గగన్‌యాన్ దిశగా భారత్ ముందడుగు | India Gaganyaan Mission Achieves Crucial Safety Milestone | Sakshi
Sakshi News home page

గగన్‌యాన్ దిశగా భారత్ ముందడుగు

Jul 13 2026 1:13 PM | Updated on Jul 13 2026 1:22 PM

India Gaganyaan Mission Achieves Crucial Safety Milestone

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘గగన్‌యాన్’ మానవసహిత అంతరిక్ష యాత్ర సాధన దిశగా మరో కీలకమైన మైలురాయిని అధిగమించింది. వ్యోమగాముల భద్రతకు ప్రధానంగా ఉన్న ‘క్రూ మాడ్యూల్’ వ్యవస్థలకు సంబంధించిన మూడు క్వాలిఫికేషన్ పరీక్షలను శాస్త్రవేత్తలు విజయవంతంగా పూర్తి చేశారు. అంతరిక్ష ప్రయాణం ముగించుకుని భూమికి తిరిగి వచ్చే క్రమంలోనూ, సముద్రంలో ల్యాండ్ అయిన తర్వాత వ్యోమగాముల ప్రాణాలకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా రక్షించే సాంకేతికతలను ఈ పరీక్షల ద్వారా ఇస్రో విజయవంతంగా పరీక్షించింది.

మొదటిది..

ఈ ‍ప్రక్రియలో మొదటిది ‘క్రూ మాడ్యూల్ అప్‌రైటింగ్ సిస్టమ్’. గగన్‌యాన్ యాత్ర ముగిసిన తర్వాత వ్యోమగాములు ప్రయాణించే క్రూ మాడ్యూల్ సురక్షితంగా భారత సముద్ర జలాల్లో ల్యాండ్ అవుతుంది. అలా పడినప్పుడు సముద్రపు అలల ఉధృతికి మాడ్యూల్ తలకిందులుగా తిరగబడే ప్రమాదం ఉంది. దీనిని నివారించడానికి ఇస్రో ప్రత్యేకంగా కోల్డ్-గ్యాస్ ఆధారిత అప్‌రైటింగ్ వ్యవస్థను రూపొందించింది. సముద్రంలో పడిన వెంటనే ఈ వ్యవస్థ యాక్టివేట్ అయి క్రూ మాడ్యూల్ నిటారుగా ఉండేలా చేస్తుంది. తాజాగా నిర్వహించిన పరీక్షలో ఫ్లోటేషన్ బ్యాగులను విజయవంతంగా ఉబ్బించి, వివిధ రకాల పీడన పరిస్థితుల్లో ఈ వ్యవస్థ కచ్చితత్వంతో పనిచేస్తుందని నిరూపించారు.

రెండవది..

రెండవది ‘అంబిలికల్ సెపరేషన్ టెస్ట్’. వ్యోమగాములు ఉండే క్రూ మాడ్యూల్‌కు అవసరమైన ఇంధనం, విద్యుత్ శక్తి, రక్షణ వ్యవస్థలకు అనుసంధానంగా ఒక ప్రత్యేక వ్యవస్థ పనిచేస్తుంది. భూ వాతావరణంలోకి తిరిగి ప్రవేశించే సమయంలో ఈ రెండు మాడ్యూళ్లు విడిపోవాల్సి ఉంటుంది. ఒక కృత్రిమ క్రూ మాడ్యూల్‌ను ఉపయోగించి ఈ వేరుపడే ప్రక్రియను విజయవంతంగా పరీక్షించారు. ఎలాంటి ఆటంకం లేకుండా అత్యంత క్లీన్‌గా ఈ సెపరేషన్ జరిగిందని ఇస్రో తెలిపింది.

మూడవది, ‘అపెక్స్ కవర్ సెపరేషన్ లోడ్స్’. క్రూ మాడ్యూల్ భూ వాతావరణంలోకి తిరిగి వచ్చేటప్పుడు ఉత్పన్నమయ్యే తీవ్రమైన వేడి, ఘర్షణ నుంచి లోపల ఉండే పారాచూట్లను రక్షించడానికి పైభాగంలో ‘అపెక్స్ కవర్’ రక్షణగా ఉంటుంది. పారాచూట్లు తెరుచుకోవడానికి ముందే ఈ అపెక్స్ కవర్ సురక్షితంగా విడిపోవాలి. ఈ కవర్ విడిపోయే సమయంలో క్రూ మాడ్యూల్ నిర్మాణంపై విపరీతమైన ఒత్తిడి పడుతుంది. అసలు మిషన్‌లో ఎదురయ్యే గరిష్ట ఒత్తిడి కంటే సుమారు 1.75 రెట్లు ఎక్కువ లోడ్‌ను కృత్రిమంగా ప్రయోగించి పరీక్షించారు. ఈ భీకర ఒత్తిడిలోనూ క్రూ మాడ్యూల్ ఆకృతి ఎక్కడా దెబ్బతినకుండా స్థిరంగా ఉందని స్పష్టమైంది.

అంతరిక్ష ప్రయోగాల్లో రాకెట్లను నింగిలోకి పంపడం ఒకెత్తయితే.. మానవసహిత మిషన్లలో వ్యోమగాములను సురక్షితంగా తిరిగి భూమికి తీసుకురావడం మరో ఎత్తు. ఇస్రో తాజాగా పూర్తి చేసిన ఈ మూడు క్వాలిఫికేషన్ పరీక్షలు కేవలం సాంకేతిక విజయాలు మాత్రమే కాదు.. వ్యోమగాముల ప్రాణాలకు ఇస్రో ఇస్తున్న అత్యున్నత రక్షణ గ్యారంటీకి నిదర్శనాలు. త్వరలోనే ప్రయోగించనున్న మానవరహిత మొదటి గగన్‌యాన్ (జీ1) మిషన్‌కు ఈ విజయాలు తిరుగులేని విశ్వాసాన్ని ఇస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ఇదీ చదవండి: కొనుగోలుదారులకు ఊరట.. దిగొచ్చిన బంగారం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement