షుగర్‌ సూదులు, మందులు వద్దంటూ వైరల్‌ డైట్‌! | Viral Diabetes Diet Lands Patients in Hospitals | Sakshi
Sakshi News home page

el-tayebat: షుగర్‌ సూదులు, మందులు వద్దంటూ వైరల్‌ డైట్‌!

Jul 13 2026 2:00 PM | Updated on Jul 13 2026 2:04 PM

Viral Diabetes Diet Lands Patients in Hospitals

"మధుమేహం పూర్తిగా తగ్గిపోతుంది.. ఇక ఇన్సులిన్‌, మందులు అవసరం లేదు!" అంటూ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన ఓ డైట్‌ ఇప్పుడు కలకలం రేపుతోంది. ఈ డైట్‌ను నమ్మి వేలాది మంది షుగర్‌ పేషెంట్లు వైద్యులు సూచించిన మందులు ఆపేయడంతో.. ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. కొందరు ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతుండటంతో వైద్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

'ఎల్‌-తయ్యిబాత్‌' డైట్‌.. ఆ పదానికి అరబిక్‌లో "మంచివి" అనే అర్థం. ఈ డైట్‌ను ఈజిప్టుకు చెందిన మాజీ వైద్యుడు దియా ఎల్‌-అవాడీ (Diaa El-Awadi) విస్తృతంగా ప్రచారం చేశాడు. ఆయన ప్రకారం.. తినే తిండిలో కొన్నింటిని దూరంగా పెడితే చాలూ.. డయాబెటిస్‌ దానంతట అదే తగ్గిపోతుందట!. మధుమేహానికి అసలు కారణం కొన్ని ఆహార పదార్థాలేనని, వాటిని పూర్తిగా మానేస్తే షుగర్‌ మందులు, ఇన్సులిన్‌ అవసరమే ఉండదని దియా ఎల్‌ అవాడీ చెప్పేవాడు. ఆ డైట్‌లో.. ఆకుకూరలు, గుడ్లు, నిమ్మ, నారింజ వంటి సిట్రస్‌ పండ్లు, పప్పుధాన్యాలు, పాల ఉత్పత్తులు బంద్‌ చేయాలని సూచించాడు. సోషల్‌ మీడియాలో ఆయన వీడియోలు వైరల్‌ కావడంతో.. గుడ్డిగా ఆ మాటలు నమ్మి లక్షలాది మంది ఈ డైట్‌ను అనుసరించడం ప్రారంభించారు.

మందులు ఆపేసి... ప్రాణాల మీదకు

ఎల్‌-తయ్యిబాత్‌ డైట్‌ను నమ్మి చాలా మంది ఆస్పత్రుల పాలయ్యారు. యెమెన్‌లో ఈ బాధితుల సంఖ్య అధికంగా ఉంటోంది. 67 ఏళ్ల మురాద్‌ అల్‌-అదిమి అనే మధుమేహి కూడా ఇదే డైట్‌ను నమ్మాడు. 15 ఏళ్లుగా షుగర్‌ మందులు వాడుతున్న ఆయన.. ఈ డైట్‌ పాటిస్తే మందులు అవసరం లేదని తెలిసి వాటిని ఆపేశాడు. మొదటి కొన్ని రోజులు బాగానే అనిపించడంతో స్నేహితులకు కూడా ఇదే డైట్‌ను సూచించాడు. కానీ పదో రోజుకే ఒక్కసారిగా స్పృహ తప్పి కుప్పకూలిపోయాడు. ఆస్పత్రిలో చికిత్స అనంతరం కోలుకున్న ఆయన..

"మందుల ఖర్చు తగ్గుతుందని అనుకున్నా.. ప్రాణాలే పోయే పరిస్థితి వచ్చింది. డాక్టర్‌ సలహా లేకుండా ఎప్పుడూ మందులు ఆపొద్దు" అని హెచ్చరిస్తున్నాడు.

క్యూ కడుతున్న షుగర్‌ పేషెంట్లు
యెమెన్‌లోని తైజ్‌ రిపబ్లికన్‌ ఆస్పత్రి వైద్యుల ప్రకారం.. గత కొన్ని నెలలుగా అత్యవసర విభాగానికి వస్తున్న మధుమేహుల్లో చాలా మంది ఈ డైట్‌ను అనుసరించి మందులు మానేసినవారే. చాలామంది తీవ్రమైన షుగర్‌, డీహైడ్రేషన్‌, డయాబెటిక్‌ కీటోఅసిడోసిస్‌ వంటి ప్రమాదకర పరిస్థితులతో ఆస్పత్రిలో చేరుతున్నారని వైద్యులు చెబుతున్నారు. ప్రపంచంలోని పలుదేశాల్లోనూ ఈ తరహా డైట్‌ పాటించి పలువురు ఆస్పత్రి పాలవుతున్నారనే నివేదికలు వెలువడుతున్నాయి.

ఈ డాక్టర్‌ ఎవరంటే..
దియా ఎల్‌-అవాడీ ఒకప్పుడు ఈజిప్టులో వైద్యుడిగా పనిచేశారు. అయితే శాస్త్రీయ ఆధారాలు లేని వైద్య సలహాలు ఇస్తున్నారనే ఆరోపణలతో ఈజిప్ట్‌ వైద్య మండలి ఆయన వైద్య అనుమతిని రద్దు చేసింది. ఆయన నిర్వహిస్తున్న రెండు క్లినిక్‌లను కూడా 2026 మార్చిలో మూసివేసింది. అనంతరం యూఏఈలో ఉన్న సమయంలో 2026 ఏప్రిల్‌లో ఆకస్మిక గుండెపోటుతో ఆయన మరణించారు. యూఏఈ వైద్య నివేదిక ప్రకారం ఆయన మరణం సహజ కారణాలతోనే జరిగిందని, ఎలాంటి అనుమానాస్పద పరిస్థితులు లేవని ఈజిప్ట్‌ విదేశాంగ శాఖ ప్రకటించింది. అయితే సోషల్‌ మీడియాలో కుట్ర సిద్ధాంతాలు వైరల్‌ కావడంతో.. ఆయన ప్రచారం చేసిన ‘ఎల్‌-తయ్యిబాత్‌’ (El-Tayyebat) డైట్‌కు మరింత ప్రచారం లభించింది.

ధరలు కూడా కుప్పకూలాయి!
ఈ డైట్‌ ప్రభావం అరబ్‌ దేశాల్లోని మార్కెట్‌పైనా పడింది. గుడ్లు, చికెన్‌, ఆ డైట్‌లో ఉన్న కూరగాయలు కొనేవారి సంఖ్య ఒక్కసారిగా తగ్గిపోయింది. తైజ్‌లో గుడ్ల ట్రే ధర 3.5 డాలర్ల నుంచి 1.6 డాలర్లకు పడిపోయిందని వ్యాపారులు చెబుతున్నారు. రోజుకు 20 కోళ్లు అమ్మే దుకాణాల్లో ఇప్పుడు ఐదు కూడా అమ్ముడవడం లేదని వారు వాపోతున్నారు.

వైద్యులు ఏమంటున్నారు?
వైద్యులు, పోషకాహార నిపుణులు మాత్రం ఈ డైట్‌కు శాస్త్రీయ ఆధారాలు లేవని స్పష్టం చేస్తున్నారు. ఆకుకూరలు, గుడ్లు, పప్పుధాన్యాలు, పండ్లు వంటి ఆహారాల్లో శరీరానికి అవసరమైన.. ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్‌ పుష్కలంగా ఉంటాయని చెబుతున్నారు. వీటిని పూర్తిగా మానేయడం వల్ల పోషకాహార లోపాలు, ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మధుమేహం, రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులున్నవారు వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితిని బట్టి వైద్యులు, డైటీషియన్లు సూచించిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని సూచిస్తున్నారు.

సోషల్‌ మీడియా సలహాలొద్దు
"సోషల్‌ మీడియాలో కనిపించే ప్రతి డైట్‌ అందరికీ సరిపోదు. కొందరికి తాత్కాలికంగా ఉపశమనం కలిగించినా.. అదే అందరికీ చికిత్స కాదు. ముఖ్యంగా మధుమేహం వంటి వ్యాధుల్లో డాక్టర్‌ సూచించిన మందులను స్వయంగా ఆపేయడం ప్రాణాలకు ప్రమాదం" అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఒక్క వైరల్‌ వీడియోను నమ్మి మందులు మానేస్తే.. షుగర్‌ తగ్గకపోగా ప్రాణాలే ప్రమాదంలో పడే అవకాశం ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

గమనిక: మన దేశంలోనూ సోషల్‌ మీడియా రీల్స్‌, షార్ట్స్‌లో వైరల్‌ అయ్యే "షుగర్‌కు అద్భుత చికిత్స" వంటి వీడియోలను చూసి వైద్యుల సలహా లేకుండా మందులు ఆపేయడం ప్రాణాపాయానికి దారితీయొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement