రూ. 10 బిస్కెట్ ప్యాకెట్‌లో తేడా.. రూ. 50 వేల జరిమానా! | Consumer Forum Orders Parle and Retailer to Pay 50000 for Underweight Biscuit Packet | Sakshi
Sakshi News home page

రూ. 10 బిస్కెట్ ప్యాకెట్‌లో తేడా.. రూ. 50 వేల జరిమానా!

Jul 26 2026 1:44 PM | Updated on Jul 26 2026 2:52 PM

Consumer Forum Orders Parle and Retailer to Pay 50000 for Underweight Biscuit Packet

కన్నూరు: కేరళలోని కన్నూరు జిల్లాలో వినియోగదారుల హక్కులకు సంబంధించిన ఒక కీలక తీర్పు వెలువడింది. 150 గ్రాములు ఉండాల్సిన పార్లే బిస్కెట్ ప్యాకెట్‌లో కేవలం 125 గ్రాములు మాత్రమే ఉండటంతో, వినియోగదారుడికి అనుకూలంగా కన్నూరు జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ సంచలన తీర్పునిచ్చింది. పార్లే బిస్కెట్స్ కంపెనీ, విక్రయించిన రిటైలర్ సంయుక్తంగా బాధితుడికి రూ. 50,000 నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది.

కన్నూరు జిల్లా అంజరకండికి చెందిన టీపీ ఆశిక్ అనే వ్యక్తి 2024 జూలై 26న చక్కరక్కల్ లోని మెట్రో హైపర్ మార్కెట్‌లో 150 గ్రాములుగా ముద్రించిన పార్లే 20-20 బిస్కెట్ ప్యాకెట్‌ను కొనుగోలు చేశారు. అయితే ఆ ప్యాకెట్‌పై సందేహం వచ్చి సమీపంలోని దుకాణంలో తూకం వేయగా కేవలం 125 గ్రాములు మాత్రమే ఉన్నట్లు తేలింది. దీంతో ఆయన వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. ఈ కేసు విచారణ సమయంలో, తమ ఉత్పత్తులు పూర్తిగా ఆటోమేటెడ్ ప్రక్రియ ద్వారా తయారవుతాయని, కమిషన్‌ ముందుంచిన ప్యాకెట్ తమ కంపెనీకి చెందింది కాకపోవచ్చని పార్లే వాదించింది. మరోవైపు, బిస్కెట్లను పార్లే సంస్థే తయారు చేసిందని, బరువులో తేడా ఉంటే అది తయారీదారులదే బాధ్యతని మెట్రో హైపర్ మార్కెట్ స్పష్టం చేసింది.

లీగల్ మెట్రోలాజికల్ విభాగం అందించిన నివేదికతో పాటు సాక్ష్యాధారాలను పరిశీలించిన కమిషన్ అధ్యక్షులు రవి సుష, సభ్యులు మొల్లీకుట్టి మాథ్యూ, కేపీ సజీశ్‌లతో కూడిన బెంచ్ ఈ తీర్పు వెలువరించింది. తక్కువ బరువుతో కూడిన ఉత్పత్తులను విక్రయించడం సేవలలో లోపమని, దీని నుంచి రిటైలర్ బాధ్యతను విస్మరించలేరని కమిషన్ స్పష్టం చేసింది. ఈ తీర్పు ప్రకారం పార్లే కంపెనీ రూ. 25,000 నష్టపరిహారం, రూ. 10,000 కోర్టు ఖర్చులు చెల్లించాలి. అలాగే మెట్రో హైపర్ మార్కెట్ రూ. 10,000 నష్టపరిహారం, రూ. 5,000 కోర్టు ఖర్చులు చెల్లించాలని ఆదేశించారు. ఈ మొత్తాన్ని తీర్పు వెలువడిన నెల రోజుల్లోపు చెల్లించాలని, లేని పక్షంలో వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement