తమిళనాడులో టీవీకే విజయ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నిర్మాణ రంగానికి కీలకమైన రఫ్ స్టోన్, ఎం-శాండ్, మెటల్ జెల్లీ వంటి నిర్మాణ సామగ్రిని పొరుగు రాష్ట్రాలకు తరలించడంపై తమిళనాడు ప్రభుత్వం మూడు నెలలు తాత్కాలిక నిషేధం విధించింది. రాష్ట్రంలో పెరుగుతున్న నిర్మాణ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. కాగా, తమిళనాడు నిర్ణయం దక్షిణ రాష్ట్రాల మధ్య మౌలిక వసతుల అభివృద్ధి, వనరుల వినియోగం, ప్రాంతీయ ఆర్థిక సమతుల్యతపై ప్రభావం చూపే నిర్ణయంగా మారింది.
అయితే, ముఖ్యమంత్రి విజయ్ అధ్యక్షతన జరిగిన సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. వేగంగా జరుగుతున్న పట్టణీకరణ, రహదారులు, గృహ నిర్మాణాలు, పారిశ్రామిక ప్రాజెక్టుల కారణంగా తమిళనాడులో నిర్మాణ సామగ్రికి డిమాండ్ భారీగా పెరిగిందని ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలోని పనిచేస్తున్న క్వారీల నుంచి లభిస్తున్న రాళ్లు, నిర్మాణ అగ్రిగేట్లు స్థానిక అవసరాలను పూర్తిగా తీర్చలేకపోతున్నాయని పేర్కొంది. పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాలకు నిర్మాణ సామగ్రి తరలిపోవడం వల్ల రాష్ట్రంలో సరఫరా తగ్గి, ధరలు పెరుగుతున్నాయని ప్రభుత్వం అభిప్రాయపడింది.
ఈ నిషేధం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు వెళ్లే నిర్మాణ సామగ్రిపై వర్తించనుంది. అయితే.. పుదుచ్చేరి, కారైకాల్‌కు మాత్రం మినహాయింపు ఇచ్చారు. నిషేధాన్ని అమలు చేసేందుకు సరిహద్దు జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులు కఠిన పర్యవేక్షణ చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే అక్రమ మైనింగ్, ఖనిజ రవాణా చట్టాల కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ముఖ్యంగా కేరళలో నాణ్యమైన రాయి అగ్రిగేట్ల లభ్యత పరిమితంగా ఉండటంతో తమిళనాడులోని తిరునెల్వేలి, తెంకాసి, కన్యాకుమారి ప్రాంతాల నుంచి వచ్చే నిర్మాణ సామగ్రిపై అనేక ప్రాజెక్టులు ఆధారపడుతున్నాయి. జాతీయ రహదారులు, విజింజం అంతర్జాతీయ నౌకాశ్రయం వంటి కీలక ప్రాజెక్టుల పనులకు సరఫరా అంతరాయం కలగవచ్చని కేరళ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. అందుకే జాతీయ ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టులకు ప్రత్యేక మినహాయింపులు ఇవ్వాలని కోరింది.
ఎందుకు ఈ నిర్ణయం?
కాగా, తమిళనాడులో ప్రస్తుతం భారీ స్థాయిలో నిర్మాణ కార్యకలాపాలు జరుగుతున్నాయి. కొత్త రహదారులు, పట్టణ అభివృద్ధి ప్రాజెక్టులు, పరిశ్రమలు, గృహ నిర్మాణాల కోసం రాళ్లు, ఇసుక, ఇతర అగ్రిగేట్ల అవసరం పెరిగింది. రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న నిర్మాణ సామగ్రిలో కొంత భాగం పొరుగు రాష్ట్రాలకు తరలిపోవడంతో స్థానిక మార్కెట్‌లో సరఫరా తగ్గుతోందని ప్రభుత్వం చెబుతోంది. దీని వల్ల ధరలు పెరిగి నిర్మాణ వ్యయాలు పెరుగుతున్నాయని వాదిస్తోంది.
తమిళనాడు నిర్ణయం సహజ వనరుల నిర్వహణ, రాష్ట్ర అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి అంశాలను ముందుకు తెస్తోంది. ఒక రాష్ట్రంలోని ఖనిజ వనరులు మరో రాష్ట్రంలోని అభివృద్ధి పనులకు ఉపయోగపడుతున్న నేపథ్యంలో, రాష్ట్ర ప్రయోజనాలు-ప్రాంతీయ అభివృద్ధి అవసరాల మధ్య సమతుల్యతపై చర్చ మొదలైంది. ప్రస్తుతం ఈ అంశం కేవలం నిర్మాణ సామగ్రి రవాణా సమస్యగానే కాకుండా, దక్షిణాది రాష్ట్రాల మధ్య వనరుల వినియోగం, మౌలిక వసతుల అభివృద్ధి సమన్వయానికి సంబంధించిన అంశంగా మారింది. మూడు నెలల నిషేధ కాలంలో నిర్మాణ సామగ్రి ధరలు, సరఫరా పరిస్థితులు, ప్రాజెక్టులపై ప్రభావాన్ని ప్రభుత్వం పరిశీలించే అవకాశం ఉంది. ఆ తర్వాత నిషేధాన్ని కొనసాగించాలా, సడలింపులు ఇవ్వాలా అన్నదానిపై నిర్ణయం తీసుకోవచ్చు.


