ఇథనాల్ పెట్రోల్‌ స్కామ్‌ను బ‌య‌ట‌పెడ‌తా | Tehseen Poonawalla Detained by Delhi Police Over E20 Ethanol Policy Protest | Sakshi
Sakshi News home page

తెహసీన్ పూనావాలా అరెస్ట్.. ఇన్‌స్టా ఖాతా నిలివేత‌

Jul 30 2026 5:33 PM | Updated on Jul 30 2026 5:33 PM

E20 policy protest: Tehseen Poonawalla picked up by Delhi Police

న్యూఢిల్లీ: రాజకీయ విశ్లేషకుడు, వ్యాపార‌వేత్త‌ తెహసీన్ పూనావాలాను గురువారం ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ20 ఇథ‌నాల్ మిశ్ర‌మ పెట్రోల్ విధానానికి వ్యతిరేకంగా ఆయ‌న‌ గ‌ళం విన్పిస్తున్నారు. ఈ విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వ తీరును నిర‌సిస్తూ ఈనెల 31న (శుక్ర‌వారం) ‘గాడీ మార్చ్’కు ఆయ‌న పిలుపునిచ్చారు. ఈ నేప‌థ్యంలోనే పూనావాల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ రోజు ఉదయం విజయ్ చౌక్ వ‌ద్ద ఆయ‌న‌ను ఢిల్లీ పోలీసులు అడ్డుకుని, అదుపులోకి తీసుకున్నారు.

త‌న గొంతును నొక్క‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తోంద‌ని ఆయ‌న 'ద స్టేట్స్‌మ‌న్'తో అన్నారు. తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌ను కూడా నిలిపివేశారని వాపోయారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇదంతా చేయించార‌ని అన్నారు. గడ్కరీకి భ‌య‌ప‌డ‌బోన‌ని, ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా పోరాటం కొన‌సాగిస్తాన‌ని ప్ర‌క‌టించారు.

ఈ20 ఇథ‌నాల్ మిశ్ర‌మ పెట్రోల్‌ను ప్ర‌జ‌ల‌పై బ‌ల‌వంతంగా రుద్ద‌డాన్ని వ్య‌తిరేకిస్తూ ఇండియా గేట్ నుంచి పార్ల‌మెంట్ వ‌ర‌కు కారు ర్యాలీ (గాడీ మార్చ్) చేప‌ట్ట‌నున్న‌ట్టు ఇంత‌కుముందు తెహసీన్ పూనావాలా ప్ర‌క‌టించారు. ఈ20 పెట్రోల్‌తో వావాహ‌న‌దారులు తీవ్రంగా న‌ష్ట‌పోతార‌ని, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కుటుంబ స‌భ్యుల ప్ర‌యోజ‌నాల కోస‌మే దీన్ని జ‌నంపై రుద్దుతున్నార‌ని ఆరోపించారు.

హుందాగా పోరాడ‌తా
తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌ నిలిపివేయ‌డం స‌మంజసం కాద‌ని ప్ర‌ధాన న‌రేంద్ర మోదీకి విజ్ఞ‌ప్తి చేశారు. 'ఈ20 ఇథ‌నాల్ మిశ్ర‌మ పెట్రోల్ విధానానికి వ్య‌తిరేకంగా నేను చేస్తున్న పోరాటం హేతుబ‌ద్ద‌మైన‌ది. మీ మంత్రులను, ఎంపీలను ఇన్‌స్టాగ్రామ్‌లో చేరమని గౌరవనీయ ప్రధానమంత్రి ప్రోత్సహిస్తున్నారు. మరోవైపు నా ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ట్రెండింగ్‌లో ఉన్నప్పుడు దాన్ని నిలిపివేశారు. ఈ విషయాన్ని మీ నిర్ణయానికే వదిలేస్తున్నాను. ప్రజాస్వామ్య పంథాలో హుందాగా నా పోరాటాన్ని కొనసాగిస్తాన'ని ఎక్స్‌లో పేర్కొన్నారు.

ఏం చేసుకుంటారో చేసుకోండి
ఇథ‌నాల్ పెట్రోల్ స్కామ్‌పై పోరాటం కొన‌సాగిస్తాన‌ని తెహసీన్ పూనావాలా (Tehseen Poonawalla) పున‌రుద్ఘాటించారు. నితిన్ గ‌డ్క‌రీకి భ‌య‌పడేది లేద‌ని తేల్చిచెప్పారు. 'నా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను నిలిపివేసిన తర్వాత నితిన్ గడ్కరీకి ఇదే సందేశం. సార్, మీరు చేయగలిగినది చేయండి, నేను ఇథనాల్ స్కామ్‌ను బయటపెట్టడం మాత్రం ఆప‌ను. నేను మీకు భయపడను, పైగా మీ పిల్లలకు చెందిన ఇథనాల్ డిస్టిలరీల విషయంలో మీరు వివాదంలో ఉన్నార'ని ఎక్స్‌లో వీడియోలో షేర్ చేశారు. 

చ‌ద‌వండి: ఇన్‌స్టా మార్గం పట్టిన బీజేపీ ముఖ్య నాయ‌కులు! 

బాంబే హైకోర్టు త‌లుపు త‌ట్టిన గ‌డ్కరీ
ఈ20 ఇథనాల్‌ మిశ్రమ పెట్రోల్‌ విధానంతో త‌న కుటుంబం లాభపడుతోందని సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని అడ్డుకోవాల‌ని కోరుతూ నితిన్ గ‌డ్క‌రీ ఇటీవ‌ల బాంబే హైకోర్టును ఆశ్ర‌యించారు. త‌న‌పై అస‌త్య ప్ర‌చారం చేస్తున్న సోషల్‌ మీడియా సంస్థలు, గుర్తుతెలియని వ్యక్తులపై సివిల్‌ కేసు దాఖలు చేసేందుకు ఆయ‌న‌కు హైకోర్టు అనుమతి మంజూరు చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement