భారతదేశంలో సమాచార సాంకేతిక (ఐటీ) రంగం ప్రపంచ స్థాయికి ఎదగడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తులలో నందన్ నీలేకని ఒకరు. కేవలం ఇన్ఫోసిస్ కో-ఫౌండర్‌గా మాత్రమే కాకుండా.. ఆధార్ (Aadhaar) రూపకల్పనలో చేసిన సేవలకు ఈయనకు ప్రత్యేక గుర్తింపు లభించింది. కాగా.. ఇప్పుడు పరీక్షల సంస్కరణల కోసం నీలేఖని నేతృత్వంలో హైపవర్డ్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్లు పీఎం మోదీ పేర్కొన్నారు.
ఎవరీ నందన్ నీలేకని
నందన్ నీలేకని 1955 జూన్ 2న కర్ణాటకలోని బెంగళూరులో జన్మించారు. ఆయన తండ్రి మోహన్ రావు నీలేకని టెక్స్‌టైల్ పరిశ్రమలో పనిచేసేవారు. చిన్నప్పటి నుంచే చదువులో ప్రతిభ కనబరిచిన నందన్, ఐఐటీ బాంబేలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. అక్కడే ఆయనకు సాంకేతిక రంగంపై మరింత ఆసక్తి పెరిగింది.
1981లో ఎన్.ఆర్. నారాయణ మూర్తితో కలిసి మరో ఆరుగురు సహ వ్యవస్థాపకులతో కలిసి ఇన్ఫోసిస్ (Infosys) సంస్థను ప్రారంభించారు. అప్పట్లో చిన్న స్థాయిలో మొదలైన ఈ సంస్థ, నేడు ప్రపంచంలోని ప్రముఖ ఐటీ కంపెనీలలో ఒకటిగా ఎదిగింది. కంపెనీ అభివృద్ధిలో నందన్ నీలేకని కీలక పాత్ర పోషించారు. 2002 నుంచి 2007 వరకు ఇన్ఫోసిస్ సీఈవోగా పనిచేసి సంస్థను అంతర్జాతీయ స్థాయిలో మరింత బలోపేతం చేశారు.
ఉడాయ్ చైర్మన్
2009లో ఆయన కార్పొరేట్ జీవితానికి కొంత విరామం ఇచ్చి.. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ''యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా'' (UIDAI)కి తొలి చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. దేశంలోని ప్రతి పౌరుడికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య అందించే ఆధార్ ప్రాజెక్టును విజయవంతంగా అమలు చేయడంలో ఆయన నాయకత్వం కీలకంగా నిలిచింది.
రచయితగా నీలేకని
వ్యాపారవేత్తగానే మాత్రమే కాకుండా.. రచయితగా కూడా గుర్తింపు పొందారు. 'ఇమాజినింగ్ ఇండియా' అనే పుస్తకంలో భారతదేశ భవిష్యత్తు, ఆర్థిక వ్యవస్థ, విద్య, సాంకేతికత వంటి అంశాలపై తన ఆలోచనలను వివరించారు. ఆయన రచనలు, ప్రసంగాలు యువతకు స్ఫూర్తినిస్తుంటాయి.
రాజకీయాల్లో నీలేకని
2014లో రాజకీయాల్లోకి కూడా అడుగుపెట్టి బెంగళూరు దక్షిణ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేశారు. అయితే.. ఆ ఎన్నికల్లో విజయం సాధించలేదు. అనంతరం తిరిగి ఇన్ఫోసిస్‌లో చేరి సంస్థ అభివృద్ధిలో తన పాత్రను కొనసాగించారు. ప్రస్తుతం ఆయన ఇన్ఫోసిస్‌కు నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా సేవలందిస్తున్నారు.
నందన్ నీలేకని కేవలం విజయవంతమైన వ్యాపారవేత్త మాత్రమే కాదు. డిజిటల్ ఇండియా, ఫిన్‌టెక్, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి రంగాల్లో కూడా విలువైన సూచనలు చేస్తుంటారు. భారతదేశంలో డిజిటల్ విప్లవానికి మార్గం సుగమం చేసిన ప్రముఖ వ్యక్తుల్లో ఆయన ఒకరుగా గుర్తింపు పొందారు.


