పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమయ్యాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి చెందిన మొంబాసా, అల్ బహియాహ్ అనే రెండు చమురు ట్యాంకర్లపై ఇరాన్ క్రూయిజ్ క్షిపణులతో దాడి చేసినట్లు యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఘటనలో ఒక భారతీయ సిబ్బంది సభ్యుడు మరణించగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
దాడి ఎక్కడ జరిగింది?
ఈ రెండు ట్యాంకర్లు ఒమన్ ప్రాదేశిక జలాల్లోని హార్మూజ్ జలసంధి దక్షిణ సముద్ర మార్గంలో ప్రయాణిస్తున్న సమయంలో క్షిపణి దాడి జరిగింది. దాడి అనంతరం రెండు నౌకల్లోనూ మంటలు చెలరేగినా, అగ్నిమాపక సిబ్బంది వాటిని అదుపులోకి తీసుకొచ్చినట్లు యూఏఈ తెలిపింది. కాగా, ఈ దాడిని యూఏఈ ప్రభుత్వం అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనగా పేర్కొంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ సార్వభౌమాధికారాన్ని, జాతీయ భద్రతను కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకునే హక్కు తమకు ఉందని స్పష్టం చేసింది.
ఇక, అమెరికా ఇటీవల ఇరాన్‌పై కొత్తగా వైమానిక దాడులు జరిపిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. దీంతో మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం మరింత ఉధృతమవుతోంది. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకల భద్రతపై ఆందోళనలు పెరిగాయి.
Breaking 🚨 Just moments ago, a large shipment of smuggled weaponry destined for an Israeli cargo vessel near the Strait of Hormuz was destroyed by Iran. This is clearly visible in the footage. pic.twitter.com/YFzs2VQwMc
— Asif Ali (@AsifAli_Haider) July 14, 2026
ఇదిలా ఉండగా.. మరణించిన వ్యక్తి భారతీయుడే అని యూఏఈ ధృవీకరించింది. గాయపడిన వారిలో కూడా పలువురు భారతీయులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై భారత ప్రభుత్వం పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. హార్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు కొనసాగితే, చమురు సరఫరా మరియు ధరలపై ప్రపంచవ్యాప్తంగా ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.


