మౌనం, సేవ అత్యున్నతమైన సత్సంగ్ అనుభవాన్ని అందిస్తామని ప్రముఖ ఆధ్యాత్మిక గాయకుడు విక్రమ్ హజ్రా పేర్కొన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ఆధ్వర్యంలో ఇక్కడి హర్యానా భవన్‌లో గురుపూర్ణిమ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రొగ్రామ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తూ, సాంప్రదాయ భజనలకు ఎలక్ట్రిక్ గిటార్, జాజ్, బ్లూస్ సంగీతాన్ని జోడించి, భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాలను జెన్ జీ తరానికి అందించటంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన విక్రమ్ హజ్రా తన భజనలు, సంగీతంతో సభికులను మంత్రముగ్ధులను చేశారు. దాదాపు వేయిమందికి పైగా సాధకులు, భక్తులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
భారతీయ సంప్రదాయంలో గురువుకు విశిష్ట స్థానం ఉంది. ప్రత్యేకించి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించిన గురువుకు కృతజ్ఞతలు సమర్పిస్తూ, గత సంవత్సర కాలంలో తాము సాధించిన ఆధ్యాత్మిక ప్రగతికి తోడ్పాటును అందించిన గురువుకు కృతజ్ఞతగా గురుపూర్ణిమను ఒక పండుగగా ఆధ్యాత్మిక సాధకులు జరుపుకుంటారు. ఈ సంప్రదాయానికి అనుగుణంగా ఈ కార్యక్రమం గురుపూజతో మొదలైంది. అనంతరం ఆహుతులందరితో చేయించిన నారాయణ భజన అందరినీ మంత్రముగ్ధులను చేసింది. సంత్ జ్ఞానేశ్వర్, కబీర్, తులసీదాస్ గీతాలు, మరాఠీ, అస్సామీ జానపద భక్తిగీతాలు, శివ భజనలు భక్తులను ఆనందపారవశ్యంలో ముంచెత్తాయి.
ప్రాచీన ఆధ్యాత్మిక గీతాలకు వినూత్న ప్రాచ్య, పాశ్చాత్య సంగీతాలను జోడించి విక్రమ్ హజ్రా అందించే భక్తిగీతాలు ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి పొందాయి. ముంబైలో పత్రికావిలేఖరిగా వృత్తిజీవితాన్ని ప్రారంభించిన విక్రమ్, అవంతరకాలంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలను అందిపుచ్చుకుని, భక్తిసంగీతాన్ని సేవాప్రవృత్తిగా మలచుకున్నారు. విశ్వవ్యాప్త ఆదరణ పొందిన 'అచ్యుతం కేశవం' భజనకు ప్రాణం పోసిన హజ్రా, ఐక్యరాజ్యసమితి మిలీనియం వరల్డ్ పీస్ సమ్మిట్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా 45కు పైగా దేశాలలో ప్రదర్శనలు ఇచ్చారు.
ప్రముఖ మాండలిన్ విద్వాంసుడు శ్రీనివాస్ కు శిష్యుడైన అభయ్ ఈ కార్యక్రమానికి మాండలిన్ వాద్య సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ తెలంగాణా రాష్ట్ర టీచర్స్ కోఆర్డినేటర్లు అరుణ్ కుమార్, దీపక్ లంకా, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు హరీష్ మీనన్, అపెక్స్ సభ్యులు కృష్ణమూర్తి, నారాణయరావు, గడ్డం శ్రీనివాస్, మధుసూన్ ఛందక్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మికగురువు, సేవా మూర్తి, శాంతిదూత గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ స్థాపించిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 180కి పైగా దేశాలలో ప్రజల మానసిక ఒత్తిడిని తగ్గించి, తద్వారా హింస లేని ఆనందకరమైన సమాజాలను నిర్మించేందుకు కృషిచేస్తోంది. గురుపూర్ణిమ సందర్భంగా తెలంగాణా వ్యాప్తంగా ఉన్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫాలో అప్ కేంద్రాలలో గురుపూజ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. వివరాలకు దగ్గరలోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ కేంద్రాలను సందర్శింవచ్చు.
(చదవండి: తల్లి కోసం ఏఐలో వెతికాడు... చెల్లెల్ని కలుసుకున్నాడు!)


