యువ‌త‌ను ఆక‌ట్టుకునే ప‌నిలో బీజేపీ అగ్ర‌నేత‌లు! | why BJP leaders step up Instagram activity full details here | Sakshi
Sakshi News home page

ఇన్‌స్టా మార్గం పట్టిన బీజేపీ!

Jul 30 2026 2:17 PM | Updated on Jul 30 2026 2:19 PM

why BJP leaders step up Instagram activity full details here

ఫేస్‌బుక్, ఎక్స్, వాట్సప్‌లకు ఇక కాలం చెల్లినట్లే! రాజకీయ నేతలు మరీ ముఖ్యంగా బీజేపీ వారు ఇక ఇన్‌స్టా మార్గం పట్టనున్నారు. రీల్స్‌ రాజకీయమే భేషన్న ప్రధాని మాటలు వారిపై సీరియస్‌ ప్రభావమే చూపాయి. జెన్‌–జీ ప్రియ నేస్తం ఇన్‌స్టాగ్రామ్‌పై కేంద్ర మంత్రులు సహా కాషాయ పార్టీ నేతల విన్యాసాలు ఎంతమేరకు రక్తికట్టిస్తాయో చూడాలి మరి!  

కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) పుణ్యమా అని ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నేతలకు తమ రాజకీయాన్ని పండించుకునేందుకు కొత్త అస్త్రం దొరికింది. నిన్న మొన్నటివరకూ అన్ని సామాజిక మాధ్యమాల ద్వారా తమ సందేశాన్ని వినిపిస్తూ వచ్చిన కాషాయ పార్టీ నీట్‌ ప్రశ్న పత్రాల లీకేజీలపై విద్యార్థుల ఆందోళనల తరువాత రూటు మార్చింది. ఇన్‌స్టాగ్రామ్‌పై తన దృష్టిని కేంద్రీకరించింది. ఆందోళనలను విరమింపజేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇన్‌స్టా సందేశం పంపడం, జెన్‌–జీని ఆకట్టుకోవాలంటే ఇదే మేలి మార్గమని ఆయన స్వయంగా ప్రకటించడం ఆ పార్టీ నేతల్లో జోష్‌ నింపిందని చెప్పాలి. అందుకేనేమో... ఒక్కరొక్కరుగా కేంద్ర మంత్రులు కూడా రీల్స్‌ చేయడం మొదలుపెట్టారు.

ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా తరువాత కొత్త విద్యాశాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్‌ జోషి  కొత్తగా ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేసుకుని ఓ నాలుగు పోస్టులు పెట్టారు అందులో. ప్రస్తుతానికి ఆయనకున్న ఫాలోయర్లు కేవలం 23 మంది మాత్రమే. మోదీ సందేశం, తనను విద్యాశాఖ మంత్రిగా నియమించడం, కర్ణాటక సీఎం డి.కె.శివకుమార్‌తో చర్చలు, ప్రశ్న పత్రాల లీకేజీ విషయమై అధికారులతో చర్చలు మాత్రమే ఆయన పోస్టులు.  

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి, సీజేపీతో చర్చలు జరిపిన బీజేపీ నేత జేపీ నడ్డా, మాజీ మంత్రి జితేంద్ర సింగ్‌లు గతంలో వారానికి నాలుగైదు పోస్టులు మాత్రమే పెడుతూంటే.. తాజాగా ప్రతిరోజు బోలెడన్ని ఇన్‌స్టా పోస్టులు పెడుతున్నారు. ఇన్‌స్టాను వాడుకోండి అన్న ప్రధాని పిలుపునకు ముందు జేపీ నడ్డా ఇన్‌స్టాపై చివరగా పోస్టు చేసింది జూలై నాలుగున. అంతకు ముందు జూన్‌ 27న ఒక పోస్టు చేశారు. ఇప్పుడు మాత్రం రోజూ పోస్టులే పోస్టులు! పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు కూడా కొన్ని రోజులుగా ఇన్‌స్టా వేదికగా ప్రశ్న పత్రాల లీకేజీని అరికట్టేందుకు ఉద్దేశించిన బిల్లుపై పలు పోస్టులు చేస్తున్నారు. ప్రశ్న పత్రాల లీకేజీ అంశాన్ని జాతీయ ప్రాముఖ్యత కలిగినదిగా వర్ణించిన రిజిజు చర్చకు సహకరించాల్సిందిగా ప్రతిపక్షాలకు చేసిన విజ్ఞప్తులను రీల్స్‌గా పోస్ట్‌ చేశారు.

చ‌ద‌వండి: నీలేకనికి ప్ర‌ధాని మోదీ క్ష‌మాప‌ణ చెప్పాలి  

ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌ కూడా ఇన్‌స్టా బాట పట్టారు. ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారంలో బీజేపీ ప్రభుత్వం సత్వర చర్యలకు దిగిందని, ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టుల ఏర్పాటుకు హామీ ఇచ్చిందని ఆమె ఈ మధ్యే పోస్టు పెట్టారు. ఇక బీజేపీని డిజిటల్‌ మార్గం పట్టించిన ఐటీ సెల్‌ అధ్యక్షుడు అమిత్‌ మలవీయా కూడా జెన్‌–జీకి దగ్గరైన ఇన్‌స్టాగ్రామ్‌పైకి రాక తప్పలేదు. సీజేపీ నిరసనల్లో అసంబద్ధమైన నినాదాలు ఉన్నాయని, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో ప్రశ్న పత్రాల లీకేజీలపై వారెవరూ మాట్లాడకపోవడాన్ని ప్రశ్నించారు.

టాప్‌లో పీఎం... 
భారత ప్రధాని నరేంద్ర మోదీ 2014 నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో చురుకుగా ఉన్నారు. పది కోట్ల మందికిపైగా ఫాలోయర్లు ఉండగా... సీజేపీ నిరసనల సందర్భంగా అర్ధ రాత్రి చేసిన సెల్ఫీ వీడియోతో ఫాలోయర్ల సంఖ్య సుమారు పది లక్షల మంది పెరిగారు. మూడు నెలల క్రితం భారతీయ జనతా పార్టీ ఇన్‌స్టాగ్రామ్‌కు 9.5 లక్షల మంది ఫాలోయర్లు ఉండగా సీజేపీ కొన్ని గంటల్లోనే ఈ సంఖ్యను దాటిపోయింది. తరువాత సీజేపీ హ్యాండిల్‌పై నిషేధం వేటు పడటం.. కోర్టు కేసుల తరువాత హ్యాండిల్‌ మళ్లీ దక్కడం తెలిసిన విషయమే.  
– సాక్షి, నేషనల్ డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement