిమాణం మెరుగుపరుస్తామని, ఫర్నిచర్ తక్కువగా ఉన్న తరగతి గదుల్లో అదనపు బెంచీలు నెలరోజుల్లో ఏర్పాటు చేస్తామని తెలిపారు.
సైన్స్ విభాగం ప్రారంభించాలన్న ఒక్క డిమాండ్ మాత్రమే వెంటనే అంగీకరించలేదు. దానికి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కోసం ప్రతిపాదన పంపాలని పాఠశాలకు సూచించారు.
జిల్లా పాఠశాలల పరిశీలకుడు రాకేశ్ కుమార్ మాట్లాడుతూ.. మౌలిక సదుపాయాల లోపంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోకుండా చర్యలు తీసుకోవాలని యాజమాన్యాన్ని ఆదేశించినట్లు చెప్పారు.
నిరసనకు ప్రధాన కారణం ఏమిటి?
ఓ విద్యార్థి తెలిపిన వివరాల ప్రకారం.. కొన్ని రోజుల క్రితం తరగతి గదిలో ఫ్యాన్లు పనిచేయడం లేదని ఫిర్యాదు చేసిన కొందరు బాలికలతో ఓ ఉపాధ్యాయుడు అనుచితంగా ప్రవర్తించిన ఘటనే నిరసనకు కారణమైంది. “బాలికలు ఫిర్యాదు చేయగా, ‘నువ్వు కూర్చో, నిశ్శబ్దంగా ఉండు’ అని ఉపాధ్యాయుడు అన్నాడు. ఆ తర్వాత మరికొందరు బాలికలు కలిసి జరిగిన విషయం బాలురకు చెప్పారు. కొందరు విద్యార్థులు ప్రధానోపాధ్యాయుడి వద్ద ఫిర్యాదు చేశారు. కానీ ఆయన దాన్ని పట్టించుకోలేదని వారు భావించారు” అని ఆ విద్యార్థి తెలిపాడు.


