న్యూఢిల్లీ: ఎథనాల్ కలిపిన పెట్రోల్‌పై దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ మరింత వేడెక్కింది. E20 వాడకంతో వాహనాల మైలేజీ తగ్గుతోందంటూ పలువురు వాహనదారులు ఫిర్యాదులు చేస్తున్న వేళ.. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మైలేజీ తగ్గిందనే వాదనలపై స్పందించిన ఆయన.. సాధారణంగా వాహనదారులు మైలేజీని కచ్చితంగా కొలవలేరని అంటున్నారు.
ఓ ఇంటర్వ్యూలో ఓ జర్నలిస్ట్ తన కారు మైలేజీ E20 పెట్రోల్ వాడకం తర్వాత భారీగా తగ్గిందని ప్రస్తావించారు. 2023లో కొనుగోలు చేసిన తన కారు గతంలో లీటర్‌కు 11 కిలోమీటర్లు ఇచ్చేదని, ప్రస్తుతం 7 కిలోమీటర్లకు పడిపోయిందని ఆమె తెలిపారు. దీనిపై స్పందించిన గడ్కరీ.. మైలేజీని ఎలా లెక్కించారని ప్రశ్నించారు.
డ్యాష్‌బోర్డ్‌లో కనిపించే మైలేజీ ఆధారంగానే లెక్కించినట్లు జర్నలిస్ట్ చెప్పగా.. "కారు మైలేజీని మీరు, నేను కచ్చితంగా చెక్ చేయలేం. కంపెనీ అధీకృత డీలర్ వద్ద ఉన్న పరికరాలతోనే సరైన పరీక్ష చేయగలం" అని గడ్కరీ పేర్కొన్నారు. సరైన అంచనా కోసం కంపెనీ అధీకృత డీలర్ల వద్ద పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుందని తెలిపారు.
మైలేజీ అంటే ప్రయాణించిన దూరాన్ని ఖర్చైన ఇంధన లీటర్లతో భాగించడం మాత్రమే కాదు. అలా లెక్కించడం ఒక అపోహ. వాహనం అసలు మైలేజీ తెలుసుకోవాలంటే ప్రత్యేకమైన పరికరాలతో సర్వీస్ సెంటర్‌లో పరీక్షించాలి.
Mileage is not distance divided by litres of fuel burnt. This is a misconception. You have to go to a service station where a special mileage computer can only tell the mileage. Science is done, now finish the mathspic.twitter.com/5YtZJOk53t
— Kamlesh Singh / Tau (@kkstau) July 13, 2026
E20పై ఎందుకు వివాదం?
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌లో 20 శాతం వరకు ఇథనాల్ కలిపిన E20 ఇంధనాన్ని దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ముడి చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, కాలుష్యాన్ని నియంత్రించడం, రైతులకు ప్రయోజనం కల్పించడం వంటి లక్ష్యాలతో ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. అయితే E20 పెట్రోల్ కారణంగా వాహనాల ఇంధన సామర్థ్యం తగ్గుతోందని కొంతమంది వాహనదారులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా పాత మోడల్ కార్లపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఇటీవల కేంద్ర పెట్రోలియం శాఖ కూడా కొన్ని వాహనాల్లో E20 వల్ల 3 నుంచి 5 శాతం వరకు ఇంధన సామర్థ్యం తగ్గే అవకాశం ఉందని అంగీకరించింది. అయితే మైలేజీ ఒక్కటే వాహనం పనితీరును అంచనా వేసే ప్రమాణం కాదని స్పష్టం చేసింది.
మైలేజీని ఎలా లెక్కించాలి?
ఆటోమొబైల్ నిపుణుల ప్రకారం.. కార్లలో కనిపించే డిజిటల్ మైలేజీ రీడింగ్ ఒక అంచనా మాత్రమే. వాస్తవ మైలేజీ తెలుసుకోవడానికి సాధారణంగా "ఫుల్ ట్యాంక్ మెథడ్"ను ఎక్కువగా నమ్ముతారు. దీని ప్రకారం.. ముందుగా ఇంధన ట్యాంక్‌ను పూర్తిగా నింపుకుని ట్రిప్ మీటర్‌ను రీసెట్ చేయాలి. ఆ తర్వాత సాధారణంగా వాహనం నడిపి, మళ్లీ ట్యాంక్ నింపినప్పుడు ఎన్ని లీటర్ల ఇంధనం పట్టిందో లెక్కించాలి. ప్రయాణించిన దూరాన్ని వినియోగించిన ఇంధనంతో భాగిస్తే వాస్తవ మైలేజీకి దగ్గరగా అంచనా వస్తుంది.
డీలర్ టెస్టులో ఏం చూస్తారు?
కంపెనీ అధీకృత డీలర్ల వద్ద ఉండే డయాగ్నస్టిక్ పరికరాలు కేవలం మైలేజీనే కాకుండా.. ఇంజిన్ పనితీరు, ఫ్యూయల్ ఇంజెక్టర్లు, ఆక్సిజన్ సెన్సార్లు, ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ (ECU)లోని వివరాలను కూడా పరిశీలిస్తాయి. ఇంధన వినియోగం పెరగడానికి కారణమయ్యే సాంకేతిక లోపాలను గుర్తించడంలో ఇవి ఉపయోగపడతాయి. అయితే వాహనం నడిపే విధానం, ట్రాఫిక్ పరిస్థితులు, ఏసీ వినియోగం, టైర్ ప్రెజర్, వాహన బరువు వంటి అంశాలు కూడా మైలేజీపై ప్రభావం చూపుతాయి.
విధానానికి మద్దతు.. వినియోగదారుల సందేహాలు
E20 విధానాన్ని కేంద్రం ఇంధన భద్రత, పర్యావరణ ప్రయోజనాల కోణంలో సమర్థిస్తోంది. మరోవైపు వాహనదారులు మాత్రం తమకు ఎదురవుతున్న మైలేజీ సమస్యలపై స్పష్టత కోరుతున్నారు. ఈ నేపథ్యంలో గడ్కరీ వ్యాఖ్యలు E20పై జరుగుతున్న చర్చకు మరో కోణాన్ని జోడించాయి. మైలేజీ తగ్గుదలపై నిజమైన అంచనాకు సరైన పరీక్షా విధానం అవసరమని ఆయన సూచించగా.. వినియోగదారుల అనుభవాలు, ప్రభుత్వ వాదనల మధ్య చర్చ మాత్రం కొనసాగుతోంది.


