షేర్లకూ కావాలి ఫిట్‌నెస్‌! | Sakshi Wealth analysis of the fitness economy | Sakshi
Sakshi News home page

షేర్లకూ కావాలి ఫిట్‌నెస్‌!

Jul 27 2026 12:34 AM | Updated on Jul 27 2026 12:34 AM

Sakshi Wealth analysis of the fitness economy

జనం జీవనశైలిలో భాగమైపోయిన ఫిట్‌నెస్‌

జిమ్‌లను దాటి స్పోర్ట్స్‌ ఎరీనాలు, ఈవెంట్లకు షూస్, అథ్‌లైజర్, ప్రొటీన్‌ సప్లిమెంట్లకు డిమాండ్‌

ప్రివెంటివ్‌ హెల్త్‌కేర్‌కు పెరుగుతున్న ప్రాధాన్యం

ఇళ్లతో పాటు లైఫ్‌స్టైల్‌నూ విక్రయిస్తున్న రియల్టీ సంస్థలు

ప్రస్తుత బూమ్‌లో ఈ రంగాల షేర్లన్నీ రాణించే అవకాశం

‘ఫిట్‌నెస్‌ ఎకానమీ’పై సాక్షి వెల్త్‌  విశ్లేషణ

తల్వాల్కర్‌ జిమ్‌... ఒకప్పుడు ఇదో మెరుపు. స్టాక్‌ మార్కెట్లో తొలి ఫిట్‌నెస్‌ కంపెనీగా లిస్టయింది.  విపరీతంగా విస్తరించింది. భారీగా అప్పులు చేసింది. కట్‌చేస్తే... దివాలా తీసి తెరమరుగైపోయింది. ఇన్వెస్టర్లు మునిగిపోయారు.  ఇపుడు కల్ట్‌ ఫిట్‌. హృతిక్‌రోషన్‌ దన్నుతో కొన్నేళ్లుగా ఇదో బ్రాండ్‌ను సృష్టించుకుంది. వీధివీధికీ విస్తరించింది. హృతిక్‌తో సహా ప్రస్తుత ఇన్వెస్టర్లకు ఎగ్జిట్‌ అవకాశమిస్తూ ఐపీఓకు వస్తోంది. డీఆర్‌హెచ్‌పీ దాఖలు చేసింది.  

నిజానికి లిస్టయిన... లిస్ట్‌ కాబోతున్న అచ్చమైన ఫిట్‌నెస్‌ కంపెనీలు ఈ రెండే. ఒక కథ ముగిసింది. మరో కథ మొదలవుతోంది. కానీ ఇన్వెస్టర్లు చూడాల్సింది ఇది కాదు. వీటి చుట్టూ ఉన్న ఫిట్‌నెస్‌ ఎకానమీని. 15 ఏళ్ల కిందట ఫిట్‌నెస్‌ అంటే జిమ్‌. కానీ ఇపుడది జీవనశైలి. ఆ జీవనశైలిని అనుసరించే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఇదే ఫిట్‌నెస్‌ ఎకానమీకి మూలం. ఎందుకంటే ఒకప్పుడు జిమ్‌కు వెళ్లేవారు... ఇపుడు నడుస్తున్నారు. పరుగులు పెడుతున్నారు. ట్రెక్కింగ్‌ చేస్తున్నారు. 

బ్యాడ్మింటన్, పికిల్‌ బాల్‌ ఆడుతున్నారు. స్మార్ట్‌వాచ్‌లతో అడుగులు లెక్కబెడుతున్నారు. లెక్కలు కట్టుకుని ప్రొటీన్‌ తింటున్నారు. ఏడాదికోసారి హెల్త్‌ చెకప్‌ చేయించుకుంటున్నారు. ఇవన్నీ ఇపుడు అవసరాలుగా  మారిపోయాయి. మరి ఈ ఫిట్‌నెస్‌ ఎకానమీలో మెరిసే చాన్సున్న కంపెనీలేంటి? రిటైల్‌ ఇన్వెస్టర్లు  గమనించాల్సినవేంటి? ఇవన్నీ విశ్లేషించేదే ఈ ‘సాక్షి వెల్త్‌’ స్టోరీ...

ప్రపంచ మధుమేహ రాజధానిగా మనదేశం మారటం... పెరుగుతున్న ఊబకాయం... యువతకూ గుండె సమస్యలు... ఇవన్నీ వ్యాయామాన్ని తప్పనిసరి మెడిసిన్‌ జాబితాలో చేర్చేశాయి. మధ్యతరగతి ఆదాయాలు పెరగటం... దానికి సోషల్‌ మీడియా ప్రచారం తోడవటంతో... యోగా, జిమ్, స్పోర్ట్స్‌ ఎరీనాలు, మారథాన్‌ ఈవెంట్లు, ప్రొటీన్‌ సప్లిమెంట్లు, స్మార్ట్‌వాచ్‌లు, స్పోర్ట్స్‌వేర్‌ వంటి ఫిట్‌నెస్‌ ఎకానమీ వేగంగా విస్తరిస్తోంది. ఈ ఎకానమీలో ఇన్వెస్టర్లు గమనించాల్సిన రంగాలు, కంపెనీల వివరాలివిగో...

ఫిట్‌నెస్‌ సెంటర్లు నేరుగా బయటకు కనిపించే ఈ రంగంలో లిస్టెడ్‌ ప్లేయర్లు తక్కువే. తల్వాల్కర్స్‌ జిమ్‌ గతంలో లిస్టయినా రకరకాల కారణాల వల్ల దివాలా తీసేసి డీలిస్ట్‌ అయింది. కల్ట్‌ఫిట్‌ త్వరలో ఐపీఓకు వస్తోంది. అయితే గోల్డ్స్‌ జిమ్, ఎనీటైమ్‌ ఫిట్‌నెస్, స్నాప్‌ ఫిట్‌నెస్‌ వంటి అన్‌లిస్టెడ్‌ చెయిన్లు బాగానే రాణిస్తున్నాయి. 
ఈ రంగం వేగంగా పెరుగుతున్నా... లాభాలు తక్కువేనని చెప్పాలి. పెరుగుతున్న అద్దెలు, అధిక నిర్వహణ ఖర్చులు, తరచూ మారిపోయే కస్టమర్లు, ఒక సెంటర్లో ఎక్కువ మందికి ఏకకాలంలో అవకాశం ఇవ్వలేకపోవటం వంటివి జిమ్‌ల లాభాల్ని పరిమితం చేస్తున్నాయి.

రియల్‌ ఎస్టేట్‌ 
మౌలికంగా జరుగుతున్న అతిపెద్ద మార్పు ఇదే. ఎందుకంటే పదేళ్ల కిందట ఇల్లు కొనేటపుడు ఎన్ని బెడ్‌రూమ్‌లు? అనేదే చూసేవారు. ఇపుడు క్లబ్‌హౌస్‌ ఎంత పెద్దది? అన్నదే ప్రధానం. ప్రధాన ప్రాజెక్టుల్లో ఒలింపిక్‌ సైజ్‌ స్విమింగ్‌పూల్స్, పూర్తిస్థాయి జిమ్‌లు, యోగా స్టూడియోలు, ఇండోర్‌ బ్యాడ్మింటన్, స్క్వాష్, సైక్లింగ్‌– జాగింగ్‌ ట్రాక్స్, యాక్టివిటీ పార్క్స్‌ సహజమైపోయాయి. డెవలపర్లు విక్రయిస్తున్నది కేవలం ఫ్లాట్లు కాదు. లైఫ్‌స్టైల్‌. వారి మధ్య పోటీ అంతా ఈ సౌకర్యాల్లోనే. ఈ రంగం విపరీతంగా పెరగటంతో పాటు లిస్టెడ్‌ సంస్థలూ ఎక్కువే ఉన్నాయి.  ప్రెస్టీజ్‌ ఎస్టేట్స్, బ్రిగేడ్‌ ఎంటర్‌ప్రైజెస్, గోద్రెజ్‌ ప్రాపర్టీస్, ఒబెరాయ్‌ రియల్టీ. డీఎల్‌ఎఫ్, శోభా డెవలపర్స్, కల్పతరు, లోధా, ఎన్‌సీసీ వంటి ప్రధాన కంపెనీల్ని ఇన్వెస్టర్లు వాచ్‌ చేయొచ్చు.

స్పోర్ట్స్‌ రిటైల్‌ 
జాగింగ్‌కో, వాకింగ్‌కో వెళ్లినపుడే స్పోర్ట్స్‌ షూ వేయటమనేది పోయింది. నిత్యం వాడే పాదరక్షల్లో ఇది చేరిపోయింది. ఈ మార్పు స్పోర్ట్స్‌ రిటైల్‌ను ఆకర్షణీయ రంగంగా చేసింది. డెకాథ్లాన్, అడిడాస్, నైకీ, పూమా వంటి అంతర్జాతీయ బ్రాండ్లతో పాటు... పేజ్‌ ఇండస్ట్రీస్‌ (అథ్లీజర్‌), క్యాంపస్‌ యాక్టివ్‌వేర్, బాటా, రిలాక్సో ఫుట్‌వేర్‌ వంటి లిస్టెడ్‌ సంస్థలనూ వాచ్‌లిస్ట్‌లో పెట్టుకోవచ్చు.  

న్యూట్రిషన్‌
ఫిట్‌నెస్‌పై మనసు పెట్టేవారంతా... ఎక్కువ ప్రొటీన్‌... తక్కువ చక్కెర, హెల్తీ స్నాక్స్‌ వంటివి రెగ్యులర్‌ ఆహారాల్లో భాగంగా మార్చేసుకుంటున్నారు. దీంతో ప్రొటీన్‌ ఇపుడు ప్రధాన స్రవంతిలోకి వచ్చేసింది. హెల్త్‌కార్ట్, ఫాస్ట్‌ అండ్‌ అప్, మజిల్‌ బ్లేజ్, జీఎన్‌సీ ఇండియా వంటి అన్‌లిస్టెడ్‌ కంపెనీలతో పాటు బ్రిటానియా, నెస్లే ఇండియా, టాటా కన్సూమర్‌ ప్రొడక్ట్స్‌ వంటి లిస్టెడ్‌వీ ఉన్నాయి.

హెల్త్‌కేర్‌ 
అనారోగ్య సమస్యలు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటమే ఫిట్‌నెస్‌ ఎకానమీకి మూలం. ఆసుపత్రుల కంటే డయాగ్నస్టిక్‌ కంపెనీలు, బీమా కంపెనీలు అతిపెద్ద లబి్ధదారులుగా మారబోతున్నాయి. ప్రధానంగా అపోలో హాస్పిటల్స్, డాక్టర్‌ లాల్‌ పాత్‌లాబ్స్, థైరోకేర్, మెట్రోపాలిటన్‌ హెల్త్‌కేర్, విజయా డయాగ్నస్టిక్స్‌ వంటి సంస్థలతో పాటు జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలను కూడా వాచ్‌లిస్ట్‌లో పెట్టుకోవచ్చు.

స్పోర్ట్స్‌ టూరిజం
జనం ఇపుడు మారథాన్లు, సైక్లింగ్, ట్రెక్కింగ్, ట్రయాథ్లాన్‌ వంటి స్పోర్ట్స్‌ ఈవెంట్ల కోసం రకరకాల ప్రాంతాలకు ప్రయాణిస్తున్నారు. హైదరాబాద్‌ మారథాన్, లడఖ్‌ సైక్లింగ్, అడ్వెంచరస్‌ స్పోర్ట్స్‌ వంటివేవీ పదేళ్లకిందట పెద్దగా లేవు. కానీ ఇపుడు ఫిట్‌నెస్‌తో ట్రావెల్‌ డిమాండ్‌ కూడా పెరుగుతోంది.  

స్మార్ట్‌ వేరబుల్స్‌
యాపిల్, శామ్‌సంగ్‌ వంటి విదేశీ లిస్టెడ్‌ కంపెనీలతో పాటు బోట్‌ వంటి దేశీ అన్‌లిస్టెడ్‌ సంస్థలూ వేరబుల్స్‌ మార్కెట్‌ను శాసిస్తున్నాయిపుడు. ఎందుకంటే స్మార్ట్‌వాచ్‌ అనేది కేవలం టైమ్‌ తెలియజేయటానికి కాదు. హార్ట్‌ రేట్‌ నుంచి మొదలు పెడితే... ఎన్ని అడుగులు నడిచారు? ఎంత సేపు మంచి నిద్రపోయారు? ఈసీజీ ఎలా ఉంది? ఒత్తిడి ఎంత ఉంది? కేలరీలెన్ని? ఇవన్నీ చెబుతోంది. అందుకే ఇది అతివేగంగా విస్తరిస్తూ... ఎప్పటికప్పుడు కొత్త ప్లేయర్లు ప్రవేశించడానికి కారణమవుతోంది.  

స్పోర్ట్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌
ఇపుడిపుడే ఎదుగుతున్న రంగమిది. ఒకవంక స్పోర్ట్స్‌ ఇన్‌ఫ్రాపై ప్రభుత్వాలు భారీగా వెచ్చిస్తుండగా... మరోవంక ప్రయివేటు అకాడమీలూ వేగంగా పుట్టుకొస్తున్నాయి. ప్రత్యేక మారథాన్లు, సైక్లింగ్, బ్యాడ్మింటన్, పికిల్‌బాల్‌ వంటి క్రీడల్లో ఇన్‌ఫ్రా సౌకర్యాలు కల్పిస్తూ ప్రయివేటు ప్లేయర్లు ప్రవేశిస్తున్నారు.  

వీటన్నిటినీ చూశాక అనిపించేదొకటే!. దేశంలో ఫిట్‌నెస్‌ బూమ్‌ స్పష్టంగా కనిపిస్తోంది. మరి దీని లబ్ధిదారులెవరు? ఒకటి జిమ్‌లు. 
రెండు యాక్టివ్‌ లైఫ్‌స్టయిల్‌ను అలవాటుగా మార్చే కంపెనీలు!!. 
సమాధానం రెండే. ఎందుకంటే ఒక వ్యక్తి కల్ట్‌ఫిట్‌ జిమ్‌లో చేరి... ఆ తరవాత మానేశాడనుకోండి. తన ఫిట్‌నెస్‌ ప్రయాణం ఆగిపోదు కదా!!. 
తను స్పోర్ట్స్‌ షూలు వాడతాడు. ప్రొటీన్‌ పౌడర్‌ కొంటాడు. స్మార్ట్‌ వాచ్‌ పెట్టుకుంటాడు. రోజూ వాకింగ్‌ చేస్తాడు. తన కమ్యూనిటీలో క్లబ్‌హౌస్‌ ఉంటే దాన్ని ఉపయోగించుకుంటాడు. ట్రెక్కింగ్‌కు వెళ్లడం... బ్యాడ్మింటన్‌ ఆడటం వంటివి చేస్తూనే ఉంటాడు. అంటే... తను చేసే ఖర్చు మారింది తప్ప ఆగిపోలేదు.  

రమణమూర్తి మంథా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement