అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తారస్థాయికి చేరుకున్నాయి. జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులకు ప్రతీకారంగా అమెరికా బుధవారం రాత్రి ఇరాన్‌పై భారీ వైమానిక దాడులు ప్రారంభించింది. ఇరాన్ భూభాగంపై దాదాపు వారం రోజుల తర్వాత అమెరికా చేపట్టిన తొలి ప్రత్యక్ష దాడులు ఇవే.
అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఈ దాడులను ధ్రువీకరించింది. ఇరాన్ నుంచి అమెరికా బలగాలపై జరిగిన దాడులకు ఇది “శక్తివంతమైన ప్రతిస్పందన” అని పేర్కొంది. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు దాడులు ప్రారంభమైనట్లు తెలిపింది.
U.S. forces began launching strikes against Iran at 8 p.m. ET today. The strikes are a powerful response to yesterday's attempted Iranian attacks on U.S. forces based in the Middle East.
— U.S. Central Command (@CENTCOM) July 30, 2026
ట్రంప్ హెచ్చరికల తర్వాతే..
ఇరాన్‌పై దాడులకు ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు చేశారు. జోర్డాన్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడి చేసిన నేపథ్యంలో.. ‘‘ఇరాన్‌కు గట్టి సమాధానం ఇస్తాం.. చాలా బలంగా ఎదురుదాడి చేస్తాం’’ అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. ‘‘వాళ్లు దాడి చేశారు.. ఇప్పుడు మా వంతు వచ్చింది’’ అంటూ ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్ చర్యలకు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
🚨 BREAKING: President Trump is warning adversaries that a forceful U.S. response is coming after a drone attack on an LNG tanker off the coast of Egypt.
"We're going to hit them very hard."
Trump confirmed five rockets were fired and signaled that retaliation is imminent,…— Stephen Gardner (@StephenGardnerX) July 29, 2026
దక్షిణ ఇరాన్‌లో పేలుళ్ల శబ్దాలు
అమెరికా దాడుల తర్వాత దక్షిణ ఇరాన్‌లోని పలు ప్రాంతాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. అయితే అమెరికా దాడుల లక్ష్యాలు, నష్టం వివరాలు ఇంకా పూర్తిగా వెల్లడికాలేదు.
ప్రతిఘటన ఉంటుంది: ఇరాన్
అమెరికా బెదిరింపులు కొనసాగినంత కాలం తమ ప్రతిఘటన కొనసాగుతుందని ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ప్రకటించింది. అమెరికా బలగాలపై తాము చేపట్టిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించింది.
ఇరాన్ నావికా దళాలు హార్ముజ్ జలసంధి వైపు వెళ్తున్న మూడు చమురు ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకున్నట్లు కూడా సమాచారం వెలువడింది. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన ఈ మార్గంపై ఉద్రిక్తతలు పెరగడం అంతర్జాతీయంగా ఆందోళనకు కారణమవుతోంది.
ఇరాక్‌లోనూ ఉద్రిక్తతలు..
ఇరాక్‌లో అమెరికా, సౌదీ అరేబియా సంయుక్త దాడులపై అక్కడి ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ దాడుల్లో పాపులర్ మొబిలైజేషన్ ఫోర్సెస్‌కు చెందిన 20 మంది మరణించగా.. మరో 32 మంది గాయపడినట్లు సమాచారం. ఈ పరిణామాలు ఇరాక్‌ను కూడా ప్రాంతీయ ఘర్షణలోకి లాగుతున్నాయని అక్కడి అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.
చర్చల నుంచి యుద్ధం వైపు?..
కొద్ది రోజుల క్రితం ఇరాన్‌తో చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని ట్రంప్ చెప్పినప్పటికీ.. తాజా పరిణామాలతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇరాన్ తీవ్ర చర్యలకు దిగితే యుద్ధాన్ని మళ్లీ ప్రారంభించాల్సి వస్తుందని ట్రంప్ గతంలో హెచ్చరించారు.
అమెరికా తాజా దాడులతో పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరాన్ ప్రతిస్పందన ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా హర్ముజ్ జలసంధి పరిణామాలు ప్రపంచ చమురు మార్కెట్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది.


