ఎన్నో వెయిట్‌లాస్ జర్నీల్లో మనం ఆరోగ్యకరమైన జీవనశైలి, చక్కటి వర్కౌట్లు, సరైన ఆహారం వంటివి కీలకం అని విన్నాం. చాలామంది ఆయిల్ ఫుడ్‌లు, జంక్ ఫుడ్‌లకు దూరంగా ఉంటేనే బరువు సాధ్యమని అనుభవపూర్వకంగా వెల్లడించారు. కానీ ఈ మహిళ మాత్రం నచ్చినవి తింటూనే హెల్దీగా బరువు తగ్గమని చెబుతుంది. ఆమె అలా చేసే ఏకంగా 95 కేజీల దగ్గర 55 కేజీలకు వచ్చానని, సుమారు 25కేజీలపైనే బరువు తగ్గానని చెప్పుకొచ్చింది. అదెలా సాధ్యమో చూద్దామా.!.
ఆ మహిళే డైటీషియన్, యూట్యూబర్ సుమన్ పహుజా. తన వ్యక్తిగత జీవితంలో ఒక క్లిష్ట దశలో ఉన్నప్పుడు ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టానని చెప్పుకొచ్చారు. తాను అప్పుడు సుమారు 99కిలోలు పైనే బరువు ఉండేదాన్ని అని అన్నారు. తీవ్రమైన డైటింగ్ కంటే, పట్టుదల, నిలకడ, ఆరోగ్యకరమైన ఆహార ఎంపికలతో స్లిమ్‌గా మారినట్లు తెలిపింది. తన బరువు గురించి తండ్రి, భర్త చేసిన విమర్శలు తనను స్లిమ్‌గా మారేలా ప్రేరేపించాయని చెప్పుకొచ్చారు.
అయితే క్రాష్ డైట్‌లకు బదులుకు నిలకడైన ఆహారపు అలవాట్లు, క్రమం తప్పకుండా వ్యాయామా దినచర్యను పాటించినట్లు తెలిపారు. అలాగే తనకు ఇష్టమైన ఆహారాలను వేటిని వదులుకోలేదన్నారు. తాను ఇప్పటికీ పావ్ భాజీ, చోలే బటూరే వంటి వంటకాలను తింటానని అన్నారు. అయితే వాటిని ఇంట్లోనే తయారు చేసుకుంటానని, దీనివల్ల వాడే పదార్థాలు, పరిమాణాలపై మెరుగైన నియంత్రణ పాటిస్తూ వాటిని ఆస్వాదించగలుగుతున్నానని పహుజా చెప్పారు.
ఎలాంటి ఆహారం అంటే..
ఆమె రోజువారీ ఆహారంలో అల్పాహారంగా రెండు మల్టీగ్రెయిన్ పరాటాలు, ఒక గిన్నెడు కూరగాయలు, చక్కెర లేని టీతో మొదలవుతుందట. మధ్యాహ్న భోజనంలో సాధారణంగా పండ్లు లేదా సొరకాయ సలాడ్‌తో పాటు ఒక గ్లాసు కోల్డ్ కాఫీ తీసుకుంటానని చెప్పారు. ఇక రాత్రి భోజనంలో, ఉప్పు లేకుండా తయారు చేసిన బ్రోకలీ లేదా వేయించిన క్యాప్సికమ్‌తో పాటు రెండు గుడ్డు తెల్లసొనలు ఉంటాయి. కడుపు నింపే, పోషకమైన, తక్కువ కేలరీలు ఉండే చియా సీడ్ ఫుడ్డింగ్‌ను తీసుకుంటానని పేర్కొంది.
ఇక తన బరువు తగ్గడంలో వ్యాయామం కూడా కీలక పాత్ర పోషించిందన్నారు. తాను వారానికి మూడు రోజులు వర్కౌట్లు చేస్తానని, ప్రధానంగా పరుగెత్తడం, దూకండ వంటి కార్డియో వ్యాయామాలపై దృష్టిపెడతానని అన్నారు. వీటన్నింటి తోపాటు సమయానికి భోజనం చేయడం, ఒత్తిడిని అదుపులో ఉంచుకోవడం కూడా అంతే ముఖ్యమని నొక్కి చెప్పారు. ఆమె నిద్రలేచిన గంటలోపే అల్పాహారం తినడాన్ని ఒక నియమంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అలాగే సాయంత్రం 5 గంటల తర్వాత కార్బోహైడ్రేట్లకు దూరంగా ఉంటానని, వారానికి రెండుసార్లు డిటాక్స్ వాటర్ తాగుతానని చెప్పారు.
అలాగే డైట్ పాటించని రోజుల్లో కూడా ఇంట్లో వండిన భోజనానికే ప్రాధాన్యత ఇస్తానని చెప్పుకొచ్చారు. ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ముందుకు సాగడంతోనే బరువు తగ్గానని అన్నారు పహుజా. పైగా ఈ రూపాంతరం తనలో ఆత్మవిశ్వాసాన్ని, ఏకాగ్రతను పెంచేందుకు దోహదపడిందని అంటోంది. చివరగా ఆమె భవిష్యత్తులో తానొక ఆరోగ్యకరమైన సంతోషకరమైన మహిళగా జీవించాలని కోరుకుంటున్నట్లు వెల్లడించింది.
గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.
(చదవండి: ఈ క్షణం కోసమే ఎదురుచూశా..! ఉప్పొంగి పోయిన తల్లిదండ్రులు..)


