కాక్రోచ్‌ నిరసనల ఎఫెక్ట్‌.. ఢిల్లీ వీధుల్లో టెన్షన్! | CJP protesters targeted after protest Tracked And humiliated | Sakshi
Sakshi News home page

కాక్రోచ్‌ నిరసనల ఎఫెక్ట్‌.. ఢిల్లీ వీధుల్లో టెన్షన్!

Jul 29 2026 8:47 AM | Updated on Jul 29 2026 9:20 AM

CJP protesters targeted after protest Tracked And humiliated

నీట్ పరీక్షలో అవకతవకలకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలు ముగిసిన తర్వాత ఢిల్లీలో కొత్త వివాదం మొదలైంది. నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులు, కార్యకర్తలపై దాడులు జరిగాయంటూ పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు నిరసనల్లో పాల్గొన్న కొందరు వ్యక్తులు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వం, భద్రతా సిబ్బందిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మరికొన్ని వీడియోలు చర్చకు వచ్చాయి. దీంతో ఈ వ్యవహారం రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీసింది.

కాక్రోచ్‌ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో జరిగిన నిరసనలు నీట్ పేపర్ లీక్, పరీక్షా వ్యవస్థలో లోపాలపై ఆందోళనలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నిరసనలు తీవ్రతరం కావడంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. అనంతరం నిరసనలపై భిన్న వాదనలు తెరపైకి వచ్చాయి. ఈ క్రమంలో నిరసనల్లో పాల్గొన్న వారిపై దాడులు జరిగినట్టు తాజాగా వీడియోలు బయటకు వస్తున్నాయి. పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇటీవల సత్యం పండిట్ అనే వ్యక్తి ఇద్దరు నిరసనకారులపై దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చిన వీడియో చర్చకు వచ్చింది. ఆ తర్వాత ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో నిరసనకారులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగినట్లు చూపించే మరికొన్ని వీడియోలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో చిత్రీకరించినట్లు చెబుతున్న ఓ వీడియోలో, మైక్ పట్టుకున్న ఓ వ్యక్తి కొందరు నిరసనకారులను ప్రశ్నిస్తున్నట్లు కనిపిస్తుంది. ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యల గురించి ప్రశ్నిస్తూ నిలదీసినట్లు వీడియోలో కనిపిస్తుంది. ఆ సమయంలో అతడి మెడపై చేయి వేసి మాట్లాడుతున్నట్లు, క్షమాపణ చెప్పాలని ఒత్తిడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అనంతరం ఆ వ్యక్తి క్షమాపణ చెప్పినట్లు వీడియోలో కనిపిస్తుంది.

 

మరో వీడియోలో ఓ వ్యక్తిని కొందరు వ్యక్తులు వెంబడించి కొట్టినట్లు, తన్నినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇంకొక వీడియోలో ఓ మహిళను పలువురు వ్యక్తులు చుట్టుముట్టి ప్రశ్నిస్తూ, ఆమెను మొబైల్ ఫోన్లలో చిత్రీకరిస్తున్న దృశ్యాలు కనిపించాయి. ఈ ఘటనలపై నిరసనలకు మద్దతు ఇస్తున్న వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వాన్ని లేదా విధానాలను ప్రశ్నించడం ప్రజాస్వామ్యంలో భాగమని, నిరసనకారులను బెదిరించడం, దాడి చేయడం సరైన విధానం కాదని వారు పేర్కొంటున్నారు.

బీజేపీ అనుకూల వర్గాల వాదన
మరోవైపు, బీజేపీకి మద్దతు ఇస్తున్న వర్గాలు నిరసనల్లో పాల్గొన్న కొందరు వ్యక్తులు హద్దులు దాటి వ్యక్తిగత విమర్శలు, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ, పోలీసులపై అనుచిత నినాదాలు చేసినట్లు చూపించే కొన్ని వీడియోలను వారు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. నిరసనల పేరుతో చట్టపరమైన, సామాజిక పరిమితులు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు.. కొన్ని సోషల్ మీడియా ఖాతాలు నిరసనల్లో పాల్గొన్న వ్యక్తుల ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ పోలీసులను ట్యాగ్ చేశాయి. అయితే, ఎవరైనా తప్పు చేసినట్లు తేలితే వారిపై చర్యలు తీసుకోవాల్సింది చట్టపరమైన వ్యవస్థ మాత్రమేనని, వ్యక్తులు లేదా ప్రైవేట్ గుంపులు స్వయంగా చర్యలకు దిగడం సరైంది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయడం పౌరుల హక్కు. అదే సమయంలో నిరసనల సమయంలో హింస, బెదిరింపులు, దాడులు లేదా చట్ట ఉల్లంఘనలు జరిగితే వాటిపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసు, న్యాయ వ్యవస్థలపై ఉంటుంది. కాగా, నీట్ నిరసనలు ముగిసినా, వాటి చుట్టూ రాజకీయ వాదోపవాదాలు మాత్రం కొనసాగుతున్నాయి. ఒకవైపు నిరసనకారులపై దాడుల ఆరోపణలు, మరోవైపు నిరసనల్లో జరిగిన అనుచిత వ్యాఖ్యలపై విమర్శలు కొనసాగుతున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement