చైనా గత వారం (జులై 6) సముద్రం నుంచి ప్రయోగించే దీర్ఘ శ్రేణి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి (ఐసీబీఎం)ని పరీక్షించింది. అంతర్జాతీయ జలాల్లో జలాంతర్గామి నుంచి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణికి ఇదే తొలి పరీక్ష. ఇంకో కీలక విషయం ఏమిటంటే, 1980 తర్వాత అంతర్జాతీయ జలాల్లో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) చేపట్టిన రెండో బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం ఇదే. 2024 సెప్టెంబర్ 21న డాంగ్ ఫెంగ్ లేదా డీఎఫ్-31 వ్యవస్థతో భూమి నుంచి ప్రయోగించే ఐసీబీఎం పరీక్షను చైనా నిర్వహించింది.
తాజా పరీక్షలో పీఎల్ఏ నౌకాదళానికి చెందిన జిన్-తరగతి టైప్ 094 జలాంతర్గామి నుంచి క్షిపణిని ప్రయోగించినట్టు సమాచారం. అది నకిలీ వార్‌హెడ్‌ను మోసుకెళ్లింది. 7,300 కి.మీ. దూరం ప్రయాణించిన ఆ వార్‌హెడ్ ఫిలిప్పీన్స్‌పైగా వెళ్లి, దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో పడినట్టు తెలుస్తోంది. నౌరు, కిరిబాటి, టువాలు దేశాల ప్రత్యేక ఆర్థిక మండలాలపైగా ప్రయాణించిన ఆ వార్‌హెడ్, రరోటోంగా ఒప్పందం పరిధిలోని దక్షిణ పసిఫిక్ అణు ఆయుధ రహిత ప్రాంతంలో పడింది. అక్కడ అణు పేలుడు పరికరాల పరీక్షలు, మోహరింపు నిషేధం అమల్లో ఉంది.
ఈ క్షిపణి పరీక్ష గురించి ఏమి తెలుసు?
ఈ క్షిపణి జు లాంగ్ 2 (జేఎల్-2)నా లేదా తాజా జు లాంగ్ 3 (జేఎల్-3)నా అన్నది కచ్చితంగా చెప్పడం చాలా కష్టం. జేఎల్-2, జేఎల్-3 రెండూ జలాంతర్గామి నుంచి ప్రయోగించే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులే. వీటిని వరుసగా డీఎఫ్-31, డీఎఫ్-41 వ్యవస్థలతో కలిపి అభివృద్ధి చేశారు. సాధారణంగా ఐసీబీఎంల పరిధి కనీసం 5,000 కి.మీ. ఉంటుంది. జేఎల్-2 8,000-9,000 కి.మీ. దూరం వెళ్లగలదు. జేఎల్-3 పరిధి 9,000 కి.మీ.కుపైగా ఉంటుందని సమాచారం.
ప్రస్తుతం చైనా వినియోగిస్తున్న టైప్ 094 ఎస్‌ఎస్‌బీఎన్ జలాంతర్గాములతో ఈ రెండు వ్యవస్థలను అమర్చవచ్చు. ప్రయాణించిన దూరాన్ని బట్టి ఏ వ్యవస్థ వాడారో స్పష్టంగా చెప్పడం సాధ్యం కాదు. అయితే చైనా రెండు సార్లు పరీక్షించి ఉండవచ్చు లేదా ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకుని ఉండవచ్చు. ఎందుకంటే ఇతర దేశాల మాదిరిగానే క్షిపణి పరీక్షలు లేదా సైనిక విన్యాసాలకు ముందు చైనా నావిగేషన్ హెచ్చరిక జారీ చేస్తుంది. ఈసారి ఇచ్చిన హెచ్చరిక ప్రకారం రెండు మార్గాలను పరిశీలించింది. ఒకటి దక్షిణ చైనా సముద్రం నుంచి దక్షిణ పసిఫిక్ మహాసముద్రం వైపు ప్రయోగించడం. రెండోది ఈశాన్య ప్రాంతంలోని బొహాయ్ సముద్రం నుంచి జపాన్‌పైగా పసిఫిక్ వైపు ప్రయోగించడం. రెండో మార్గం ఉద్రిక్తతను పెంచే అవకాశం ఉండటంతో, తొలి మార్గాన్నే చైనా ఎంచుకున్నట్టు అంచనా.
బీజింగ్ ఇప్పుడు ఎందుకు పరీక్షిస్తోంది?
ఈ దశాబ్దం ఆరంభం నుంచి, ముఖ్యంగా గత రెండేళ్లలో, తన అణు సామర్థ్యాలు పెరుగుతున్నాయని బీజింగ్ బహిరంగంగానే ప్రపంచానికి చూపిస్తోంది. అమెరికా ఉపగ్రహాలు గుర్తిస్తాయని తెలిసినా దాచిపెట్టకుండా అనేక క్షిపణి సైలోలను నిర్మించింది. 2025 సైనిక పరేడ్‌లో కొత్త అణు ఆయుధ రవాణా వ్యవస్థలను ప్రదర్శించింది. 2024లో పసిఫిక్ మహాసముద్రంలో భూమి నుంచి ఐసీబీఎం పరీక్ష కూడా చేపట్టింది.
ప్రపంచం, ముఖ్యంగా అమెరికా, తన అణు సామర్థ్యాల పెరుగుదలను గుర్తించాలని చైనా కోరుకుంటోంది. భూమి, సముద్రం, గగనం నుంచి అణు ఆయుధాలను ప్రయోగించే సామర్థ్యంతో అణు త్రయం నిర్మాణాన్ని ప్రదర్శించాలన్న ప్రయత్నం కూడా ఇందులో భాగం. తొలి దాడి చేయబోమన్న అణు విధానాన్ని ప్రకటించిన దేశాలు భారత్, చైనా మాత్రమే. అందువల్ల ప్రతిదాడి సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయాలన్న లక్ష్యం కూడా ఇందులో ఉండవచ్చు. ఇవే కాదు. అణు రక్షణ కవచాన్ని నిర్మించడం, మహాశక్తి హోదా సాధించడం, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ప్రాంతీయ స్థాయి అణు ఆధిపత్యాన్ని పెంచుకోవడం వంటి లక్ష్యాలు కూడా ఈ చర్యల వెనుక ఉండవచ్చు.
చైనా అణు వ్యూహం మారిందా?
లేదు.. చైనా ప్రకటించిన అణు వ్యూహంలో ప్రధాన అంశాలు ఇవి. మొదటిది తొలి అణు దాడి చేయబోమన్న విధానం. రెండోది దాడికి ప్రతిదాడి తప్పకుండా చేస్తామన్న హామీ. మూడోది అణు ఆయుధాలు లేని దేశాలపై, అణు ఆయుధ రహిత ప్రాంతాలపై అణు ఆయుధాలను వినియోగించబోమని లేదా బెదిరించబోమని ప్రకటించడం.
ఈ అంశాల్లో మార్పు లేదు. అయితే చైనా కనీస అణు నిరోధక విధానాన్ని కూడా అనుసరిస్తోంది. ఇటీవల అణు సామర్థ్యం, వైవిధ్యం, కచ్చితత్వం, సన్నద్ధత పెరిగిన తీరు చూస్తే ఆ విధానం నుంచి దూరమవుతున్నట్టు ఆధారాలు కనిపిస్తున్నాయి. 2030 నాటికి చైనా వద్ద సుమారు 1,000 అణు వార్‌హెడ్‌లు ఉండే అవకాశం ఉంది. దాడి హెచ్చరిక అందగానే లక్ష్యాలు తాకకముందే ప్రతిదాడి ప్రారంభించే "లాంచ్ ఆన్ వార్నింగ్" సన్నద్ధత వైపు తన బలగాల్లో కొంత భాగాన్ని మార్చుతోంది. దీనిని బీజింగ్ "ఎర్లీ వార్నింగ్ కౌంటర్ స్ట్రైక్" (యుజింగ్ ఫాంజి)గా పిలుస్తోంది.
అణు కమాండ్, నియంత్రణ, సమాచార వ్యవస్థలను బలోపేతం చేస్తోంది. 10 కిలోటన్నుల కంటే తక్కువ శక్తి ఉన్న యుద్ధ వినియోగ అణు వ్యవస్థలను అభివృద్ధి చేస్తుండవచ్చు. బలమైన అణు త్రయంతో ప్రకటించిన సిద్ధాంతం, వాస్తవ అణు సామర్థ్యం మధ్య తేడా పెరుగుతోంది.
భారత్‌పై ప్రభావం ఏంటి?
మనదేశం దృష్టిలో ఈ పరీక్షతో భారత్, చైనా అణు ఆయుధ నిల్వలు, ప్రయోగ సామర్థ్యాల మధ్య వ్యూహాత్మక అంతరం మరింత స్పష్టమైంది. అరిహంత్ తరగతి ఎస్‌ఎస్‌బీఎన్ జలాంతర్గాములతో భారత్ అణు త్రయాన్ని అమల్లోకి తెచ్చింది. అయినా ప్రస్తుతం వినియోగిస్తున్న జలాంతర్గామి నుంచి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణుల పరిధి తక్కువే.
చైనా ప్రదర్శనతో భారత్ దీర్ఘ శ్రేణి కే-5, కే-6 క్షిపణులను త్వరగా మోహరించాల్సిన అవసరం పెరిగింది. అప్పుడు మాత్రమే ప్రతిదాడి సామర్థ్యంలో సమతుల్యత సాధిస్తుంది. చైనా అణు ఆధునికీకరణను చూస్తే దక్షిణాసియాలో అణు ఆయుధ పోటీ మరింత వేగం అందుకుంటుంది.
దక్షిణ చైనా సముద్రంలోని రక్షిత ప్రాంతం నుంచి జేఎల్ క్షిపణిని ప్రయోగించడం వల్ల చైనా జలాంతర్గాములను గుర్తించడం కష్టమవుతుంది. అందువల్ల భారతదేశం జలాంతర్గామి వ్యతిరేక యుద్ధ సామర్థ్యాలు, సముద్ర అడుగు ప్రాంతాల పర్యవేక్షణను కనీసం హిందూ మహాసముద్ర ప్రాంతంలో విస్తరించాలి.
అమెరికా, మిగతా ప్రపంచం దృష్టిలో ఈ ప్రయోగం చైనా అణు త్రయం పరిపక్వ స్థాయికి చేరిందనే విషయాన్ని, అణు నిరోధక సామర్థ్యం పెరిగిందనే విషయాన్ని స్పష్టంగా చూపించింది. చైనా అణు ఆధునికీకరణ గురించి అమెరికాకు ఇప్పటికే అవగాహన ఉన్నా, ఈ పరీక్ష క్షిపణి రక్షణ ప్రణాళికలను మరింత క్లిష్టం చేస్తుంది. పశ్చిమాసియా నుంచి తూర్పు ఆసియాపై దృష్టి, వనరులను మళ్లించాల్సిన పరిస్థితి తీసుకొస్తుంది. చైనా తీర ప్రాంతాలు, దక్షిణ చైనా సముద్రానికి సమీపంలో జలాంతర్గామి వ్యతిరేక యుద్ధ సామర్థ్యాలు, నిఘా వ్యవస్థలను మరింత పెంచాల్సిన అవసరం కూడా ఏర్పడుతుంది.
చైనా సామర్థ్యాలు పెరగడం వల్ల తన ప్రభావ పరిధిలో ఏ సంక్షోభం తలెత్తినా బయటి దేశాలు జోక్యం చేసుకోవడం మరింత ఖరీదైన వ్యవహారంగా మారుతుందని ప్రాంతీయ దేశాలు కూడా గుర్తిస్తాయి. డొనాల్డ్ ట్రంప్ హయాంలో అమెరికా సైనిక సాయంపై అనిశ్చితి పెరిగిన సమయంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.


