పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమాన్ని పెంచుతున్న వేళ.. వాహనదారుల్లో కొత్త డౌట్లు పుట్టుకొస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం మాత్రం E20 పూర్తిగా సురక్షితమని, ఇది కాలుష్య నియంత్రణతో పాటు ముడిచమురు దిగుమతుల తగ్గింపులో కీలక అడుగు అని చెబుతోంది. అలాగే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ కొందరిపై కేసులు కూడా పెడుతోంది. ఈ నేపథ్యంలో ఈ20 పెట్రోల్‌తో తన బండి పాడైందన్న ఓ వాహనదారుడికి అనుకూలంగా తీర్పు రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఈ కేసులో వాహనదారుడికి ఊరట కల్పించింది. వాహన మరమ్మతుల ఖర్చులతో పాటు మానసిక వేదన, న్యాయపరమైన ఖర్చులకు పరిహారం చెల్లించాలని వాహన తయారీ సంస్థ, డీలర్‌ను ఆదేశించింది. తద్వారా.. దేశంలో E20 పెట్రోల్ వినియోగానికి సంబంధించి వినియోగదారుల కోర్టు ఇచ్చిన తొలి తీర్పుగా ఇది ప్రాధాన్యం సంతరించుకుంది!.
ఫిర్యాదుదారుడి వాదన ప్రకారం.. తన వాహనంలో E20 పెట్రోల్ నింపిన తర్వాత పనితీరు క్రమంగా తగ్గిపోయింది. ఇంజిన్‌లో మిస్‌ఫైరింగ్, మైలేజీ తగ్గడం, పనితీరు మందగించడం వంటి సమస్యలు ఎదురయ్యాయని తెలిపారు. సర్వీస్ సెంటర్లను ఆశ్రయించినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని, చివరకు ఇంజిన్ మరమ్మతులకు భారీగా ఖర్చు చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
అయితే వాహన తయారీ సంస్థ, డీలర్ మాత్రం ఈ ఆరోపణలను ఖండించారు. తమ వాహనం E20 ఇంధనానికి అనుకూలంగానే రూపొందించామని, సమస్యలకు ఇంధనం కారణం కాదని వాదించారు. సాధారణ అరుగుదల, నిర్వహణ లోపాలు లేదంటే ఇతర కారణాల వల్లే సమస్యలు వచ్చి ఉండొచ్చని పేర్కొన్నారు.
వినియోగదారుల కమిషన్ ఏం చెప్పిందంటే..
కమిషన్ మాత్రం వాహనదారుడి వాదనలను పరిగణనలోకి తీసుకుంది. పదేపదే సర్వీసింగ్ చేయించినప్పటికీ సమస్యలు కొనసాగడం, లోపాలను పూర్తిగా పరిష్కరించడంలో విఫలమవడం వంటి అంశాలను పరిశీలించింది. దీంతో వాహనదారుడికి పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. ఈ తీర్పులో మరో కీలక అంశం E20 లభ్యత. ప్రస్తుతం దేశంలోని చాలా పెట్రోల్ బంకుల్లో E20 ఇంధనమే సాధారణంగా అందుబాటులో ఉందని కమిషన్ పేర్కొంది. వినియోగదారులకు ప్రత్యామ్నాయ ఇంధనాన్ని ఎంచుకునే అవకాశం పరిమితంగా ఉన్నప్పుడు.. E20 వాడినందుకు వారినే బాధ్యులను చేయలేమని అభిప్రాయపడింది.
E20పై ఎందుకు చర్చ(రచ్చ)?
పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్, 80 శాతం పెట్రోల్ కలిపిన మిశ్రమాన్ని E20 పెట్రోల్ అంటారు. ముడిచమురు దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడం, కాలుష్య ఉద్గారాలను తగ్గించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఇథనాల్ మిశ్రమ ఇంధనాన్ని ప్రోత్సహిస్తోంది. అయితే పాత వాహనాల ఇంజిన్‌లు, ఫ్యూయల్ సిస్టమ్‌పై E20 ప్రభావం చూపుతుందా? అనే అనుమానాలు వాహనదారుల్లో వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఐఐటీ కాన్పూర్ పరిశోధనల్లో E20 వల్ల ఇంజిన్ నష్టానికి స్పష్టమైన ఆధారాలు లభించలేదని పేర్కొన్న నివేదికలు కూడా ఉన్నాయి.
కొత్త చర్చకు తెర
దేశవ్యాప్తంగా E20 వినియోగం విస్తరిస్తున్న సమయంలో రాయ్‌పూర్ వినియోగదారుల కమిషన్ ఇచ్చిన తీర్పు ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది. ఇంధన విధానం, వాహన తయారీ సంస్థల బాధ్యత, వినియోగదారుల హక్కులపై ఈ తీర్పు ప్రభావం చూపే అవకాశం ఉంది.


