ఒడిశాలోని బోలాంగిర్ జిల్లాలో జరిగిన ఒక ఘటన కలకలం రేగింది. కుటుంబ గొడవలో భాగంగా భార్య మొబైల్ ఫోన్‌తో తలపై గట్టిగా కొట్టడంతో ఓ భర్త మృతి చెందాడు. స్వల్ప వివాదం విషాదానికి దారితీయడంతో స్థానిక నివాసితులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
అసలేం జరిగిందంటే
పోలీసుల సమాచారం ప్రకారం శనివారం భార్యాభర్తల మధ్య ఏదో విషయంలో స్వల్ప వివాదం రేగింది. ప్రారంభమైంది. ఇది కాస్తా ముదరడంతో ఆగ్రహానికి గురైన భార్య, భర్త తలపై మొబైల్ ఫోన్‌తో బలంగా కొట్టింది. దీనితో ఆయన తలకు తీవ్ర గాయమైంది. తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తిని కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం బోలాంగిర్ జిల్లా ప్రధాన ఆసుపత్రి (DHH)కి తరలించారు. అక్కడ అతనికి వైద్యులు అత్యవసర చికిత్స అందించారు. చికిత్స అనంతరం అతని ఆరోగ్యం మెరుగుపడిందని భావించిన వైద్యులు, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయడంతో ఆయన ఇంటికి చేరుకున్నారు.
అకస్మాత్తుగా క్షీణించిన ఆరోగ్యం
అయితే, ఇంటికి వచ్చిన కొద్దిసేపటికే అతని ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. కంగారుపడిన కుటుంబ సభ్యులు మళ్లీ ఆయనను అత్యవసర చికిత్స కోసం జిల్లా ప్రధాన ఆసుపత్రికి పరుగు పరుగున తీసుకువెళ్లారు. వైద్యులు శతవిధాలా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆయన అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అసలు వారి మధ్యగొడవకు దారి తీసిన కారణాలేంటి? అతని మరణానికి గల ఖచ్చితమైన కారణాలు ఏంటి అనే విషయంపై పోలీసులు విచారణ జరుపు తున్నారు. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాతే మరణానికి గల అసలు కారణం స్పష్ట మవుతుందని అధికారులు తెలిపారు. చిన్న కుటుంబ గొడవలు ఇలాంటి దర్యాప్తులో తేలిన నిజాల ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: 82 ఏళ్ల వృద్ధుడి పెన్షన్ ఖాతాలో రూ. వందల కోట్లు, ఏం చేశాడో తెలుసా?


